వ్యవసాయ పాలసీ సర్కారుకు పట్టదా?

ఇటీవల ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌‌ మొత్తం రూ.2,56,858.51 కోట్లు. అందులో వ్యవసాయ రంగానికి కేటాయించింది రూ.24,254 కోట్లు(9.44%) మాత్రమే. పథకాలకు కేటాయింపులను కూడా వ్యవసాయంలో కలిపి చూపించడం వల్ల ఈ మొత్తం ఎక్కువగా కనిపిస్తోంది. రైతుబంధుకు రూ.11,415 కోట్లు, రైతుబీమాకు రూ.1,077 కోట్లు, రుణమాఫీకి రూ.2,939 కోట్లు ఇవన్నీ కలిపితే మొత్తం రూ.15,431 కోట్లు. ఈ పథకాలను మినహాయిస్తే వ్యవసాయ రంగానికి మిగిలేది రూ.8,823 కోట్లు(3.43%) మాత్రమే. ప్రభుత్వ పథకాలు కాక, మొత్తం బడ్జెట్​లో కనీసం 10 శాతం నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 3.4 శాతం నిధులనే ఇవ్వడం లేదు. ఇవన్నీ చూస్తుంటే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయం గురించి సరైన విధానం ఉందా? అనే ప్రశ్న ఎదురవుతోంది. రైతులు, వ్యవసాయ అవసరాలను అంచనా వేయడంలో సర్కారుకు సరైన ప్రణాళికే లేదు. ఇది చివరికి రైతులను ఆగం చేస్తోంది.
తెలంగాణలో సాగు భూమి 1.63 కోట్ల ఎకరాలు ఉంది. ఇందులో బీళ్లుగా మారిన భూమిని మినహాయిస్తే మిగిలేది 1.20 కోట్ల ఎకరాలు. యాసంగి, వానాకాలం కలిపి లెక్క వేస్తే సాగు విస్తీర్ణం 1.70 కోట్లకు చేరుకుంటుంది. హార్టికల్చర్‌‌ 6.35 లక్షల ఎకరాలకు పరిమితం చేశారు. బీడు భూముల్లో హార్టికల్చర్‌‌ పంటలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల కనీసం 13 లక్షల ఎకరాల్లోనైనా హార్టికల్చర్‌‌ పంటలు వేయాలి. రాష్ట్ర అవసరాలకు 35 లక్షల టన్నుల కూరగాయలు అవసరం కాగా, 22 లక్షల టన్నులే ఉత్పత్తి చేస్తున్నాం. మిగిలినవి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. పప్పులు, పత్తి, వంటనూనెలు ఎక్కువగా దిగుమతి అవుతున్న వస్తువుల్లో ఉన్నాయి. పత్తి విస్తీర్ణం పెరిగినప్పటికీ స్టేపుల్‌‌ లెంగ్త్‌‌ 27 నుంచి 30 మీ.మీ ఉండడం వల్ల భారీ లెంగ్త్‌‌ అనగా 35 నుంచి 38 మీ.మీ ఉన్న పత్తిని దిగుమతి చేసుకుంటున్నాం. ఆ పత్తి కలపడంతో దారం పొడుగు వస్తుందని మిల్లర్లు దిగుమతి చేసుకుంటున్నారు.

నష్టాలను రైతులే భరిస్తున్నరు

ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రతి సంవత్సరం జరుగుతున్న రూ.5 వేల కోట్ల నష్టాన్ని రైతులే భరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకం నుంచి తెలంగాణ రాష్ట్రం బయటకు వచ్చింది. అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాటూ చేయలేదు. గత 3 సంవత్సరాల్లో పంటలకు రూ.18 వేల కోట్ల నష్టం వాటిల్లింది. 2020–21లో 12.57 లక్షల ఎకరాలు, 2021-–22లో 8.63 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రాళ్ల వానల వల్ల మరో రూ.800 కోట్ల నష్టం జరిగింది. ఈ నష్టాలన్నీ రైతులే భరించారు. ఈ సంవత్సరం తామర పురుగుతో మిరప, గులాబీ పురుగుతో పత్తి పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా క్రిమికీటకాదుల వల్ల జరిగిన దాడులను కూడా ప్రకృతి వైపరీత్యాల కిందనే పరిగణించాలి. భూసార పరీక్షలు కొనసాగించి, అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని రూపొందించి అందుకు కావాల్సిన విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచాలి. ఆహార భద్రతకు ఉపయోగపడే నూనె గింజలు, పప్పు ధాన్యాలు అధికంగా ఉత్పత్తి చేయడానికి ప్రయోగాత్మక పంటలు వేయాలి. ఆ కేంద్రాలకు రైతులను తీసుకెళ్లి అధికోత్పత్తికి అవకాశం కల్పించాలి. ప్రణాళికాబద్ధమైన వ్యవసాయ పంటలను నిర్ణయించి అధికోత్పత్తి జరిగేలా పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించాలి.  కానీ, వ్యవసాయ వర్సిటీలకు బడ్జెట్‌‌లో ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు.

సాగునీటికి ఇచ్చింది అంతంతే..

సాగునీటి బడ్జెట్‌‌ను పరిశీలిస్తే మొత్తం రూ.22,675 కోట్లు కేటాయింపు చూపారు. ఇందులో మేజర్‌‌, మీడియం ఇరిగేషన్‌‌కు రూ.21,401 కోట్లు, మైనర్‌‌ ఇరిగేషన్‌‌కు రూ.1,245 కోట్లు, కమాండ్‌‌ ఏరియా డెవలప్‌‌మెంట్‌‌కు రూ.18.69 కోట్లు, వరదలు, మురుగునీటి పారుదలకు రూ.10 కోట్లు చూపారు. కానీ రాష్ట్రంలో పెండింగ్‌‌ ప్రాజెక్టుల నిర్మాణం 2, 3 దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఈ కేటాయింపుల్లో ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.8,050 కోట్లు, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.282 కోట్లు మాత్రమే కేటాయించారు. మిషన్‌‌ కాకతీయకు రూ.600 కోట్లు ఇచ్చారు. చెరువులు, భూగర్భ జలాలు సహా మొత్తంగా సాగునీటికి కేటాయించింది రూ.9,277 కోట్లు మాత్రమే. మధ్యతరహా 38 ప్రాజెక్టులకు రూ.282 కోట్లతో పూర్తి చేయడం సాధ్యమవుతుందా? 28 భారీ ప్రాజెక్టుల కోసం రూ.8,050 కోట్లు ఇచ్చారు. ఇందులో కాళేశ్వరం, పాలమూరు, సీతారామ సాగర్‌‌ ప్రాజెక్టులకు రూ.4,669 కోట్లు కేటాయించారు. మిగిలిన 25 ప్రాజెక్టులకు రూ.3,500 కోట్లే ఇచ్చారు. ఈ బడ్జెట్‌‌ సాగునీటి రంగానికి ఏ మాత్రం సరిపోయేలా లేదు. 7 సంవత్సరాలుగా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. సంగారెడ్డి జిల్లా నారాయఖేడ్‌‌లో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను వారం క్రితం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కానీ వీటికి బడ్జెట్‌‌లో కేటాయింపులు చూపలేదు.

ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకోవాలి

శాస్త్రీయ ప్రణాళికలేని బడ్జెట్‌‌ కేటాయింపుల వల్ల అటు వ్యవసాయ రంగం నుంచి, ఇటు సాగునీటి రంగాల నుంచి ఎలాంటి ఫలితాలూ ఆశించలేం. తెలంగాణలో మంచి పంటలు పండగలిగిన భూములు ఉన్నప్పటికీ భూసార పరీక్షలు జరిపి వాటికి అనుకూలమైన విత్తనాలను అందించి సాగునీటిని కల్పించడం ద్వారా అధికోత్పత్తిని తీసుకురావచ్చు. ప్రస్తుతం హెక్టారుకు ఆహార ధాన్యాలు 20 క్వింటాలు, వాణిజ్య పంటలైతే 10 క్వింటాళ్లకు మించి రావడం లేదు. పెట్టుబడులు పెరిగిపోతుండడంతో గిట్టుబాటుగాక రైతులు రుణగ్రస్తులై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలను నివారించేలా వ్యవసాయాభివృద్ధి జరగాలి. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అందుకు బడ్జెట్‌‌ కేటాయింపులు అనుకూలంగా ఉండాలి. రైతుల సమస్యలను, వారి అవసరాలను తీర్చగలిగేలా బడ్జెట్‌‌ను రూపొందించాలి. పథకాలను మినహాయించి రెట్టింపు కేటాయింపులు చేస్తేనే రైతులకు కొంతైనా మేలు జరుగుతుంది.

కల్తీ విత్తనాలు ఆగంజేస్తున్నయ్

ప్రకృతి వైపరీత్యాలకు తోడు కల్తీ విత్తనాల బెడద రైతులను ఆగం చేస్తోంది. తెలంగాణలో కల్తీ, నకిలీ విత్తనాల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నది. కల్తీ విత్తనాల వల్ల ఏటా 5 నుంచి 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. విజిలెన్స్‌‌ శాఖ పట్టించుకోకపోవడంతో కల్తీ విత్తన వ్యాపారుల ఆటలు యధేచ్ఛగా సాగుతున్నాయి. కల్తీ విత్తనాలకు సంబంధించి 221 కేసులు పెట్టినా.. ఏ ఒక్కరి లైసెన్స్‌‌ రద్దు చేయలేదు. కనీసం శిక్షలు పడే కేసులు కూడా పెట్టలేదు. విత్తనోత్పత్తి రాష్ట్రానికి విత్తన చట్టం లేదు. రాష్ట్రంలో 27 విత్తన పరిశోధన కేంద్రాలు ఉన్నప్పటికీ ఎందులోనూ పరిశోధనలు లేవు. జయశంకర్‌‌ యూనివర్సిటీకి రూ.75 కోట్లు, కొండా లక్ష్మణ్‌‌ హార్టికల్చర్‌‌ యూనివర్సిటీకి రూ.17.50 కోట్లు మాత్రమే కేటాయించారు. రైతులకు విత్తన సబ్సిడీ కింద రూ.39 కోట్లు, యంత్రాల సబ్సిడీ కింద రూ.377 కోట్లు, రైతు వేదికలకు రూ.12 కోట్లు ఇచ్చారు. కొత్తగా ఆయిల్‌‌ఫామ్​కు రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నామని బడ్జెట్‌‌ లో చెప్పి.. ఆర్థిక నివేదికలో మాత్రం రూ.776 కోట్లు మాత్రమే చూపారు. ఈ నిధులైనా ఖర్చు చేస్తారో లేదో తెలియని పరిస్థితి. ఇక బడ్జెట్‌‌ కేటాయింపులు రైతుల ఆత్మహత్యలను నిరోధించలేక పోతున్నాయి. 20 లక్షల మంది కౌలుదార్లు ఎలాంటి హక్కులు లేకుండా వ్యవసాయం సాగిస్తున్నారు. వారికి పంట రుణాలు గానీ, పంటలబీమా గానీ, ప్రభుత్వ పథకాలుగానీ అందడం లేదు. కౌలుదార్లను గుర్తించి వారికి అవసరమైన పథకాలను అమలు చేయడానికి బడ్జెట్‌‌లో కేటాయింపులు చేయాలి.

- మూడ్ శోభన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం