- ఉత్తర్వులు లేకుండా ఫోన్లోనే ‘పెద్దసారు’ ఆర్డర్స్
- చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోయామంటున్న ఆఫీసర్లు
- డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించడంలోనూ అదే విధానం
- మౌఖిక ఆదేశాలతోనే అన్నారం, సుందిళ్ల లొకేషన్ల మార్పు
- కొత్త లొకేషన్లలో టెస్టులు చేసినా.. పాత డిజైన్లే కొనసాగింపు
- పెద్దలు చెప్పినట్టు చేసి ఇరుక్కుపోయిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో లొకేషన్ల దగ్గర్నుంచి.. డిజైన్ల వరకు, వ్యయ అంచనాల నుంచి లోన్ల వరకు అంతా ‘పెద్ద సార్’ చెప్పినట్టే జరిగింది. ఫోన్లో, నోటి మాటలతో చెప్పగానే అధికారులు ఉరుకులు పరుగుల మీద పనికానిచ్చేశారు. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణలో ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ‘హెడ్ ఆఫ్ ద స్టేట్/పెద్దసారు’ చెప్పినట్టే చేశామని విచారణకు వచ్చిన అధికారులంతా ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉన్నారు. అయితే, ప్రాజెక్టుకు సంబంధించిన కీలకాంశాలను కేబినెట్లో చర్చించాకే ముందుకు వెళ్లాల్సి ఉన్నా.. నేరుగా నోటి మాట ద్వారానే ఆ పెద్దసారు ఆదేశాలిచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తొలుత ప్రాజెక్ట్‌కు వ్యాప్కోస్ తయారు చేసిన డీపీఆర్‌కు సంబంధించి హైపవర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నా.. దాన్ని ఆమోదిస్తున్నట్టు కనీసం ఆర్డర్లు కూడా రిలీజ్ చేయలేదు. హైపవర్ కమిటీ మీటింగ్‌లో తీసుకున్న డెసిషన్‌తోనే డీపీఆర్‌కు ఎలా ఆమోదం తెలుపుతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమోదం తెలిపిన డీపీఆర్‌ను సర్కారు ఆర్డర్స్ లేకుండా సీడబ్ల్యూసీకి ఎలా పంపించారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కమిషన్.. డాక్యుమెంట్లను అడుగుతుండడంతో అధికారులు తెల్లముఖం వేస్తున్నారు. నాడు పెద్దసార్ చెప్పినట్టే చేశామంటున్న అధికారులు.. ఇప్పుడు పెద్దసారు నుంచి వచ్చిన ఆదేశాల రికార్డులు లేకపోవడంతో అడ్డంగా ఇరుక్కుపోతున్నారు.
లొకేషన్లదీ అదే పరిస్థితి
వాస్తవానికి తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ లొకేషన్‌ను మార్చేటప్పుడూ ఒక్క నోటిమాట ద్వారానే అధికారులకు ఆదేశాలు అందాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర సీఎంతో మీటింగ్ జరగ్గానే అందుకు నాటి సీఎం ప్రాజెక్ట్ లొకేషన్ మార్పునకు నిర్ణయం తీసుకున్నారన్న చర్చ జరుగుతున్నది. ఇక, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ల విషయంలోనూ పెద్దసారు ఇలాగే వ్యవహరించారని చెబుతున్నారు. ఆ 2 బ్యారేజీలను ప్రస్తుతం ఉన్న చోటుకు కిలోమీటర్ పరిధిలో అటూ ఇటూ లొకేషన్‌ను మార్చారని అంటున్నారు. లొకేషన్ల విషయంలోనూ అదే రీతిలో పెద్దసారు నిర్ణయాలున్నాయని చెబుతున్నారు.
వాస్తవానికి పాత లొకేషన్లకు వేసిన డిజైన్లతోనే కొత్త లొకేషన్లలో బ్యారేజీలు కట్టారన్న ఆరోపణలున్నాయి. కొత్త లొకేషన్లలో ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పటికీ.. పాత లొకేషన్లలోని డిజైన్లను కొంచెమైనా మార్చకుండా బ్యారేజీలు కట్టేశారని చెబుతున్నారు. దానికి కూడా ప్రభుత్వాధినేత నుంచే ఆదేశాలు వెళ్లాయని అంటున్నారు. ఈ లొకేషన్ల మార్పు, పాత డిజైన్లతోనే నిర్మాణాలు చేపట్టడం వంటి వాటికి సంబంధించి కూడా ఎలాంటి ఫార్మల్డాక్యుమెంట్లూ లేవని చెబుతున్నారు.
యాన్యువల్ స్టేట్మెంట్ను బడ్జెట్లో పెట్టలే
రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి ప్రతి అంశాన్నీ ప్రభుత్వాలు అసెంబ్లీలో ప్రవేశపెడుతుంటాయి. కానీ, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ విషయంలో మాత్రం అలా జరగలేదని తెలుస్తున్నది. కార్పొరేషన్‌కు సంబంధించిన యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను అసెంబ్లీలో ప్రజల ముందు పెట్టలేదని అధికారులు చెబుతున్నారు. ఏటా కార్పొరేషన్‌పై ఆడిట్ చేసినా.. కాగ్ రిపోర్ట్ ఇచ్చినా.. అసెంబ్లీలో పెట్టి ప్రజల ముందుకు తీసుకురాలేదన్న ఆరోపణలున్నాయి. ఇటీవల కమిషన్ దీనిపై ప్రశ్నిస్తే.. అధికారులు తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. కార్పొరేషన్ పేరిట ఎంత మొత్తంలో లోన్లు తీసుకున్నారు? ఏటా ఎంత ఖర్చు పెట్టారు? ఎంత తిరిగి చెల్లించారు? అన్న వివరాలేవీ వెల్లడించలేదు. ఇవన్నీ పెద్దసారు కనుసన్నల్లోనే జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రాజెక్ట్ అంచనాల పెంపు కూడా శాస్త్రీయంగా జరగలేదన్న వాదన అధికార వర్గాల్లో వినిపిస్తున్నది. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలాగా నిర్ణయాలు తీసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కమిషన్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన అన్ని మీటింగుల మినిట్స్‌పై విచారణకు వస్తున్న అధికారుల నుంచి ఆరా తీస్తున్నది. ఆ మీటింగ్ మినిట్స్‌ను తెప్పించుకోవాలని భావిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత సర్కారు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాల మీద కూడా జ్యుడీషియల్ కమిషన్ ఆరా తీస్తున్నది.