ఉద్యమకారుల ఉనికి ఉండొద్దని చూస్తుండు: వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి, మంథని, కమాన్‌పూర్, వెలుగు:తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌ను వ్యతిరేకించినోళ్లు, ఉద్యమం పేరెత్తని ద్రోహులు, ఇప్పుడు ఆయన చుట్టూ చేరిన్రు. ఆనాడు ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడినోళ్ల ఉనికి లేకుండా చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నడు” అని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ఎక్కడ మాట్లాడినా ఆంధ్రా కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ప్రచారం చేసే వాడని, కానీ రాష్ట్రం వచ్చాక ఇప్పుడు ఆయనే వారికి తెలంగాణ సంపద దోచిపెడుతున్నాడని ఆరోపించారు.
ఇక్కడి ప్రజల సొమ్మును దోచుకొని ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని బిట్టుపల్లి, కమాన్‌పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ముందుగా మంథనిలో బీజేపీ లీడర్లు, కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. భారతరత్న అంబేద్కర్, కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాకా వెంకటస్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బిట్టుపల్లిలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది, కమాన్‌పూర్‌లో దాదాపు 200 మంది వివేక్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఆయా చోట్ల వివేక్ మాట్లాడారు.
కేంద్రం ఎకరానికి 6 వేలిస్తున్నది నిజం కాదా?
అనేక కేంద్ర పథకాలను సీఎం కేసీఆర్ తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని వివేక్ ఫైర్అయ్యారు. రైతులకు కేంద్రం ఎకరానికి రూ.6 వేలు ఇస్తున్నా అసలు ఏమీ ఇయ్యనట్లే చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి స్కీమ్‌లోనూ కేంద్రానికి అధిక శాతం వాటా ఉన్నా అసలు లేనట్లే అబద్ధాలు చెబుతారని, ఇలాంటి అబద్ధాల, అవినీతి సీఎం కేసీఆర్‌కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని, ఆయన కుటుంబ సభ్యులందరూ వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు.
కాళేశ్వరంతో ఉపయోగమే లేదు..
‘‘లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మించిండు.. కానీ మంథని నియోజకవర్గానికి మాత్రం ఆ నీళ్లు వస్తలేవు.. కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసమే కట్టించిండు.. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.. ధరణి సైట్ పెట్టి సామాన్య రైతులను ఇబ్బందుల పాలుజేస్తున్నారు’’ అని వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో జనం గుణపాఠం చెప్తారన్నారు. దేశ ప్రజలంతా మోడీ వెంట ఉన్నారని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపే ఇందుకు నిదర్శనమన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి, సదాశివ్, మట్ట శంకర్, విజయరెడ్డి, శ్రీనివాస్, బాలసాని సతీష్, కారెంగుల శ్రీనివాస్, కొయ్యడ సతీష్, రాము తదితరులు పాల్గొన్నారు.