తెలంగాణ ఏర్పడ్డాక అవినీతి లేని పాలన అందిస్తామని సీఎం కేసీఆర్ వాగ్దానం చేశారు. ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమాలు చేసి, వందల మంది బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఆ కసితో పని చేస్తారని, ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని ప్రజలంతా ఆశించారు. కానీ సీఎం చెప్పిందొకటి.. చేసిందొకటి. అవినీతి రహిత పాలన అని చెప్పి.. పాలక వర్గాలే అవినీతికి తెరలేపాయి. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేశాయి. కేసీఆర్ అవినీతిపై సీబీఐ దర్యాప్తు అన్న ప్రచారం ఇటీవల బాగా వినిపిస్తోంది. కచ్చితంగా ఎంక్వైరీ చేసి ఆయనతో పాటు అక్రమాలకు పాల్పడిన అందరినీ కఠినంగా శిక్షించాల్సిందే. అయితే దీనికోసం ఏవో పెద్ద పెద్ద కేసుల తిరగదోడాల్సిన పని కూడా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, నయీం కేసు.. కేవలం ఈ రెండూ చాలు. సరైన దర్యాప్తు జరిగితే ప్రభుత్వంలో చాలా మంది పెద్దల అసలు రంగు బయటపడుతుంది.
రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లందించడమే తన లక్ష్యమని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని వాగ్దానం చేశారాయన. గతంలో కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తేనే నదీ జలాలను వీలైనంత ఎక్కువగా వాడుకోగలుగుతామని చెప్పారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.18 వేల కోట్ల అంచనాలతో తుమ్మిడిహట్టి వద్ద గోదావరి – ప్రాణహిత నదులపై భారీ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పనులు పెండింగ్ లో పడుతూ వచ్చి అంచనా వ్యయం ఏకంగా 38 వేల కోట్లకు చేరింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన మొదట్లో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని సీఎం కేసీఆర్ లేఖలు రాశారు.
కానీ కొద్ది రోజులకే తుమ్మిడిహట్టి వద్ద కాకుండా రీడిజైన్ పేరుతో మేడిగడ్డ వద్ద చేపట్టాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మేడిగడ్డ వద్ద దీని నిర్మాణం చేపట్టడం ద్వారా నీటి లభ్యత పెరుగుతుందని చెప్పారు.
అప్పట్లోనే తప్పుబట్టిన ఇంజనీర్లు, మేధావులు
కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, అంచనా వ్యయం పెంచిన తీరుపై అప్పట్లోనే తెలంగాణలోని ఇంజనీర్లు, మేధావులు చాలా సందర్భాల్లో తప్పుబట్టారు. ఈ ప్రాజెక్టుకు అంత వ్యయం అక్కర్లేదని చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మేధావి, ఐక్యరాజ్యసమితికి నీటి పారుదల శాఖ సలహాదారుగా పని చేసిన తోట హనుమంతరావు లెక్కలతో సహా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు అవసరం లేదని తేల్చారు. తెలంగాణ ఇంజనీర్ల ఫోరం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అంతే కాదు, తుమ్మిడిహట్టి వద్ద ఒక లిఫ్ట్ ఏర్పాటు చేస్తే నీటి లభ్యత సమస్య కాదని, అవసరమైతే మేడిగడ్డ వద్ద చిన్న ప్రాజెక్టు కట్టవచ్చని కూడా సలహాలు ఇచ్చారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా దాదాపు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేసింది. కాంట్రాక్టు పనులు అప్పగించడంలో, చేసిన పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్ని పార్టీలు, మేధావులు ఆరోపణలు చేశారు. ఈ విషయంలో నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది. నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగితే వేల కోట్ల ప్రజాధనం దోపిడీని వెలికితీయొచ్చు.
నయీం డైరీ ఏమైంది?
గ్యాంగ్ స్టర్ నయీంను పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేశారు. ఆ తర్వాత అతడి ఇంట్లో సోదాలు చేస్తే.. అక్కడ దొరికిన డబ్బు లెక్కించడానికి రెండు మూడ్రోజులు పట్టిందని అప్పట్లో వార్తలొచ్చాయి. అంటే ఎంత భారీ మొత్తంలో డబ్బు దొరికి ఉండొచ్చు? మరి ప్రభుత్వం లెక్క చూపిన డబ్బు ఎంత? ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార హక్కు కింద సేకరించిన సమాచారం ప్రకారం 18 తుపాకులు, 600 రిజిస్టర్డ్ భూమి పత్రాలు బయటపడ్డాయని తేలింది. అలాగే నయీం డైరీల్లో అతడు చేసిన అన్ని అక్రమ లావాదేవీలు, భూ కబ్జాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. వాటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ప్రభుత్వం చెప్పినా.. ఆ ఎంక్వైరీల్లో ఏం తేలిందన్నది ఇప్పటికీ మిస్టరీనే. అందులో ఉన్న వివరాల ఆధారంగా బాధితుల్లో ఒక్కరికైనా వారి ఆస్తి వారికి ఇప్పించారా? నయీం డైరీలో విషయాలను ప్రభుత్వం అసలు ఎందుకు బయట పెట్టలేదు? అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? ఎవరిని కాపాడడానికి గుప్తంగా ఉంచారు? అన్నది తేలాలి.
ప్రభుత్వ పెద్దల హస్తం!
నయీం చేసిన దారుణాల్లో ప్రభుత్వ పెద్దలు, పలు రాజకీయ పార్టీల్లోని నేతల ఇన్వాల్వ్ మెంట్ ఉండడం వల్లే అతడి డైరీలోని విషయాలు బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూముల ఆక్రమణలో సర్కారీ పెద్దలతో పాటు, వారి సన్నిహితులకు భాగం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ను జైలులో పెట్టాలంటున్న నాయకులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సీబీఐ ఎంక్వైరీ చేయించాలి. నయీం బాధితులకు న్యాయం చేయాలి. నయీం ఇంట్లో దొరికిన డబ్బు, డైరీల వివరాలు బయట పెట్టాలి.
వ్యవస్థ సక్రమంగా నడవాలంటే భయం ఉండాలె
అవినీతి రహిత పాలన అందించాలంటే ముందు పాలకుల్లో చిత్త శుద్ధి ఉండాలి. మొదట నాయకులు తప్పులు చేయకుండా ఉంటేనే… కింది స్థాయిలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడినప్పుడు కఠినంగా శిక్షించగలిగే నైతికత వస్తుంది. అందుకు అవసరమైన సీరియస్ నిర్ణయాలు, చట్టాల్లో మార్పులు సైతం చేయవచ్చు. కానీ పాలకులే అవినీతికి పాల్పడితే దిగువ స్థాయిలో వారికి భయం ఎక్కడుంటుంది. ఆ భయం కలిగించి, వ్యవస్థను సక్రమంగా నడిపించేలా ప్రక్షాళన జరగాలంటే తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షలు పడాలి. అది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే. అందుకే కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలి.
భారీగా పెరిగిన ప్రాజెక్టు ఖర్చు
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం భారీగా అంచనా వ్యయం పెంచేసింది. రేట్లు పెంచి, తమకు నచ్చిన కాంట్రాక్టరుకు ప్రాజెక్టును కట్టబెట్టి వేల కోట్లలో అవినీతి చేశారు. వాస్తవానికి తుమ్మిడిహట్టి వద్ద ఎత్తు సముద్రమట్టం నుంచి152 మీటర్లు ఉంటుంది. కాళేశ్వరం వద్ద దాని కంటే 47 మీటర్లు తక్కువే. కానీ అంచనా వ్యయం మాత్రం రూ.38 వేల కోట్ల నుంచి 80 వేల కోట్లకు పెంచేశారు. ఇప్పుడు దాని నిర్మాణ ఖర్చు ఏకంగా లక్ష కోట్ల వరకూ చేరింది. దాదాపు 40 వేల కోట్లలో పూర్తయ్యే ప్రాజెక్టు ఖర్చును రెండింతలకు పైగా పెంచారు. కానీ పెట్టిన ఖర్చుకు తగిన ఫలితాలు ఇప్పుడు కనిపించడం లేదు. ప్రాజెక్టు వ్యయం, నిర్వహణకు తగ్గ స్థాయిలో నీటి వినియోగం కనిపించడం లేదు.
– జస్టిస్ బి చంద్ర కుమార్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి
కేసీఆర్ అవినీతిపై నిగ్గు తేల్చాలె
- వెలుగు ఓపెన్ పేజ్
- December 29, 2020
లేటెస్ట్
- IPL 2025 Mega Action: వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
- ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే
- US Probe Effect: అదానీతో వ్యాపారం రద్దు చేసుకున్న ఫ్రాన్స్ కంపెనీ
- మెగా వేలంలో 20 మందిని కొన్న చెన్నై.. నెక్ట్స్ సీజన్‌కు CSK ఫుల్ స్క్వాడ్ ఇదే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- నార్మన్ పోస్టర్స్ సంస్థకు దక్కిన అమరావతి భవనాల డిజైన్ల టెండర్
- కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది
- ఐపీఎల్ మెగా వేలంలో ఏపీ క్రికెటర్ల హవా.. ఆక్షన్‌లో ముగ్గురు సోల్డ్
- ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం.. కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు
- మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్
Most Read News
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- పారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా
- Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే
- తలుపులు మూసేసి రాత్రంతా దందా.. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక దాడులు
- కార్తీకమాసం.. నవంబర్ 26 ఏకాదశి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని ఇలా పూజించండి..