- కేఆర్ఎంబీ, కరువు యాత్రలు మొదలు పెట్టింది ఇక్కడి నుంచే..
- నేడు రోడ్డు షో యాత్ర కూడా నల్గొండ జిల్లా నుంచే షురూ
- కరువు, కరెంట్, కృష్ణా జలాలే లక్ష్యంగా ఎన్నికల స్టంట్
- బీఆర్ఎస్ ఇంతవరకు ఖాతా తెరవని సీటు నల్గొండ
- భువనగిరిలో తప్పని ఎదురీత
నల్గొండ, వెలుగు : నల్గొండ, భువనగిరి ఎంపీ సీట్లపై కేసీఆర్ నజర్ పెట్టిండు. నల్గొండ ఎంపీ సె గ్మెంట్లలో ఇంతవరకు బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భువనగిరిలో ఎదురీత తప్పేలా లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు, కృష్ణా జలాలు, కరెంట్ కోతలనే కేసీఆర్ ఎన్నికల స్టంట్ గా ప్రయోగిస్తున్నారు. ఈ మూడు సమస్యల మీద కేసీఆర్ తొలి సభలన్నీ నల్గొండ, సూర్యాపేట కేంద్రంగానే జరిగాయి. ఫిబ్రవరిలో కృష్ణా జలాల నీటి వాటాపై ప్రభుత్వం కేఆర్ఎంబీతో చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా కేసీఆర్ నల్గొండలో బహిరంగ సభ పెట్టారు.
అసెంబ్లీ ఎన్నికలయ్యాక కేసీఆర్ పాల్గొన్న మొదటి బహిరంగ సభ కూడా ఇదే. మళ్లీ సాగు, తాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని మార్చిలో జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కరువు యాత్ర చేపట్టారు. కానీ, సమయం కుదరక నల్గొండ పర్యటన రద్దు అయ్యింది. ఇక ఇప్పుడు నామినేషన్ల హడావుడి మొదలవడంతో కేసీఆర్ రోడ్‌షోలు షురూ చేశారు. బుధవారం సాయంత్రం మిర్యాలగూడ, సూర్యాపేటలో జరిగే రోడ్‌షోలో కేసీఆర్ పాల్గొంటారు. రాత్రి సూర్యాపేటలో బస చేస్తారు. తిరిగి మరుసటి రో జు భువనగిరి రోడ్‌షోలో పాల్గొంటారు.
పోయినచోటే వెత్కుకుంటున్న వైనం..
అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ తుడిచి పెట్టుకుపోయింది. రెండు ఎంపీ సీట్ల పరిధిలో 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందంగా, సూర్యాపేట, జనగామలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. పోయినచోటే వెతుకున్నట్టుగా కేసీఆర్ కృష్ణా జలాలను అడ్డం పెట్టుకుని రాజకీయ హైడ్రామాకు తెరలేపారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. గత పదేళ్లలో ఉమ్మడి నల్లొండ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ఇవన్నీ పక్కన పెట్టి కేఆర్ఎంబీ గురించి నల్గొండలో కేసీఆర్ మీటింగ్ పెట్టడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ మీటింగ్‌ను సక్సెస్ చేయడానికి కృష్ణా జలాల పరివాహక ప్రాంతాల పరిధిలోని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు. కానీ, కేఆర్ఎంబీపై జనంలోకి కంటే అసెంబ్లీలోనే తాడేపేడో తేల్చుకుంటే బాగుండేదని సొంత పార్టీ లీడర్లే అభిప్రాయపడ్డారు. ఇక కరువు సమస్యపై కేసీఆర్ చాలా ఆలస్యంగా మేల్కొన్నారనే చర్చ కూడా పార్టీలో జరిగింది. అప్పటికే ధాన్యం మార్కెట్లోకి రావడంతో కేసీఆర్ శ్రమ వృథా అయ్యింది.
కేసీఆర్ రాకతో ఓట్లు పెరుగుతాయనే నమ్మకం..
నల్గొండ, భువనగిరిలో ఇద్దరు బీఆర్ఎస్ఎంపీ అభ్యర్థులు కొత్తవారే.. జిల్లా రాజకీయాలపై వారికి అనుభవం లేదు. కొత్త అభ్యర్థులతో ఎంపీ ఎన్నికల్లో కలిసొచ్చిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. అసలు బీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి నల్గొండ జిల్లాలో సీనియర్లు, జనం బలం కలిగిన లీడర్లు ఉన్నప్పటికీ కొత్త వాళ్లతో ప్రయోగం చేయడంతో సొంత పార్టీ లీడర్లే విమర్శిస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇటీవల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకంగా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌తోనే గుత్తాకు కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనలో బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు.
కేసీఆర్ వచ్చినప్పుడు హంగామా చేస్తున్న మాజీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎన్నికల ప్రచారం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎంపీ ఎన్నికల ఇన్చార్జి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కదలిస్తే తప్ప పార్టీ యంత్రాంగం సొంతంగా కదిలే పరిస్థితులు లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నల్గొండ ఎంపీ సెగ్మెంట్లో 2.87 లక్షల ఓట్లు పోలుకాగా, భువనగిరి లో 5.60 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు కేసీఆర్ వస్తే తప్ప ఓట్ల శాతం పెరగదన్న అభద్రతాభావంతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.