ప్రజలారా.. ఈ ధర్మయుద్ధంలో నాతో కలిసిరండి - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఉద్యమకారులను వదిలి ఉద్యమద్రోహులను పక్కనపెట్టుకుండు
ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిండు
మునుగోడు బైపోల్ తెలంగాణ భవిష్యత్​ను మార్చే ఎన్నిక
ప్రజలారా.. ఈ ధర్మయుద్ధంలో నాతో కలిసిరండి
నాంపల్లి బహిరంగ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు : ‘కేసీఆర్.. తెలంగాణ పోరాటంలో అన్నీ తానై ఉద్యమించిన ఈటల రాజేందర్​ను ఏనాడైతే అవమానించి పంపించావో ఆ రోజే నీ పతనం మొదలైయింది. ఉద్యమకారులను వదిలేసి గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ లాంటి ఉద్యమ ద్రోహులను పక్కనపెట్టుకున్నావ్’ అని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి​ ఫైర్ అయ్యారు. శుక్రవారం రాత్రి నాంపల్లి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్​షాను చూస్తే కేసీఆర్​కు వణుకు పుడుతోందన్నారు. అందుకే తనను ఒక్కడిని ఓడించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి 100 మంది వచ్చారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ మాయమాటలు చెప్పి మోసం చేశారని, రాష్ట్రంలో పేదల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అందుకోసమే ఈ ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు తనతో కలిసిరావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు.

ఎనిమిదేండ్లలో పేదల బతుకులు మారలేదు...

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ సహకరించనందుకే.. నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీ ముందుకు వచ్చానని రాజగోపాల్​రెడ్డి అన్నారు. ఇప్పుడు జరిగే ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నిక అని, వెయ్యి మంది బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుం బం కోసమేనా? అని ప్రశ్నించారు. ఎనిమిదేండ్లలో పేదల బతుకులు మారలేదని, ఎవరికీ ఉద్యోగాలు రాలేదని అన్నారు. ఎవరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదని, ఉచిత విద్య అమలు కాలేదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు మునుగోడు సమస్యలపై తాను మాట్లాడినా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. జిల్లా మంత్రికి కల్యాణ లక్ష్మి చెక్కులు పంచడం తప్పితే అభివృద్ధి పనులు చేయడం తెలియదన్నారు. నిధులు తీసుకొచ్చి జిల్లాను అభివృద్ధి చేయడానికి రాని వాళ్లు, అవినీతి డబ్బు సంచులతో ఊరికి ఒక ఎమ్మెల్యేను తీసుకువచ్చి తనను ఓడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావడం మీరు చరిత్రలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. ఒక్కరోజు కూడా భూ నిర్వాసితుల పరిహారం గురించి మాట్లాడని మంత్రి హరీశ్ ​రావు.. ఈరోజు మర్రిగూడ మండలానికి వచ్చి ఓట్లు ఎలా అడుగుతున్నారంటూ ప్రశ్నించారు. ఉప ఎన్నిక స్టీరింగ్​కమిటీ చైర్మన్ ​వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా మునుగోడు జనాల కోసం ఎంతో సేవ చేశారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆయనను  గెలిపించుకోవాల్సిన బాధ్యత మునుగోడు ఓటర్లపై ఉందని అన్నారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు.