లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం: సంజయ్
కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు ఉన్నరు
కేటీఆర్‌ను తిడితే పొన్నంకు ఎందుకు బాధ?
ఆయన ఎవరి కోసం కరీంనగర్ వదిలి
హుస్నాబాద్ పోయారో తెలుసని కామెంట్
కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందన్నారు.
కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఆయన పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ లో మానకొండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. వారికి సంజయ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ‘‘యాదాద్రి అక్షింతలు పంచితే అధికారంలోకి వచ్చే వాళ్లమని కేటీఆర్ అంటున్నడు.. ఆయనను పంచొద్దని ఎవరు అన్నరు? ఎవరైనా పంచకుండా ఆపారా? అయినా బీఆర్ఎస్ నేతలు కూల్చేటోళ్లు.. అధికారంలో ఉన్నన్నాళ్లు కూల్చినోళ్లే.. కానీ మేం నిర్మించేటోళ్లం. భద్రాద్రి రామాలయానికి తలంబ్రాలు కూడా తీసుకురానోడు.. ఎములాడ రాజన్నకు, కొండగట్టుకు, ధర్మపురి ఆలయాలకు డబ్బులు ఇస్తానని మోసం చేసినోడు కేసీఆర్... అలాంటోళ్లకు బీజేపీ గురించి, హిందువుల గురించి మాట్లాడే అర్హతే లేదు’’ అని అన్నారు.
రాష్ట్ర ప్రజల బతుకులను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ ను పూర్తిగా బొందపెట్టేదాకా విశ్రమించబోమని, ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయోధ్యలో రామమందిరం పూర్తికాకముందే ప్రాణప్రతిష్ట చేస్తున్నారనే విమర్శలపై స్పందిస్తూ.. ‘సాధు సంతువులు సూచించిన మంచి ముహూర్తం ప్రకారమే గృహ ప్రవేశం చేస్తారు. దీనిపై రాజకీయాలు చేయడం సరికాదు’ అని సంజయ్ అన్నారు.
పొన్నం.. నీకెందుకు రోషం?
తాను కేటీఆర్ ను తిడితే మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎందుకు కోపం వస్తున్నదని సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ నోట వెలువడే మాటలే.. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ తీరు వల్ల బీఆర్ఎస్ నాశనమైందని, పొన్నం అధికార గర్వంతో కాంగ్రెస్ నాశనమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎవరు చెబితే కరీంనగర్ ను వదిలి పొన్నం హుస్నాబాద్ పారిపోయారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తాను నిర్మాణాత్మకంగా సలహా ఇస్తుంటే వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. తన ఓపికను పరీక్షించొద్దని హెచ్చరించారు.