విశ్లేషణ: కౌలు రైతు గోస కనబడదా?

విశ్లేషణ: కౌలు రైతు గోస కనబడదా?

రాష్ట్రంలో రైతులకు, కౌలు రైతులకూ సంబంధించిన చట్టాలను కే‌‌సి‌‌ఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. చట్టం ముందు అందరూ సమానమే అని అంటారు కానీ, తెలంగాణా లో ముఖ్యమంత్రి గారికి కౌలు రైతులను సమాన పౌరులుగా చూసే అలవాటు లేదు. ఆయనకు రైతులంటే భూమిపై పట్టా హక్కులు కలిగిన రైతులే. వందల ఎకరాల ఆసాములు, ఇతర దేశాల్లో  స్థిర పడిన వారు కూడా  మన సీఎం దృష్టి లో రైతులే. వారికి రైతుబంధు ఇస్తారు.  వాళ్ళు మరణిస్తే రైతు బీమా  5 లక్షలు చెల్లిస్తారు. వాళ్ళు వ్యవసాయం చేయకపోయినా, పంట నష్ట పరిహారం చెల్లిస్తారు. పంటల బీమా పరి హారం కూడా అందిస్తారు.

రైతు స్వరాజ్య వేదిక అధ్యయనం ఇదీ..

రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లోని 31 మండలాలకు చెందిన 34 గ్రామాలలో మొత్తం 7744 మంది రైతులను సర్వే చేయగా, వారిలో 2753 మంది, అంటే 35.6 శాతం కౌలు రైతులు ఉన్నట్లు తెలిసింది. వారిలో 523 మంది ఏ మాత్రం భూమి లేని కౌలు రైతులు ఉన్నారు. అంటే మొత్తం రైతుల్లో  వీరు 6.8 శాతంగా, కౌలు రైతుల్లో 19 శాతం గా ఉన్నారు.  సర్వే చేసిన మొత్తం కౌలు రైతుల్లో 60.9 శాతం బీసీ సామాజిక వర్గాలకు, ఎస్సీ లు 22.9 శాతంతో రెండవ స్థానంలో, ఎస్టీ లు 9.7 శాతంతో మూడవ స్థానంలో ఉన్నారు. ఓసీల్లో  కౌలు రైతులు 4.2 శాతం, మైనార్టీల్లో 2.4శాతం ఉన్నారు. అట్టడుగు  సామాజిక వర్గాలు ఎక్కువగా కౌలు రైతులుగా ఉన్నారని ఈ నివేదిక స్పష్టంగా తేల్చి  చెప్పింది. కాబట్టి ఈ వర్గాలు ఆర్ధికంగా బలపడాలంటే, కౌలు రైతుల గుర్తింపు తక్షణమే జరగాలి.  కౌలు రైతుల గురించి చర్చ వచ్చినప్పుడల్లా సీఎం కే‌‌సీఆర్  కౌలు రైతులు ప్రతి ఏటా  తాము సాగు చేసే భూమి వదిలేసి కొత్త కౌలు భూమి సాగు చేస్తుంటారని, కాబట్టి వారిని గుర్తించి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వడం సాధ్యం కాదనీ వాదించారు.  కానీ 73 శాతం కౌలు రైతులు ఒకే భూమిలో కనీసం మూడు ఏండ్లు  లేదా అంతకు ఎక్కువ ఏండ్ల నుంచి కౌలుకు సాగు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. అంతే గాక, 39 శాతం మంది 5 ఏండ్లకు పైగా, 18 శాతం మంది 10 ఏండ్లకు పైగా ఒకే భూమిలో కౌలు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2011 అధీకృత సాగుదారుల చట్టాన్ని పూర్తిగా అమలు చేసి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. చట్టంలో అవసరమైన మార్పులు చేసి ప్రభుత్వ బాధ్యతను, కౌలు రైతుల హక్కులను పొందుపరుస్తూ మరింత పటిష్టం చేయాలి. కౌలు రైతులందరికీ రైతు బంధు, పంట రుణం, పంట నష్టపరిహారం, పంటల భీమా, రైతు భీమా వంటి అన్ని పథకాలూ వర్తింపజేయాలి. కౌలు రైతులకు “రుణ హామీ నిధి” ని  ఏర్పాటు చెయ్యాలి. ఇ క్రాప్​ బుకింగ్​లో కౌలు రైతులనూ నమోదు చేయాలి. ధరణి లో సాగుదారుల కాలమ్ ను పునరుద్ధరించి ప్రతి సీజన్ లో వాస్తవ సాగుదారులను అధికారికంగా నమోదు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.  

కౌలు రైతులు, రైతులు కారు!

కానీ కౌలు రైతులను గుర్తించాలనీ, వారి వ్యవసాయానికి కూడా రైతు బంధు సహాయం అందించాలనీ, భూమి లేని కౌలు రైతులకు కూడా రైతు బీమా అమలు చేయాలనీ, ఇతర వ్యవసాయ మద్దతు పథకాలు కౌలు రైతులకు కూడా అందించాలనీ  అసెంబ్లీ లో గానీ, బయట గానీ  ముఖ్యమంత్రి గారిని ఎవరైనా అడిగితే, ఆయన ఇచ్చే జవాబు ఏమిటి ? తెలంగాణా లో కౌలు రైతులు తమ ఎజెండా లో లేరనీ, భూమి పై పట్టా హక్కులను  కలిగిన వారినే రైతులుగా తాము గుర్తిస్తామనీ  నిస్సిగ్గుగా ప్రకటిస్తారు.  రైతు ఆత్మహత్యల్లో 80 శాతం కౌలు రైతులవేననీ, కౌలు రైతులు తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్నారనీ మా లాంటి సంఘాలు  మొత్తుకున్నా, ఎన్ని మీడియా కథనాలు వెలువడినా ఆయన చెవికి ఎక్కవు.

1956 కౌలుదారీ చట్టాన్ని తుంగలో తొక్కిన కేసీఆర్​ సర్కార్​!

గతంలో నీతీ ఆయోగ్​ తెలంగాణ రాష్ట్రం లో 14 శాతం కౌలు రైతులు ఉంటారని అంచనా వేసింది . ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ఓ సంస్థ  2018-–19 లో సాగించిన సర్వే లో తెలంగాణాలో 17.5 శాతం కమతాలు కౌలు రైతుల  చేతుల్లో ఉన్నాయని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత గా ఎప్పుడూ పూనుకుని కౌలు రైతుల సమస్యలపై అధ్యయనం చేయలేదు. ఇతర రైతు సంఘాలు కూడా అధ్యయనం చేయలేదు. ఈ నేపథ్యంలో రైతు స్వరాజ్య వేదిక, రాష్ట్ర ప్రభుత్వానికీ, ఇతర పార్టీలకూ కౌలు రైతుల సమస్య తీవ్రతను అర్థం చేయించి, కళ్ళు తెరిపించడానికి ఒక విస్తృత అధ్యయనం చేసింది, ఈ అధ్యయనంలో అనేక సంస్థలు కూడా భాగస్వాములయ్యాయి.ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి.  నిజానికి వాస్తవ కౌలు దారులకు భూమి హక్కులను కల్పించటానికి వీలు కల్పించే 1950, 1956 కౌలుదారీ చట్టాలను అమలు చేయకుండా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని 2011 లోనే తెచ్చింది. ఈ చట్టం ప్రకారం కౌలు దారులకు భూమి హక్కులు రావు,  భూ యజమానికి భూమి హక్కులు భద్రంగా ఉంటాయి. కౌలు దారుల వ్యవసాయానికి  సహాయం లభిస్తుంది. కౌలుదారులకు రుణ అర్హత కార్డులు (ఎల్ఇసి) ఇస్తారు, ఈ కార్డు  ఆధారంగా వారు బ్యాంకు రుణాలు పొందడానికి అర్హులు అవుతారు.  ఈ కార్డు పొందిన వారు కౌలుదారులని అందరికీ తెలుస్తుంది కానీ వారికి ఎటువంటి రక్షణ లభించదు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఏడాది మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేసిన కే‌‌సి‌‌ఆర్ ప్రభుత్వం 2015 నుంచి చట్టం అమలును పూర్తిగా మానేసింది. అదే ఒక ముఖ్య కారణంగా ఈ అధ్యయనం సాగింది. 
- కన్నెగంటి రవి,
రైతు స్వరాజ్య వేదిక