కేసీఆర్‌‌ది నిజాంను మించిన నిరంకుశ పాలన : కోదండరాం

  • ప్రశ్నాపత్రాల లీకేజీలతో బీఆర్ఎస్ వ్యాపారం
  • నిరుద్యోగులు ఇంకా తల్లిదండ్రులపైనే ఆధారపడి బతకాల్సి వస్తున్నది
  • ఇప్పటిదాకా 200 మందిఆత్మహత్యలు చేసుకున్నరు
  • ఓటమి తెలిసి ఉద్యోగాలిస్తామంటున్న కేటీఆర్​

జమ్మికుంట, వెలుగు : అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో సీఎం కేసీఆర్​ నిజాంను మించిన నిరంకుశ పాలన చేస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. గురువారం కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి ప్రశ్నాపత్రాలు లీక్ ​చేసి బీఆర్ఎస్​సర్కార్ ​వ్యాపారం చేసిందని ఆరోపించారు.

తెలంగాణను నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలన్న విషయాన్ని  ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని మండిపడ్డారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో తెలంగాణలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులు.. తల్లిదండ్రులపై ఆధారపడి బతకాల్సి వస్తున్నదన్నారు. నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రాక ఏం చేయాలో తెలియని అయోమయంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, అయినా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం బాధాకరమన్నారు. యువతలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడంతో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కేటీఆర్ విద్యార్థుల వద్ద కూర్చొని కల్లిబొల్లి మాటలు చెబుతూ ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి ఎలాగైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేస్తున్నారన్నారు. ఈ ఉచ్చులో పడొద్దన్నారు. విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందని, కానీ, చావు నోట్లో తలపెట్టి తెచ్చానని చెబుతూ కేసీఆర్ రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు.

ప్రొఫెసర్ జయశంకర్ కలలు కలగానే మిగిలాయన్నారు. మేడిగడ్డ పరిస్థితే కేసీఆర్ ​ప్రభుత్వానికీ వస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌ ఒక్కటేనని, లిక్కర్ కేసులో కవితను అరెస్ట్​చేయకపోవడమే నిదర్శనమన్నారు. తెలంగాణలో కేసీఆర్​ నిరంకుశ పాలన పోవడంతోపాటు, అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు ఇచ్చి, నిరుద్యోగులకు భృతి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో తాము ఆ పార్టీకి మద్దతు ప్రకటించామని వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికల స్రవంతి, పొత్తూరి రమేశ్‌, శ్రీనివాస్, గణేశ్‌ పాల్గొన్నారు.