- కేంద్ర నిధులను దారిమళ్లించిండు
- ఎన్నికలయ్యే దాకా సర్పంచ్ల పదవీకాలం పొడిగించాలి
- హామీల వాయిదాకే స్పెషల్ ఆఫీసర్లను
- పెడుతున్నారంటూ కాంగ్రెస్ సర్కార్‌పై ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: పదేండ్ల పాలనలో పంచా యతీరాజ్ వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేశా రని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దారిమళ్లించింద ని మండిపడ్డారు. ఎలాంటి సహకారం అందించకుండా పంచాయతీలను కేసీఆర్ ప్రభు త్వం నిర్వీర్యం చేసిందని ఫైర్ అయ్యారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. గ్రామ సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్నదని, ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నదని మండిపడ్డారు.
ఇది రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే వరకు సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. గతంలో ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను పెట్టాలని ప్రభుత్వం చూస్తున్నది. సర్పంచులు లేకపోతే గ్రామాల్లో అర్హుల ఎంపిక జరగదు. అప్పుడు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాల్సిన అవసరం ఉండదు.
మరో నెల రోజులు హామీల అమలు వాయిదా వేస్తే లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. హామీల అమలుకు అవకాశం ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం లేదు” అని విమర్శించారు. ఎన్నికల కోడ్ కు ముందే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎక్కువ సీట్లే గెలుస్తం..
రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా మీటింగులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో శుక్రవారం రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. ఇందులో పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తామన్నారు. కాగా, కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు. నిజామాబాద్ కు చెందిన ప్రముఖ సైంటిస్ట్ ఎల్లారెడ్డి, పాల్వంచకు చెందిన వ్యాపారవేత్త వినోద్ రావు, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు మాజీ ఎండీ సుధాకర్ పార్టీలో చేరారు.