బీజేపీకి ఓటేస్తే గోదాట్లో ఏసినట్టే! : కేసీఆర్

  • నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్​ కంపెనీ: కేసీఆర్​
  • ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని మోసం చేసిండు
  • -ఫ్రీ బస్సుతో ఆడోళ్లు సిగలు పట్టుకుంటున్నరు
  • 5 నెలల్లో రాష్ట్రం ఆగమైపోయింది
  • నేను జైళ్లకు భయపడేటోన్ని కాను
  • తెలంగాణకు అన్యాయం జరిగితే  చూస్తూ ఊరుకోను
  • మంచిర్యాల రోడ్​షోలో బీఆర్ఎస్​ చీఫ్​ ప్రసంగం

మంచిర్యాల, వెలుగు:  ప్రధాని నరేంద్ర మోదీది ఉత్త గ్యాస్ కంపెనీ అని, లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్టేనని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ కామెంట్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి అకౌంట్​లో రూ.15 లక్షలు వేస్తానని మోదీ జనాన్ని మోసం చేశారని విమర్శించారు. బేటీ పఢావో.. బేటీ బచావో ఎక్కడా కనిపించడం లేదన్నారు. శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్​ షోలో కేసీఆర్​ ప్రసంగించారు. కృష్ణానదిని ఆంధ్రకు అప్పజెప్పారని, ఇక గోదావరిని తమిళనాడుకు తీసుకెళ్తామంటున్నారని, నదులుపోతే తెలంగాణ ఏం కావాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే తెలంగాణను ఆగం జేసిందని అన్నారు. కేసీఆర్ గుర్తులను చెరిపి వేస్తానంటూ  తాను ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి నిలిపేశారని ఆరోపించారు. 

సాగు, తాగునీళ్లు, కరెంట్ బంద్ అయ్యాయని, సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, విదేశీ విద్య పథకాలు వంటివి మాయమయ్యాయని చెప్పారు. రైతు రుణమాఫీ కాలేదని, రైతుబంధు రాలేదని, మహిళలకు రూ.2,500 ఇయ్యలేదని అన్నారు. ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే రైతుబంధు రద్దు చేస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఫ్రీ బస్సు ఒక్కటే అమలు చేశారని, దీంతో బస్సుల్లో ఆడోళ్లు సిగలు పట్టుకుంటున్నారని, ఆటోడ్రైవర్లు ఆగమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. వరికి రూ.500 బోనస్ బోగస్ గా మారిందని చెప్పారు. మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఫండ్స్ నిలిపివేయడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నదని,  స్ట్రీట్ లైట్లను రిపేర్లు కూడా చేయడం లేదని అన్నారు. నరేంద్రమోదీ తన మెడ మీద కత్తిపెట్టినా విదేశీ బొగ్గు దిగుమతికి ఒప్పుకోలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి అదానీతో  అగ్రిమెంట్ చేసుకున్నారని, సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారని ఆరోపించారు. నరేంద్ర మోదీ గోదావరిని తీసుకుపోయి తమిళనాడుకు ఇస్తామన్నా రేవంత్ రెడ్డి నోరు మెదపడం లేదని చెప్పారు. 

ప్రాణాలు అడ్డుపెట్టి కొట్లాడుతా..

కేసీఆర్​ను జైల్లో పెడతా అని రేవంత్​ రెడ్డి అంటున్నారని, తాను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదని కేసీఆర్​ అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే తన ప్రాణాలు అడ్డుపెట్టి కొట్లాడుతానని స్పష్టం చేశారు.ఈ ప్రభుత్వం దళితబంధు పైసలు వాపస్ తీసుకుందని, రంజాన్ తోఫాను నిలిపేసిందని, 5 నెలల్లోనే అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ల తెల్లారే కొత్త జిల్లాలను రద్దు చేస్తానంటున్నాడని, మంచిర్యాల జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ కు ఓటేసి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని కోరారు.