ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : కేసీఆర్

  • పోలవరానికి ఎప్పుడైనా అడ్డం వచ్చామా?
  • వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్

వికారాబాద్ లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ .. ఏపీ సీఎం చంద్రబాబుపై సీరియస్ అయ్యారు. చంద్రబాబు హైదరాబాద్ కు శాపాలు పెడుతున్నాడనీ… హైదరాబాద్ ను కళలేకుండా చేస్తానని అంటున్నాడని కానీ.. వాస్తవం వేరేలా ఉందన్నారు. లేటెస్ట్ గా అందిన సర్వే ప్రకారం.. ఆంధ్రలో చంద్రబాబు డిపాజిట్ రాకుండా ఓడిపోబోతున్నాడని చెప్పారు కేసీఆర్.

ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది.. అది మా పాలసీ

“ప్రత్యేక హోదాకు కేసీఆర్, టీఆర్ఎస్ మద్దతిస్తున్నాడు అని ఆంధ్రలా జగన్ చెబితే.. నీకు చెవిలో చెప్పాడా అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మా మేలు మేం కోరుకుంటాం.. ఇతరుల మేలు కూడా బ్రహ్మాండంగా కోరుతాం. ఈ తెలంగాణ గడ్డ నుంచే చెబుతున్నా. చెవిలో చెప్పే బాధ్యత మాకు లేదు. చీకటి పనులు నీలాగా మేం చేయం. యాల్లపొద్దుగాల లేచి మంది గోతులు మేం తీయం. ఆ కుట్రలు తెలంగాణకు రావు. రెండు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నా. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేశవరావు రాజ్యసభలోనే చెప్పారు. మా ఎంపీలు లోక్ సభలో చెప్పారు. నేను కూడా చెబుతున్నా. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేందుకు తెలంగాణ ఎంపీలు మద్దతుగా నిలుస్తారు. 16 టీఆర్ఎస్, 1 ఎంఐఎం ఎంపీలు.. ఆంధ్రలో జగన్ కు వచ్చే సీట్లు కలిపి మేం 35 లేదా 36 ఎంపీలం అవుతాం. ఆంధ్ర ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మా పాలసీగా చెబుతున్నా” అని కేసీఆర్ చెప్పారు.

చంద్రబాబు లాంటి కిరికిరిగాళ్లతోనే మా పంచాయితీ

“పక్కోడు బాగుండాలని మేం కోరుకుంటాం. కానీ.. మంది చెడిపోవాలని నీలా సన్నాసిలా మేం కోరం. మేం బతకాలి.. ఇతరులు బతకాలి. నీకు లేదు తెలివి. నాకున్నది తెలివి. గోదావరిలో 1000 టీఎంసీలు బాజాప్తా మేం తీసుకుంటాం. పోలవరం కట్టుకుంటాం అంటే మేం అడ్డం రాలే. తెలంగాణను ముంచుతాం అంటే వద్దన్నాం కానీ.. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి సంపూర్ణ సహకారం చేస్తాం. నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి. ఈ ఏడాది కూడా 2వేల 6వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. వాటిని మీరు వాడుకుంటే మాకు అభ్యంతరం ఉండదు. మా వాటా మాకుండాలి. మా పొలాలకు పారాలి. మాతో పాటు మీరు కూడా బతకాలి అని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రజలు మంచోల్లే. చంద్రబాబూ… నీ అసోంటి పదిమంది కిరికిరిగాళ్లు ఉన్నారు అక్కడక్కడ తప్ప.. ఆంధ్ర ప్రజలతోని మాకు పంచాయతీ లేదు” అని కేసీఆర్ చెప్పారు.