ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే గెలుపు: కేసీఆర్

ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే గెలుపు: కేసీఆర్
  • బీఆర్ఎస్‌‌తోనే తెలంగాణకు రక్షణ
  • కాంగ్రెస్ పాలనలో జనం కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య 
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫామ్‌‌హౌస్‌‌లో మీటింగ్ 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ఆశపెట్టిన గ్యారంటీలను నమ్మిన ప్రజలు.. ఇప్పుడు ఆ పార్టీ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్​అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌‌ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘‘బీఆర్ఎస్.. తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్థిత్వ పార్టీ. అందుకే ప్రజలు బీఆర్ఎస్‌‌ను సొంత ఇంటి పార్టీగా భావిస్తారు. ప్రస్తుతం ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. 

ఇప్పుడు వాళ్లంతా బీఆర్ఎస్​ పార్టీనే తమకు రక్షణ అని నమ్ముతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌‌హౌస్‌‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  కేసీఆర్ సమావేశమయ్యారు. దాదాపు 8 గంటల పాటు  సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..  బీఆర్ఎస్ పార్టీనే రాష్ట్రానికి రక్షణ కవచం అని అన్నారు. కాంగ్రెస్​14 నెలల పాలనతో అది రుజువైందని, కొద్ది టైంలోనే కాంగ్రెస్ సర్కార్‌‌‌‌పై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొందని చెప్పారు. 

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ సమాజానికి ఆది నుంచి వ్యతిరేకంగానే పని చేస్తున్నాయని అన్నారు. కాబట్టి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకుని, దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు.    

ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు.. 

పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్​27 నాటికి 25 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సిల్వర్​జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నేతలకు కేసీఆర్​ సూచించారు. ‘‘వరంగల్‌‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలి. అందుకు అనుగుణంగా వరంగల్‌‌ సమీపంలో విశాలమైన ప్రదేశాలను పరిశీలించి, సభా వేదికను ఖరారు చేయాలి” అని ఆదేశించారు. ‘‘పదేండ్లు రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపితే, ఇప్పుడు కాంగ్రెస్​పాలనలో ప్రజలు కష్టాలు పడే పరిస్థితి ఏర్పడింది. 

ఇలాంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న సిల్వర్​జూబ్లీ వేడుకలు కేవలం పార్టీకే పరిమితం కాదు.. యావత్​తెలంగాణ సమాజానికి సంబంధించినవి. బహిరంగ సభకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలి. త్వరలోనే కమిటీలు వేస్తాం. సభ తర్వాత పార్టీని గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయాలి. అందుకు కొత్త కమిటీలను వేస్తాం” అని తెలిపారు. 

ఎమ్మెల్సీ బరిలో ఒక్కరా? ఇద్దరా? 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై నేతల అభిప్రాయాలను కేసీఆర్​అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం పార్టీకి ఉన్న బలం పరంగా ఒక సీటు కచ్చితంగా బీఆర్ఎస్‌‌కు దక్కనుంది. అయితే, రెండో సీటులోనూ అభ్యర్థిని బరిలోకి దింపాలా? వద్దా? అన్న అంశంపై సమాలోచనలు చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సత్యవతి రాథోడ్, ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్, దాసోజు శ్రవణ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా.. ఎవరికి కన్ఫర్మ్​చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 

సత్యవతి రాథోడ్, ఆర్ఎస్​ప్రవీణ్ కుమార్‌‌‌‌లలో ఒకరికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ రెండో అభ్యర్థిని కూడా బరిలో నిలిపితే.. మిగిలిన ఇద్దరిలో ఒకరికి అవకాశం వస్తుందని అంటున్నారు. ఈ నెల 10న నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని పేర్కొంటున్నారు.