వరంగల్‎లో BRS ప్లీనరీ.. గులాబీ శ్రేణులకు కేసీఆర్ కీలక పిలుపు

వరంగల్‎లో BRS ప్లీనరీ.. గులాబీ శ్రేణులకు కేసీఆర్ కీలక పిలుపు

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లక్షలాది మందితో వరంగల్‎లో  బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, బీఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్, పార్టీ బహిరంగ సభకు సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‎లో శుక్రవారం కేసీఆర్ సుధీర్ఘంగా చర్చించారు. 

ఈ సందర్భంగానే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను వరంగల్‎లో నిర్వహించాలని.. లక్షలాది కార్యకర్తలతో భారీ బహిరంగా సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించేలా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహించాలని అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కంకణ బద్దులమై మరింతగా పోరాడుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ అని.. తెలంగాణ ప్రజల గుండెల్లో నెలువైన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు.

తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. రజతోత్సవ వేడుకల్లో తెలంగాణ సమాజమంతా భాగస్వాములే.. తెలంగాణ సమాజం గర్వించేలా వేడుకలు నిర్వహించాలన్నారు. వరంగల్‎లో తలపెట్టనున్న పార్టీ ప్లీనరీ సమావేశానికి ప్రతి జిల్లా నుంచి కార్యకర్తలని తరలించాలని.. లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ బలం ఏంటో మరోసారి చూపించాలని కీలక వ్యాఖ్యలు చేశారు.