- రెవెన్యూ వ్యవస్థను ధ్వంసం చేసిన్రు: కోదండరాం
- కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నది
- ప్రజలు కోరిన మార్పు మొదలైంది
- రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ అభినందన సభలో కామెంట్స్
హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్వేర్ను అడ్డం పెట్టుకుని ఓ కుటుంబం భూములు దోచుకుందని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు. రాష్ట్రంలో భూ రికార్డులను ధ్వంసం చేసిందని మండిపడ్డారు. ఎన్నడూ లేనివిధంగా రెవెన్యూ వ్యవస్థపైనా దాడి చేసిందని అన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు అండగా ఉంటూ అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
స్టేట్ రెవెన్యూ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో ఎమ్మెల్సీ కోదండరాంకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు.. చీఫ్ గెస్ట్లుగా ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర రావు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడారు. ‘‘గడిచిన పదేండ్లలో సమస్యలపై మాట్లాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నది. మనం కోరుకున్న మార్పు మొదలైంది’’అని అన్నారు.
రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసిన్రు: లచ్చిరెడ్డి
గడిచిన పదేండ్లు రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యిందని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ పునర్ నిర్మాణంలో ఎమ్మెల్సీ కోదండరాం పాత్ర ఎంతో కీలకం అని అన్నారు. ‘‘రాష్ట్ర ఏర్పాటుకు కోదండరాం ఎంతో కృషి చేశారు. వ్యవస్థలన్నీ గాడిన పెట్టాల్సిన బాధ్యత సార్ పైనే ఉన్నది. అకారణంగా రెవెన్యూ శాఖ నుంచి బయటకు పంపించిన ఉద్యోగులను మళ్లీ లోపలికి తీసుకురావాలని సార్ను కోరుతున్నం. రెవెన్యూ వ్యవస్థను ధ్వంసం చేయడంతో ప్రజలకు సేవలు దూరం అయినయ్’’అని లచ్చిరెడ్డి అన్నారు.
ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారు:చిన్నారెడ్డి
ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి దక్కడం సంతోషంగా ఉందని భూ చట్టాల నిపుణుడు సునీల్ కుమార్ అన్నారు. ఈ సభలో ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర రావు, ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు అశ్వత్థామ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కుమార స్వామి, భూమన్న యాదవ్, కమలాకర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్ చౌహాన్, మహిళా అధ్యక్షురాలు రాధా తదితరులు పాల్గొన్నారు.