కేసీఆర్‌‌ బీసీ ద్రోహి! : బండి సంజయ్‌‌

తెలంగాణ వస్తే అన్ని వర్గాల బతుకులు బాగుపడ్తయ్‌‌, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా సామాజిక న్యాయం జరుగుతదని తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌‌ సార్​ఉద్యమ సమయంలో చెప్తుండేవారు. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లు దాటింది. కేసీఆర్‌‌ కుటుంబానికి అపరిమిత అధికారం తప్ప తెలంగాణలో ఎవరికీ న్యాయం జరగలేదు. వాళ్లకే పదవులు, వ్యాపారాలు, ఉద్యోగాలు. ఎన్నికలు వచ్చినప్పడు ఓట్ల కోసం బీసీలకు నీటి మూటల్లాంటి వరాలు ఇవ్వడం, బీసీ నాయకులను కొనుగోలు చేసి, మొత్తం బీసీలకు న్యాయం చేసినట్లు డ్రామాలాడటం కేసీఆర్‌‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇది కేసీఆర్‌‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, బీసీలను అణచివేయడానికి చేస్తున్న కుట్ర. ఒక సామాజిక వర్గం ఏ మేరకు రుణాలు పొందగలుగుతున్నది అనేది, వారి ఆర్థిక అభివృద్ధిని కొలిచే సూచిక. అందుకే, వివిధ సామాజిక వర్గాల అభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు. కానీ, తెలంగాణలో బీసీలకు అభివృద్ధి ఫలాలు అందకుండా చేస్తూ కేసీఆర్‌‌ ‘బీసీ ద్రోహి’ అవతారమెత్తారు. బీసీల సంక్షేమానికి బడ్జెట్‌‌ లో కేటాయిస్తున్న నిధులే నామమాత్రం కాగా, వాటిలో కనీసం10 శాతం కూడా ఖర్చు పెట్టడం లేదు. అందుకు ఈ ఏడాది వివిధ బీసీ కార్పొరేషన్ల నుంచి ఆర్టీఐ ద్వారా నాకు అందిన సమాచారమే సాక్ష్యం. ఎనిమిదేండ్లలో 5.70 లక్షల మంది బీసీలు స్వయం ఉపాధి లోన్లకు దరఖాస్తు చేసుకుంటే, సర్కారు కేవలం 50 వేల మందికే లోన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది.

బీసీలకు అధికారం ఏది?

మన రాష్ట్రమే బడుగు బలహీన వర్గాల రాష్ట్రమని, తర్వాతి ఏడాది నుంచి బీసీ సబ్‌‌ ప్లాన్‌‌ తీసుకొస్తమని 2017లో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్‌‌, బీసీ మంత్రులతో మీటింగ్‌‌ పెట్టి హడావిడి చేసి, తర్వాత చేతులు ఎత్తేశారు. ఈ ఐదేండ్లలో మళ్లీ దాని ఊసే లేదు. బీసీ మంత్రులు కూడా కేసీఆర్‌‌కు దాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయలే. బీసీ సబ్‌‌ ప్లాన్‌‌ తీసుకొచ్చి ఉంటే, ఏటా బీసీ సంక్షేమానికి పది వేల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌‌ వచ్చేది. వాటితో బీసీలకు ఉపాధి దొరికేది. హైదరాబాద్‌‌లో 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తమన్నరు. అవి కూడా కాగితాలకే పరిమితమైనయ్‌‌. పారిశ్రామిక రంగంలో బీసీ కులాల ప్రాధాన్యత 2 శాతం కన్నా తక్కువే. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన బీసీ విద్యార్థులకు గానీ, మేధావులకు గానీ ఎలాంటి సబ్సిడీలు లేవు. బీసీ కులాల కుటీర పరిశ్రమల ఏర్పాటుకు, వాటి ఆధునీకరణకు టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం ఇస్తలేదు. ముఖ్యమంత్రి ఆత్మీయులు స్థాపించిన ప్రైవేట్‌‌ యూనివర్సిటీల్లో బీసీ విద్యార్థులకు రిజర్వేషన్‌‌ ఉండదు. బీసీ స్కాలర్‌‌ షిప్‌‌, ఫీజు రియింబర్స్‌‌మెంట్‌‌ టైమ్​కు రావు. స్థానిక సంస్థల నుంచి శాసనసభ దాకా బీసీలకు సరైన ప్రాతినిధ్యం, ప్రాధాన్యం లేదు. 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు, లెక్క ప్రకారం 60 మంది బీసీలు ఉండాల్సిన తెలంగాణ అసెంబ్లీలో కేవలం 22 మందే ఉన్నారు. అందులో ముగ్గురికే మంత్రి పదవులు. 0.4 శాతం మంది ఉన్న ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి మాత్రం నాలుగు మంత్రి పదవులు. స్థానిక సంస్థల్లో బీసీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సంఖ్యా పరంగా 33 శాతం ఉండాల్సిన రిజర్వేషన్లను సైతం, టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం కావాలనే 15 శాతానికి తగ్గించింది. అంతర్లీనంగా ఆయనలో ఉన్న బీసీ వ్యతిరేకతకు ఇదే నిదర్శనం.

ఎన్నికలొస్తేనే..

చేనేతపై 5 శాతం జీఎస్టీ వేయాలని గతంలో కేంద్రాన్ని కోరిన మంత్రి కేటీఆర్‌‌ ఇయ్యాల యూ టర్న్‌‌ తీసుకున్నరు. మునుగోడు ఓట్ల కోసం చేనేతల మీద ప్రేమను నటిస్తున్నరు. చేనేత వస్త్రాలకు అద్దే రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పిన కేసీఆర్‌‌ ఆ హామీకి తూట్లు పొడిచారు. హ్యాండ్‌‌ లూమ్‌‌ కార్పొరేషన్‌‌, పవర్‌‌ లూం కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేస్తమని మాట తప్పారు. పైగా ఈ చేతగాని ప్రభుత్వం వల్ల తెలంగాణ ఏర్పడినప్పుడు 470 చేనేత సహకార సంఘాలు ఉంటే, ఇప్పుడు అవి 220కి తగ్గాయి. చేనేత పొదుపు పథకం కూడా నిలిచిపోయింది. ఎనిమిదేండ్లుగా నేతన్నలను బీమా కోసం, హెల్త్‌‌ కార్డుల కోసం తిప్పలు పెట్టి, ఇప్పుడు ఉప ఎన్నిక ముందు ప్రకటించి, ఏదో ఉపకారం చేసినట్టు మొసలి కన్నీరు కారుస్తున్నరు. గొల్ల కురుమలను కోటీశ్వరులను చేస్తానని కేసీఆర్‌‌ గొప్పలు చెప్పగా, ఈ నాలుగేండ్లుగా రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకమే నిలిచిపోయింది. బంగారం కుదవపెట్టి గొర్రెల యూనిట్ల కోసం వేలకు వేలు డీడీలు కట్టిన గొల్ల కురుమలకు ఎదురుచూపులే మిగిలినయ్‌‌. కేవలం ఎన్నికలు వచ్చిన చోటనే ఈ పథకాన్ని ఆగమేఘాల మీద అమలు చేస్తున్నరు. నిజంగా గొల్ల కురుమల మీద కేసీఆర్‌‌కు ప్రేమ ఉంటే ఉప ఎన్నిక వరకు ఆగేవారా? ఈ రోజు మునుగోడులోని గొల్ల కురుమల ఖాతాల్లో డబ్బులు రావడానికి బీజేపీ, ఉపఎన్నికే కారణం. అలాంటిది గొల్ల కురుమల ఖాతాల్లో డబ్బులు ఆపాలని నేను లేఖ రాశానని దుష్ప్రచారం చేయటం, టీఆర్‌‌ఎస్‌‌ స్వార్థ రాజకీయాల కుట్ర. చేప పిల్లలు వదిలినమని వార్తలు రాయించుకుంటున్నరు కానీ, వాటిని పట్టి అమ్మి లాభపడిన ముదిరాజులు, మత్స్యకారులు మాత్రం ఎక్కడా కనిపిస్తలేరు. నాయీ బ్రాహ్మణులకు మోడ్రన్‌‌ సెలూన్‌‌ రూమ్స్‌‌ ఏర్పాటు చేసి, నెలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌‌ కూడా ఇస్తమన్నరు. రజకులకు దోబీ ఘాట్లు కట్టిచ్చి, ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనులు అప్పగిస్తమని చెప్పిన్రు. ఇట్లా టీఆర్‌‌ఎస్‌‌ ప్రతి కులానికి అరచేతిలో వైకుంఠాన్ని చూపించింది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, వడ్డెర, వాల్మికి, మత్స్యకారులు, చేనేతలు, గౌడన్నలు, గొర్రెల కాపరులు, మున్నూరు కాపు, ముదిరాజులు.. ఇట్లా ఎన్నో బీసీ కులాలు తమ కుల వృత్తులు కోల్పోయి రోడ్డున పడ్డయ్‌‌. ‘బీసీ బంధు’ పథకాన్ని తీసుకొస్తేనే ఆయా వర్గాలకు కొంత మేలు జరుగుతుంది. దళిత బంధు తరహాలో ‘బీసీ బంధు’ పథకం తీసుకొస్తామని ప్రకటించిన కేసీఆర్‌‌, ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. బీసీ బంధు రావాలంటే, మునుగోడులో బీజేపీ గెలవాలే. అప్పుడే కేసీఆర్‌‌కు తాను ఇచ్చిన హామీలేంటో యాదికొస్తయి.

బీజేపీ పోరాటం ఆగదు..

వందల ఏండ్ల నుంచి మోకు ముస్తాదుతో తాటి చెట్లు ఎక్కుతూ ప్రమాదాల బారిన పడుతున్న కల్లుగీత కార్మికులకు, టెక్నాలజీ సాయం అందించి  వారి మరణాలను ఆపడంలో కేసీఆర్ సర్కారు విఫలమైంది. ఈ ఎనిమిదేండ్లలో తాటి చెట్ల మీద నుంచి కిందపడి 600 మంది ప్రాణాలు కోల్పో యారు. మరో నాలుగు వేల మంది వికలాంగులయ్యారు.  ఎలా మరణించినా, బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలనే గౌడన్నల డిమాండ్‌‌ ను  ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతి గ్రామంలో 5ఎకరాలు తాటి, ఈత వనాలకు కేటాయిస్తామని చెప్పిన 560 జీవో అమలుకే నోచుకోలే. కూల్‌‌ డ్రింక్స్‌‌కు ధీటుగా నీరా బాటిల్స్‌‌, నీరా కేంద్రాలు తీసుకొస్తామన్న మాటలన్నీ ఉత్త కథలే అయినయ్‌‌. గౌడన్నల పెన్షన్‌‌ దరఖాస్తులు స్వీకరించడం లేదు. వారికి ఇస్తానన్న మోటర్‌‌ సైకిండ్లు గురించి ప్రతి వ్యాసంలో, ప్రతి ఉపన్యాసంలో ప్రస్తావిస్తూ వస్తున్నా, ఉప ఎన్నిక వల్ల కనీసం ఇప్పుడైన కేటీఆర్‌‌కు గుర్తుకు రావడం సంతోషం. కానీ, అవి గౌడన్న చేతికి అందేవరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుంది. 

బీజేపీ ప్రభుత్వం బీసీల పక్షపాతి

బీజేపీ అంటేనే బీసీల ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాలకు సంబంధించిన 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. దేశంలో రిజర్వేషన్‌‌ ఫలాలు అన్ని కులాలకు సమానంగా అందేలా వర్గీకరిస్తున్నది. జనాభాలో పది శాతంగా ఉన్న ‘‘జాతీయ సంచార జాతుల సంక్షేమ అభివృద్ధి’’ బోర్డును కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ విద్యాలయాల్లో, సైనిక్‌‌ స్కూల్స్​లో 27 శాతం ఓబీసీలకు రిజర్వేషన్‌‌ కల్పించడం ద్వారా కొన్ని వేలమంది బీసీ విద్యార్థులకు సీట్లు వస్తున్నాయి. మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. బీసీ జాతీయ కమిషన్‌‌ కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుంది. అన్నింటికీ మించి బీసీ అయిన మోడీని రెండుసార్లు ప్రధానిగా చేయడం ద్వారా, ఆ ప్రధానమంత్రి నలభైశాతం బీసీలతో మంత్రివర్గం ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో ఉన్న బీసీల్లో ఆత్మవిశ్వాసం నింపింది. గత ప్రభుత్వాల్లో బీసీ మంత్రుల ప్రాతినిధ్యం10 శాతానికి ఎన్నడూ మించలేదు. కేసీఆర్‌‌ మంత్రివర్గంలో 60 శాతానికి పైగా మంత్రులు అగ్ర కులాలకు చెందిన వారే. పైగా ఆయన దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, వారిని కూడా మోసం చేసిన ఘనుడు.75 ఏండ్ల స్వతంత్ర భారతంలో బీజేపీ తప్ప ఏ పార్టీ ఒక బీసీ నాయకుడిని ప్రధానిని చేయలేదు. ఇది బీజేపీ సాధించిన సామాజిక న్యాయం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, ప్రస్తుతం కేంద్రంలో పంచుతున్నట్టుగానే అన్ని వర్గాలకు సమానంగా రాజ్యాధికారాన్ని, అవకాశాల్ని పంచుతుంది. మునుగోడు గెలుపుతో ఆ మిషన్‌‌ ప్రారంభం కాబోతున్నది.

- బండి సంజయ్‌‌ కుమార్‌‌,కరీంనగర్​ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు