కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కొలువులేవి?

తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగుల పాత్ర ఎనలేనిది. వాళ్లు ఉద్యమానికి ఊపిరిలూది స్వరాష్ట్రం కోసం తెగించి కొట్లాడారు. ఈ పోరాటంలో 1200కు పైగా యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. విద్యార్థులు లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఊహించుకోలేం. కొన్ని కీలక సమయాల్లో వాళ్లే ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఉద్యోగాల విషయంలో ఆంధ్రా పాలకులు తెలంగాణ యువతను ఎలా మోసం చేశారో గుర్తించి.. ఉద్యమానికి కదం తొక్కారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే.. మన కొలువులు మనకు దక్కుతాయని,ఇంటికో ఉద్యోగం వస్తుందని లక్షలాది మంది యువకులు ఆశించారు. కానీ స్వరాష్ట్రంలో వారి ఆశలు అడియాసలయ్యాయి. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏండ్లుగా ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో నిరుద్యోగ యువకులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత నిరుద్యోగుల బతుకులు “పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యింది” రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి టీఎస్ పీఎస్​సీ ఏర్పాటు చేశారు. ఇందులో డిగ్రీ చదివిన యువతీయువకులను వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆహ్వానిస్తే.. ఏకంగా 24,82,888 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి స్టూడెంట్స్​పెద్దగా రిజిస్ట్రేషన్ ​చేసుకోవడం లేదు. వాళ్లను కూడా కలిపితే.. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 29 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు అంచనా. ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ పోలీస్ శాఖలో 30 వేలు, విద్యుత్ శాఖలో ఆర్టిజన్ పోస్టులు 24 వేలు, పంచాయతీరాజ్ శాఖలోని పంచాయతీ సెక్రటరీ పోస్టులు 9,355, మిగతా కొన్నింటిని కలిపితే మొత్తం 63 వేలకు పైగా పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. ప్రభుత్వం చెప్పే లెక్కల్లో మిగతా వాటిని ఎక్కడ భర్తీ చేశారో ఎవరికీ తెలియని పరిస్థితి.

గ్రూప్​1 రాక ఎన్నేండ్లో..

గత పది సంవత్సరాల నుంచి గ్రూప్​1 నోటిఫికేషనే రాకపోవడం దారుణం. గ్రూప్ 1లో 1600 వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 2లో 4000 ఖాళీలు, గ్రూప్ 3లో 2000 ఖాళీలు, గ్రూప్ - 4లో 4000కు పైగా ఖాళీలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి విభాగాధిపతుల కార్యాలయాల్లో హెచ్​వోడీ పోస్టులు, జిల్లా స్థాయిలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ లాంటి పోస్టులు భర్తీ చేయక ఏండ్లు గడుస్తోంది. రాష్ట్రంలో ఒక్క విద్యాశాఖ పరిధిలోనే 1.31లక్షల మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 1.09 లక్షలమంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే ఇంకా దాదాపు 22 వేలకు పైగా టీచర్​ పోస్టులు ఖాళీలున్నట్లు తెలుస్తోంది. వీటిని  ఎప్పటికప్పుడు భర్తీ చేయాల్సింది పోయి.. రేషనలైజేషన్​పేరుతో స్కూళ్లను మెర్జ్​ చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో 40 శాఖల జిల్లా, తాలూకా ఆఫీసులు,131 మండలాలు,30 రెవెన్యూ డివిజన్స్ ఆఫీసులు,76 మున్సిపాలిటీలు,7 మున్సిపల్ కార్పొరేషన్స్,4383 గ్రామ పంచాయతీల్లోనూ సిబ్బంది అవసరం ఉంది. కానీ వీటిల్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనే దానిపై ఎక్కడా క్లారిటీ లేదు. ఈ ఏడాది జులైలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీ గురించి చర్చ జరిగింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 67,128 ఖాళీలను గుర్తించి, ఏడాదిపాటు నోటిఫికేషన్ వేసేలా క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించారు. కానీ  ఆ నిర్ణయం అమల్లోకి రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగానే మిగిలింది. తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీ గురించిన ఊసే ఎత్త లేదు. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దాదాపు నాలుగైదు ఏండ్లు చదువు, కొలువుల ప్రిపరేషన్​ అంతా పక్కనబెట్టి ఉద్యమంలో పాల్గొన్న యువతకు ఏమీ మిగలలేదు. పైగా ఉద్యోగ అర్హత వయస్సు కూడా దాటి పోతోంది.

ప్రత్యామ్నాయ మార్గాలేవీ..

చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగావకాశం కల్పించడం ప్రభుత్వానికి కుదరకపోవచ్చు కానీ, ఖాళీగా ఉన్న కొలువులను భర్తీచేసి, మిగతా వారిని ఆర్థికంగా ఆదుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అమలుపరచాల్సిన బాధ్యత సర్కారుదే. రాష్ట్రాభివృద్ధి ఉత్పాదకరంగంపై ఎంత ఆధారపడి ఉందో, ఉత్పాదక శక్తి కలిగిన యువకులందరికీ ఏదో రకంగా పని కల్పించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. అలా కాకుండా లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే తీవ్ర దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు, నిరుద్యోగ సమస్యను తుడిచిపెట్టేందుకు పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో ఉన్న నిపుణులు, మేధావులు, ప్రతిపక్షాలు నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలి. వారి పక్షాన నిలబడి అవసరమైతే సర్కారుతో కొట్లాడాల్సిన అవసరం ఉంది.  

కోచింగ్​సెంటర్ల వెంట తిరుగుతూ..

ఏటా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో యువత జాబ్​ప్రిపరేషన్​లో భాగంగా పెద్ద ఎత్తున కోచింగ్​సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేస్తోంది. చివరికి నోటిఫికేషన్లు రాకపోవడంతో వారు తల్లిదండ్రుల పాలిట ఆర్థిక భారంగా మారుతున్నారు. అప్పులపాలై అష్టకష్టాలు పడుతున్నారు. ఇంటి వద్ద ఎలాంటి ఆర్థిక వనరులు లేక, ప్రభుత్వ కొలువులు వస్తాయనే నమ్మకంతో యూనివర్సిటీ హాస్టల్స్​లో ఉంటూ, లైబ్రరీల్లో చదువుకుంటూ నోటిఫికేషన్స్​ కోసం ఎదురుచూస్తున్నారు. వాటితో ఎలాంటి ప్రయోజనం లేకపోగా, పెండ్లీడు దాటిపోతున్నా.. పెళ్లికూతురు దొరకక చెప్పుకోలేని మానసిక క్షోభను అనుభవిస్తున్నవారు కొందరైతే, పెండ్లి చేసుకొని తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఆర్థికపరిస్థితి అనుకూలించక పుస్తకాలను పక్కకుబెట్టి ఊరొదిలి ఏపనైనా చేయడానికి పూనుకున్నవారు మరికొందరు. ఇలాంటి సమస్యలతో అన్ని రకాలుగా కుంగిపోతున్న నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటూ.. కన్నవారికి తీరని శోకం మిగులుస్తున్నారు. 

- డా. పోలం సైదులు, సోషల్​ ఎనలిస్ట్