హైదరాబాద్: రాడార్ స్టేషన్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందే బీఆర్ఎస్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్మీట్లో చెప్పారు. వాళ్లు దిగిపోయే నాటికి అన్ని పర్మిషన్లు తీసుకున్నారని తెలిపారు. దేశ భద్రతను కూడా రాజకీయాలకు ముడిపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. దేశ భద్రతను వ్యతిరేకిస్తే వాడు కసబ్ కంటే హీనుడు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. లక్షల ఎకరాలు కాలుష్యం చేయాలని చూసిన వాళ్లు రాడార్ సెంటర్ గురించి మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. దేశ ప్రయోజనాల కోసం పెట్టే ప్రాజెక్టును ఎలా అడ్డుకుంటామని ఆయన ప్రశ్నించారు. 12 లక్షల చెట్లు పోతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వందలు, వేలల్లోనే చెట్లు పోతున్నాయని సీఎం చెప్పారు. ఆ చెట్లకు ఐదింతలు మొక్కలు నాటుతారని తెలిపారు.
ALSO READ | దేశ రక్షణ విషయంలో రాజకీయాలొద్దు
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను నేవీ ఇక్కడ నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ను ఉపయోగిస్తుంది. నేవీ రాడార్కు సంబంధించి దేశంలోనే ఇది రెండో స్టేషన్.
ALSO READ | రాడార్ సెంటర్‌తో ఎలాంటి ముప్పుండదు: రాజ్ నాథ్ సింగ్
తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది. 2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ లు వచ్చినప్పటికీ.. గత ప్రభుత్వం భూముల కేటాయించలేదు.
ALSO READ | మూసీపై అసెంబ్లీలోనే మాట్లాడుకుందాం రండి..: ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ ఓపెన్ ఆఫర్
ఈ ఏడాది జనవరిలో కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం వికారాబాద్ డీఎఫ్ వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.