- మునుగోడులో ఓటుకు రూ.30 వేలైనా ఇస్తడు
- ఎన్నికల కోసం ఆయన వద్ద పైసల డంప్ ఉంది
- అయినా జనం తెలివైనోళ్లని, బీజేపీనే గెలిపిస్తరని కామెంట్
యాదాద్రి, వెలుగు: రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు బంధు ఇస్తున్నామని చెప్తున్న సీఎం కేసీఆర్.. పెద్ద పెద్ద కాలేజీల ఓనర్లకూ పైసలు పంచుతున్నారని బీజేపీ స్టేట్ చీఫ్బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రైతుబంధు కింద పేద రైతుల కన్నా పెద్ద పెద్ద కాలేజీల ఓనర్లకే సర్కార్ ఎక్కువ పైసలు పంచుతోందని విమర్శించారు. బుధవారం నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు రూ. 10 వేల నుంచి రూ.20 వేలు ఇచ్చినా కేసీఆర్ను జనం ఓడించారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో ఓటుకు రూ. 30 వేలు ఇచ్చేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నారు. అదంతా మన సొమ్మే. దానిని తీసుకుని బీజేపీకి ఓటెయ్యాలె” అని ప్రజలకు సంజయ్ పిలుపునిచ్చారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి గెలిస్తే.. కేసీఆర్ అహంకారం మొత్తం దిగిపోతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండానే టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి వస్తే ఎలా విమర్శిస్తారని తప్పుపట్టారు. తమ భూములను ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రీయల్ పార్క్ కోసం లాక్కుంటున్నారని నల్లగొండ జిల్లా వెలిమినేడు గ్రామస్తులు ఈ సందర్భంగా బండి సంజయ్కు తెలిపారు. టీఆర్ఎస్ నేత పెట్టబోయే ఫార్మా కంపెనీ కోసం 300 ఎకరాల అసైన్డు భూములను లాక్కోవాలని చూస్తున్నారని తెలిపారు. రామన్నపేట మండలం ఎల్లంకిలోని ఆచార్య కూరెళ్ల గ్రంథాలయాన్ని సంజయ్ సందర్శించారు. కూరెళ్లతో కలిసి గ్రంథాలయంలో పుస్తకాలను పరిశీలించారు. లైబ్రరీ కోసం రూ. లక్ష విరాళం ప్రకటించారు.
కేసీఆర్ వద్ద డబ్బుల డంప్
పైసలు పంచి ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ డబ్బుల డంప్ ను రెడీగా పెట్టుకున్నారని బండి సంజయ్ అన్నారు. కంపెనీల నుంచి వసూలు చేసిన పైసలను దాచిపెట్టుకున్నారని, ఆ డంప్ ఎక్కడుందో కేసీఆర్ ఫ్యామిలీకే తెలుసన్నారు. ‘‘గతంలో 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుంపు కట్టిన్రని చెప్పిన. కానీ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నోళ్ల సంఖ్య మరింత పెరిగింది” అని వెల్లడించారు. టీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని కాంగ్రెస్ క్యాడర్ కూడా నమ్ముతోందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు మూసీ కాలుష్యం, ఫ్లోరైడ్ భూతంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంజయ్ అన్నారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే ప్రజలు నెలకు రూ.4 కోట్లు ఖర్చు చేసి నీళ్లు కొనుక్కుని తాగుతున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పైసల దండుగ పథకంగా మారిందన్నారు.
యాత్రలో పాల్గొన్న దాసోజు
యాదాద్రి జిల్లాలో బుధవారం ప్రజా సంగ్రామ యాత్రలో దాసోజు శ్రవణ్ కూడా పాల్గొన్నారు. చిట్యాల మండలం సుంకెనపల్లికి సంజయ్ చేరుకునే సమయానికి దాసోజు అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి సుంకెనపల్లి మీదుగా సూరారం రోడ్డు వరకు సంజయ్ వెంట నడిచారు. గుండ్రాంపల్లిలో బుధవారం ప్రారంభమైన యాత్ర 15.6 కిలోమీటర్లు సాగింది.
21న మునుగోడుకు అమిత్ షా
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 21న జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తారని సంజయ్ వెల్లడించారు. సభకు భారీ ఎత్తున తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజలంతా టీఆర్ఎస్ పాలన పట్ల విసిగిపోయారని, అందుకే వారంతా బీజేపీవైపే ఉన్నారన్నారు. ఇక్కడ బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.