![మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్](https://static.v6velugu.com/uploads/2019/03/Why-KTR-Kavitha-Mum-On-Padma-Awards-1517027554-1892.jpg)
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నేడు కరీంనగర్‌లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ రోజు స్థానిక వాణీ నికేతన్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు ఎంపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే వణుకు మొదలైందని అన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ సరళి కాంగ్రెస్‌కు సానుకూలంగా ఉండటంతో ఎంపీ అభ్యర్థులను ఆలస్యంగా ఎంపిక చేశారన్నారు. 16 సీట్లు గెలిస్తే కేంద్రం లో చక్రం తిప్పొచ్చు అంటున్న టీఆర్ఎస్ నాయకులు.. ఇప్పటికే ఉన్న 16 మందితో ఏం సాధించారని పొన్నం ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఎంపీలు కేంద్రం నుంచి నిధులు తేవడంలో పూర్తి విఫలమయ్యారని.. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను మార్చడమే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన నాయకులకు నిరసనగా.. తమ పార్టీకి చెందిన 17 మంది లోక్ సభ అభ్యర్ధులు అంతా కలిసి నల్లగుడ్డతో నిరసన తెలుపుతామని పొన్నం తెలిపారు.