వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు: కేసీఆర్

వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు: కేసీఆర్

హైదరాబాద్: పద్మ శ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని.. వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. "వృక్షో రక్షతి రక్షితః" అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని.. కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని కొనియాడారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. 

ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా ఆయన చేసిన త్యాగం అసమాన్యమైనదని ప్రశంసించారు. అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన తెలంగాణకు హరితహారం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య అందించిన సహకారం గొప్పదని ఈ సందర్భంగా కేసీఆర్ యాది చేసుకున్నారు. వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. శోకంలో మునిగిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వనజీవి రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


కాగా.. పద్మ శ్రీ అవార్డు గ్రహీత, పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూసిన విషయం తెలిసిందే. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. రామయ్య మృతి పట్ల పలువురు ప్రకృతి ప్రేమికులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  

కాగా, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. ప్రకృతిపై ప్రేమతో జీవితాంతం మొక్కలు నాటిన రామయ్య.. తద్వారా వనజీవిగా పేరుగాంచారు. తన జీవితంలో దాదాపు కోటికి పైగా మొక్కలు నాటి రికార్డ్ సృష్టించిన రామయ్య కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు 2017లో రామయ్యకు పద్మ శ్రీ అవార్డ్ ప్రధానం చేసింది.