
- అవమానించేందుకే పిలిచిన్రు
- వేదికపై కూర్చునే అవకాశం ఇవ్వలేదు
- ప్రసంగించేందుకు కూడా సమయం కేటాయించలే
- సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు తాను రావట్లేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలిపారు. తనను కాంగ్రెస్ సర్కారు ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ.. నొసటితో వెక్కిరించినట్టుగా ఉందన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన తనను అవమానించారని పేర్కొన్నారు. వేడుకల వేదికపై తనకు స్థానం కల్పించలేదని, తన అనుభవాలు పంచుకోవడానికి ప్రసంగించే అవకాశం కూడా కల్పించలేదని ఆరోపించారు. తనను ఆహ్వానించినట్టే ఆహ్వానించి, అవమానించాలని ప్రభుత్వం భావించిందన్నారు.
ఈ నేపథ్యంలో తాను, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలెవరూ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావడం లేదని వెల్లడించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి కేసీఆర్ శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి, 15 ఏండ్లు ప్రజా పోరాటాన్ని నడిపించిన. రాష్ట్రంలోని, దేశంలోని పార్టీల మద్దతు కూడగట్టి, స్వరాష్ట్ర సాధనకు కేంద్ర మంత్రి పదవితోపాటు ఎంపీ పదవిని వదిలేసిన.
చివరికి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఉద్యమాన్ని విజయ తీరం చేర్చిన నన్ను మీరు ఆహ్వానించిన తీరు అవమానకరంగా ఉంది. తెలంగాణ ప్రజా పోరాటానికి నాయకత్వ స్థానంలో నిలిచిన నాకు, వేదికపై స్థానం గానీ, రాష్ట్ర సాధనలో నాకున్న అనుభవాలు పంచుకోవడానికి ప్రసంగించే అవకాశం కాని కల్పించకపోవడం మీ అహంకార, ఆధిపత్య ధోరణికి పరాకాష్ట . నన్ను ఆహ్వానించినట్టే ఆహ్వానించి, అవమానించదల్చుచుకున్న మీ దురుద్దేశాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు” అని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ ఏర్పాటు మేలి మలుపు
తెలంగాణ ఉద్యమ చరిత్రలో టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు మేలి మలుపు అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని, అమరుల త్యాగాల పర్యవసానమని కాకుండా కాంగ్రెస్ భిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్య్రాన్ని నేను మొట్టమొదట నిరసిస్తున్నాను. చరిత్ర పొడుగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసింది.
తొలిదశ ఉద్యమంలో 369 మంది యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతికి సాక్ష్యమే గన్‌పార్కు అమరవీరుల స్థూపం. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం కాంగ్రెస్ పార్టీదే” అని తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన ప్రయత్నమే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ జై తెలంగాణ అనట్లేదని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించకుండా శ్రద్ధాంజలి ఘటించకుండా తెలంగాణ మనోభావాలను గాయపరిచారన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉత్సవాలకు హాజరు కావడం లేదన్నారు.