షర్మిల పార్టీ కేసీఆర్‌‌‌‌ బాణమే!

కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని మంత్రుల వరుస కామెంట్లు.. కేసీఆర్ పదవిని వదులుకుంటే బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌‌‌‌ను సీఎం చేయాలని ప్రతిపక్షాల కౌంటర్లు కొన్ని రోజులుగా వినిపిస్తూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్‌‌‌‌ కార్యవర్గ సమావేశం పెట్టిన కేసీఆర్‌‌‌‌ ‘మరో పదేండ్లు నేనే సీఎంగా ఉంటా. పార్టీ నేతలు గీత దాటి మాట్లాడితే సస్పెండ్ చేస్తా. రాష్ట్రంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. పోయాయి’ అంటూ చేసిన కామెంట్లు హాట్‌‌‌‌ టాపిక్‌‌‌‌గా మారాయి. ఇదే టైమ్‌లో మాజీ సీఎం వైఎస్ కూతురు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబో తున్నారనే వార్త రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళాన్ని సృష్టించింది. ఆమె తెలంగాణ నేతలతో మీటింగ్స్ పెట్టి రాజన్న రాజ్యం తీసుకొస్తానని అనడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. అయితే రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందా? ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో పవర్‌‌లోకి వచ్చిన ఆ పార్టీ రాష్ట్రాన్ని గాలికొదిలేసింది. ఉద్యోగులను, నిరుద్యోగులను పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందని వారి కొత్త పార్టీని, నాయకత్వాన్ని ప్రజలు అంగీకరిస్తారా? అనే ప్రశ్న ఎదురవుతోంది.

షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు వెనుక మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. రాష్ట్రంలో బీజేపీ ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ రోజురోజుకూ బలపడుతోంది. టీఆర్ఎస్‌‌‌‌లోని కొందరు పెద్ద నాయకులతో పాటు, ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కాంగ్రెస్‌లోని బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇది కంటిన్యూ అయితే రాష్ట్రంలో బీజేపీని ఆపడం సాధ్యం కాదని సీఎం కేసీఆర్‌‌‌‌కు తెలుసు. ఇక రెండోది.. కాంగ్రెస్‌‌‌‌లో అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ నేతలు వేరే పార్టీల్లో చేరడానికి రెడీగా ఉండడంతోపాటు అందులోని బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత ప్రాంతీయ పార్టీని పెట్టి రాష్ట్రంలో అధికారానికి దూరమైన తన సామాజిక వర్గం వారిని ఒక దగ్గరకు చేర్చి అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. మరో బలమైన కారణం ఏమిటంటే కేసీఆర్‌‌‌‌ రాజకీయ ఎదుగుదల మొత్తం ఆంధ్రా వారిని తిట్టడం, వారిపై అభియోగాలు మోపడం, వారిని సాకుగా చూపుతూ తన రాజకీయ జీవితంలో ఉన్నత లక్ష్యమైన సీఎం పదవిని చేపట్టడమే గాక రెండోసారి అధికారంలోకి వచ్చారు. దీనికి ముఖ్య కారణం టీడీపీ చీఫ్‌‌‌‌ చంద్రబాబు. ఆయనను సాకుగా చూపుతూ కేసీఆర్‌‌‌‌ ఎన్నికల ప్రచారం కొనసాగించారు.

ప్రజల నమ్మకం కోల్పోయిన టీఆర్ఎస్‌‌‌‌

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బై ఎలక్షన్స్, జీహెచ్‌‌‌‌ఎంసీ ఎలక్షన్స్‌‌‌‌లో చావుదెబ్బతిన్న టీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయింది. ప్రజల నమ్మకం పొందలేక దిక్కుతోచని స్థితిలో కేసీఆర్, ఆయన పార్టీ నాయకత్వం ఉన్నాయి. తన కొడుకును సీఎం చేయాలని దానికి ముహూర్తం కూడా నిర్ణయించుకుని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌‌‌‌ల ద్వారా అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని, సొంత పార్టీలో చీలిక రావొచ్చని, కొందరు పార్టీ నాయకులు బీజేపీలో లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీ పెట్టబోయే నాయకుడి పార్టీలో చేరతారనే భయంతో దానిని వాయిదా వేశారు. అప్పటిదాకా తన కొడుకు సీఎం కావాలని కేబినెట్ మంత్రులతో ప్రకటనలు చేయించిన కేసీఆర్.. ఆ దెబ్బతో మరో పదేండ్లు నేనే సీఎంగా ఉంటా, పదవి మార్పుపై ఎవరైనా మాట్లాడితే బండకేసి కొట్టి పార్టీ నుంచి బయటకు పంపిస్తా అంటూ ప్రకటన చేశారు. దీనిని బట్టి చూస్తే కేసీఆర్‌‌‌‌లో వచ్చే ఎలక్షన్లలో ఓడిపోతాననే భయంతోపాటు రాష్ట్ర ప్రజలు తన కొడుకును సీఎంగా అంగీకరించే పరిస్థితిలో లేరని తెలుసుకునే ఇలాంటి మాటలు మాట్లాడారు.

ఆంధ్రా పదమే మళ్లీ ఆయుధంగా..

రాజకీయంగా తన పార్టీ మనుగడతోపాటు అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలంటే మళ్లీ ‘ఆంధ్రా’ అనే పదాన్నే ఆయుధంగా చేసుకోవాలని కేసీఆర్‌‌‌‌ డిసైడ్‌‌‌‌ అయ్యారు. అందుకే ఆంధ్రా ప్రాంతం వారితో తెలంగాణలో ఓ ప్రాంతీయ పార్టీ పెట్టించి, రాజకీయంగా బలమైన సామాజిక వర్గాన్ని ఆ పార్టీ వైపు మళ్లించి, ప్రతి ఎలక్షన్లలో, అలాగే అవసరమైనప్పుడల్లా ఆ పార్టీని తిడుతూ రాజకీయ సుస్థిరత సాధించాలని కేసీఆర్‌‌‌‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ‘రాజన్న రాజ్యం’ అన్న నినాదంతో షర్మిలను రాష్ట్ర రాజకీయాల్లోకి పరోక్షంగా కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. బీజేపీ వచ్చే ఎలక్షన్లలో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందనే సమాచారంతో దానిని ఎట్లైనా అడ్డుకోవాలని కొత్త పార్టీ ఏర్పాటు చేయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. మిగతా పార్టీలు దెబ్బతినాలని కేసీఆర్‌‌‌‌ కలలు కంటున్నారు.

ఏ రోజైనా తెలంగాణ గురించి మాట్లాడారా?

రాజన్న రాజ్యం అంటూ వస్తున్న షర్మిల తెలంగాణ ప్రజల సమస్యలపై ఇప్పటి వరకూ ఏ రోజైనా పోరాడారా? తాను పోరాడాలనుకుంటే తన అన్న సీఎంగా ఉన్న ఏపీలో ప్రాంతీయ పార్టీ పెట్టి ప్రజా సమస్యలపై పోరాడుతూ తెలంగాణలో కూడా పార్టీ ఏర్పాటు చేయాలి. అంతే తప్ప తెలంగాణలో వారికి ఉన్న అక్రమాస్తులను కాపాడుకునేందుకు, ధరణి పోర్టల్‌‌‌‌లో భాగంగా వెలుగు చూసిన అక్రమ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ సర్కార్‌‌‌‌ బెదిరించడం వల్ల, లేదా 2019 ఎన్నికల్లో తన అన్నకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతగా ప్రజా విశ్వాసం కోల్పోయిన కేసీఆర్‌‌‌‌ను కాపాడేందుకు కొత్త పార్టీ పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్ వదిలిన బాణంగా తెలంగాణ రాజకీయ చదరంగంలో ఒక పావుగా మారడానికి షర్మిల వస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయడానికి మాత్రం కాదు. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్‌ని, ఆయన కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని అనుకోవడం కూడా పొరపాటే.

నిజాం దొరల్లా కేసీఆర్‌‌‌‌ పాలన

త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటమి తప్పదని ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అంటూ టీఆర్ఎస్‌‌‌‌ ప్రకటనలు చేస్తొంది. కరోనా టైమ్ లో జాబ్ పోయి, వేరే ఉపాధి లేక ఇబ్బందిపడ్డ ప్రైవేట్ టీచర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు నిరుద్యోగ భృతి ఇచ్చినా వారంతా సంతోషంగా ఉండేవారు. సర్కారు ఆదుకోక పోవడంతో రోడ్లపై కూరగాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. బై ఎలక్షన్ జరిగే చోటల్లా ఓ సభ పెట్టి సమస్యల పరిష్కారానికి వందల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం, ఎలక్షన్ల తర్వాత వాటిని మర్చిపోవడం కేసీఆర్‌‌‌‌కే చెల్లింది. సీఎంగా ఉండి తనను విమర్శించిన వారిని, తమ సమస్యలు చెప్పడానికి వచ్చిన వారిని కుక్కలుగా, పిచ్చోళ్లుగా పోల్చడం ఎంతవరకు సబబు. నిజాం దొరల మాదిరిగా ఈరోజు కేసీఆర్‌‌‌‌ కూడా ప్రజలను చులకనగా చూస్తున్నారు.

డాక్టర్ కర్నాటి కిరణ్ కుమార్,
పొలిటికల్ ఎనలిస్ట్