మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టింది : ఇంకా ఈ దేశాన్ని ఏం చేస్తారో తెల్వదు : కేసీఆర్

ఎన్నిక‌ల్లో ఓటును అల‌వోక‌గా వేయొద్దు.. మీ త‌ల‌రాత మార్చేది.. భ‌విష్యత్‌ను తీర్చిదిద్దేది మీ ఓటే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఒక ఒరవడిలో కొట్టుకుపోకుండా మీకు మీరుగా ఆలోచించి ఓటేయాలన్నారు. విచక్షణతో ఓటేసినప్పుడే ఎన్నికల్లో ప్రజలు గెలుస్తారని, మంచి ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది.. చెడు ప్రభుత్వం వస్తే చెడు జరుగుతుందన్నారు. మీ వజ్రాయుధం మీ ఓటే.. మీ భవిష్యత్తును మార్చేది మీ ఓటే అన్నారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

ఇల్లందు ఉద్యమాలు జరిగిన ప్రాంతం.. పోరాటాల పురిటి గడ్డ అని చెప్పారు కేసీఆర్. దేశంలో ప్రజాస్వామ్య పరిణతి ఇంకా రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ వచ్చాక ఎన్ని అభివృద్ధి పనులు జరిగియో మీకే తెలుసన్నారు. మేనిఫెస్టోలో తాము పెట్టింది పది.. కానీ.. చేసింది మాత్రం వంద పనులన్నారు. దళితబంధు, రైతు బంధు పథకాలను మేనిఫెస్టోలో పెట్టలేదని చెప్పారు. ఇల్లందు నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ఇవాళ తాగునీరు అందుతోందన్నారు. దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చే ఒకే రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని తెలిపారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టిందన్నారు. అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపించారు. చివరకు దేశాన్ని ఏం చేస్తారో తెలియదన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లకు పెట్టాలంటూ తమను బెదిరించారని చెప్పారు. తన తలకాయ తెగిపడ్డా మోటార్లకు మీటర్లు పెట్టనని కేంద్రానికి చెప్పానని అన్నారు. రూ.25 వేల కోట్లు నష్టమొచ్చినా భరిస్తామని చెప్పానన్నారు. గతంలో రైతుబీమా ఎప్పుడైనా విన్నారా...? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు రైతు బంధు దుబారా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు ఉండాలా..? వద్దా..? అని ప్రశ్నించారు.

ధరణి పోర్టల్ తీసుకొచ్చాక... ఎవరి భూములు వారిపేర్లపైనే ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తమ ప్రభుత్వం గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చిందన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్ తన బిడ్డలాంటిందని, ఆమె అడిగిన అభివృద్ధి పనులన్నీ  చేసిపెడుతామని చెప్పారు.

మరోవైపు.. మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంతమంది నాయకులకు డబ్బులు వచ్చాక అహంకారం పెరిగిందని, బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీలోకి కూడా అడుగుపెట్టనీయమంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి పంపించేది మీరా..? ఆ సన్నాసులా..? అని ప్రశ్నించారు. 

రైతు బంధు దుబారా చేస్తున్నామంటూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పైనా విమర్శలు చేశారు. కరెంటు 3 గంటలు సరిపోతుందా..? అని ప్రశ్నించారు. ఇవాళ మూడు కోట్ల వరిధాన్యం తెలంగాణ పండిస్తోందన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తైతే 4 కోట్ల వరి ధాన్యం పండుతుందని చెప్పారు.

ALSO READ :- రెడీగా ఉండండి.. ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ డిటెక్టీవ్ థ్రిల్లర్