మీ ప్రచారం వల్లే పార్టీకి నష్టం..పార్టీ నేతలపై బీఆర్ఎస్ ​చీఫ్​కేసీఆర్ ​సీరియస్

మీ ప్రచారం వల్లే పార్టీకి నష్టం..పార్టీ నేతలపై బీఆర్ఎస్ ​చీఫ్​కేసీఆర్ ​సీరియస్
  • పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ పనైపోయిందంటూ ప్రచారం చేసిన్రు
  • ఆ నిరాశతోనే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఆ స్థానాల్లో త్వరలోనే ఉప ఎన్నికలొస్తయ్ 
  • చంద్రబాబు మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నడు 
  • నీటి వాటాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా..సర్కార్ ఏం చేయలేకపోతున్నదని ఫైర్ 
  • ఏప్రిల్ 27న పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు : పార్టీ నేతలపై బీఆర్ఎస్​ చీఫ్​కేసీఆర్​ సీరియస్​ అయ్యారు. పార్లమెంట్​ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ పనైపోయిందంటూ సొంత పార్టీ నేతలే ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ప్రచారం పార్టీకి మంచిది కాదని, అదిమానుకోవాలని హితవు పలికారు. ‘‘ఇలాంటి నెగెటివ్​ ప్రచారం వల్లే 10 మంది ఎమ్మెల్యేలు నిరాశతో పార్టీ మారారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరలోనే సుప్రీం కోర్టు తీర్పు వస్తుంది. ఆ పది స్థానాల్లోనూ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. ఇకనైనా నెగెటివ్​ ప్రచారాలు మాని పార్టీని నిలబెట్టేందుకు పని చేయాలి. 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడాలి. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ​అధికారంలోకి వస్తుంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ శ్రమించాలి” అని దిశానిర్దేశం చేశారు. బుధవారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్​ 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 

చంద్రబాబు నిర్ణయాన్ని సహించలేకపోయిన

ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కరెం ట్​చార్జీలను పెంచాలని నిర్ణయించిందని, దాన్ని తాను సహించలేకపోయానని కేసీఆర్ తెలిపారు. ‘‘ఎట్లయితే అట్లాయే.. ఈ తెలంగాణ శతాబ్దాల గోసకు ఎక్కడో ఒకచోట ఫుల్​స్టాప్​ పెట్టాల్సిందేనని గట్టిగా నిర్ణయం తీసుకున్నా. ఒక్కడిగానే బయలుదేరిన. 2000 సంవ త్సరం నుంచి మొదలైన నా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నేటికి 25 ఏండ్లకు చేరుకుంది. టీఆర్ఎస్ ​పార్టీ పెట్టినప్పుడు నాకు ఆఫీస్ కూడా దొరకనియ్యలే. కొండా లక్ష్మణ్​బాపూజీ తన నివాసం జలదృష్యంలో ఆఫీస్ ఇస్తే.. దాన్ని నాటి తెలంగాణ వ్యతిరేక చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. 

తెలంగాణ సమాజం చారిత్రక అవసరం దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ నాటి టీఆర్ఎస్​ నేటి బీఆర్ఎస్. ఆ పార్టీని నలిపేసేందుకు ఎన్నో కుట్రలు చేశారు. ఇప్పుడదే చంద్ర బాబు నాయుడు మళ్లీ తెలంగాణలో ఏదో రూపంలో అడుగు పెడుతానంటున్నడు. నీటి వాటాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది. చంద్రబాబు ఏపీకి ఎక్కువ నిధులు తీసుకుపోతున్నారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతున్నది. తెలంగాణ మళ్లీ వలసవాదుల కుట్రలకు బలికావొద్దు. గత గాయాలనుంచి కోలుకుంటున్నం. 

తిరిగి వలసవాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదముంది. అట్లా జరగకుండా తెలంగాణకు శాశ్వత న్యాయం జరగాలంటే మనం ప్రజలను తిరిగి చైతన్యం చేయాలి. తెలంగాణకు  రక్షణ కవచం బీఆర్ఎస్ ​పార్టీనే. ఆ బాధ్యత ప్రతి బీఆర్ఎస్​ పార్టీ కార్యకర్త మీద ఉంది. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేయాలి. అటు పార్టీ గెలుపు కోసం.. ఇటు ప్రజల శాశ్వత విజ యం కోసం సమాంతరంగా పని చేయాలి’’ అని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. 

శతాబ్దన్నర పాటు గోసలు.. 

తెలంగాణ సమాజం అనుభవించిన భయంకరమైన గాయాలు, కష్టాలు, బాధలు ఒక్కనాటివి కావని.. శతాబ్దన్నర పాటు అవి సాగాయని కేసీఆర్ అన్నారు. ‘‘రాచరిక పాలన, భూస్వాముల గడీలు, దొరల పీడన అంతా ఒక పెద్ద దుఃఖం. తెలంగాణ చరిత్రను అర్థం చేసుకుంటే గుండె బరువెక్కుతుంది. ఆ క్షోభను నేను దశాబ్దం పాటు అనుభవించి నలిగిపోయాను. 

ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ప్రత్యేక రాష్ట్రం వస్తుందని ఏ ఒక్కరిలోనూ నమ్మకం లేకుండే. నెత్తురు ఏరులై పారిన సందర్భంలో నా ఉద్యమ ప్రస్థానం మొదలైంది. సాయుధ పోరాటం తర్వాత తెలంగాణను ఆంధ్రాలో అన్యాయంగా కలిపారు.  ఆ తర్వాత ఏపీ ప్రాంత సీఎంలు తెలంగాణను అన్ని రకాలుగా నాశనం చేశారు” అని కేసీఆర్​ పేర్కొన్నారు. 

గంగుల, మల్లారెడ్డి రాలే.. 

ఏప్రిల్ 10 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సభ్యత్వ నమోదు ఉంటుందని కేసీఆర్ తెలిపారు. అదే నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ బలోపేతానికి సంబంధించి కమిటీలను వేయాలని కేసీఆర్ ​నిర్ణయించినట్టు తెలిసింది. ఆ కమిటీలకు ఇన్​చార్జ్​గా హరీశ్ ​రావుకు బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలంతా హాజరైనా.. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి హాజరుకాలేదు.