జయశంకర్, కోదండరాంనూ కేసీఆర్ మోసం చేసిండు: షర్మిల 

హైదరాబాద్/హనుమకొండ, వెలుగు: తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ అన్యాయం చేసిండని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం కోసం1200 మంది బలిదానాలు చేసుకుంటే 500 మందికి మాత్రమే ఎంతో కొంత సహాయం చేసి చేతులు దులుపుకున్నారని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. శనివారం అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ర్టం కోసం ఎంతో పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాంలను కేసీఆర్ మోసం చేశారన్నారు. బిడ్డ కవిత ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను ఓడిపోయే చోట నిలబెట్టారన్నారు. కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా ఇవ్వలేదన్నారు. 

షర్మిలకు వరంగల్ పోలీసుల షోకాజ్ 

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు పర్మిషన్ ఎందుకు నిరాకరించకూడదో చెప్పాలని వ రంగల్ పోలీసులు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 28న నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలం లింగగిరి క్రాస్ వద్ద పాదయాత్రపై దాడి తర్వాత షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని షరతులతో పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్​ ఇచ్చినా.. పోలీసులు నిరాకరించడం చర్చనీయాంశం అయింది.