కల్వకుంట్ల కుటుంబమే రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రధాన సమస్యగా మారిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ‘‘ఎంఐఎంతో కలిసి హైదరాబాద్ లో అల్లర్లు చేయించడానికి సీఎం కేసీఆర్ సిద్ధమైండు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ ప్లాన్ జరుగుతోంది. ఎంఐఎం గూండాలను కట్టడి చేసే పనిని టీఆర్ఎస్ సర్కారు చేయట్లేదు. బీజేపీ నాయకులపై దాడి చేయమని ఎంఐఎం గూండాలను రెచ్చగొడుతున్రు’’ అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కారు ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా ప్రజాసంగ్రామ యాత్రను ఆపేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహించిన నిరసన దీక్ష ముగిసిన సందర్భంగా కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాళ్లతో వచ్చినా.. రాడ్లతో ఎదురొచ్చినా ప్రజా సంగ్రామ యాత్రను ఆపబోమన్నారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల గడీలను బద్దలు కొట్టేదాకా యాత్ర కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ ఈనెల 27న మధ్యాహ్నం 2 గంటలకు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరుగుతుందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేసినా.. ముగింపు సభను విజయవంతం చేసి తీరుతామన్నారు. టీఆర్ఎస్ సర్కారు నిర్బంధాలకు నిరసనగా ఇవాళ ఉదయం 11 నుంచి 1 గంటల వరకు నిర్వహించిన దీక్షను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆలంపూర్, దేవరుప్పులలో ప్రజలు తిరగబడ్డా టీఆర్ఎస్ సర్కారులో మార్పు రాలేదని.. ఇక సర్కారును మార్చడమే మేలని చెప్పారు. ‘‘హైదరాబాద్ లో ఎక్కడ ఐటీ దాడులు చేసినా టీఆర్ఎస్ లీడర్ల పేర్లే బయటికొస్తున్నయ్. దీన్ని బట్టి వాళ్ల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వాళ్లు చేయని దందా అంటూ ఏదీ లేదు. ఇసుక దందా.. లిక్కర్ దందా.. డ్రగ్స్ దందా.. ల్యాండ్ దందా, పత్తాల దందాలలో ప్రతీచోటా టీఆర్ఎస్ లీడర్ల జాడ కనిపిస్తోంది. ఇంకా ఏమైనా దందాలున్నా వాటిలో వాళ్ల పేర్లే బయటపడతయ్’’ అని బండి సంజయ్ ఆరోపించారు. అడ్డగోలుగా కేసీఆర్ కుటుంబం సంపాదిస్తున్న సంపాదన గురించే తాము ప్రశ్నిస్తున్నమని తెలిపారు. ‘‘కుటుంబ పాలన ఎంత ప్రమాదకరమో.. డైనింగ్ టేబుల్ నిర్ణయాల వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తోంది’’ అని ఆయన కామెంట్ చేశారు.