రైతుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు?

ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతు.. ఆదుకునే వారు లేక.. ఎవుసం చేయలేక మధ్యలోనే కాడి వదిలేస్తున్నాడు. వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నామని పాలకులు స్పీచ్​లు దంచుతున్నా.. అన్నదాతల బతుకులు మాత్రం మారడం లేదు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చెబుతున్న రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి పథకాలు కూడా రైతుల ఆత్మహత్యలను ఆపలేకపోతున్నాయి. వడ్ల కల్లాలు, పంట చేన్లలోనే అన్నదాతలు ప్రాణాలు తీసుకుంటున్నారు. నేటికీ ఓ సమగ్ర వ్యవసాయ విధాన రూపకల్పన జరగకపోగా.. రైతుల కష్టాలపై ప్రశ్నించే వారిపై ప్రభుత్వాలు అణచివేత ధోరణి కొనసాగిస్తున్నాయి. ఇప్పటికైనా అన్నదాతల అకాల మరణాలను ఆపే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మనదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే అయినా 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏ ప్రభుత్వ పాలనలోనూ ఓ సమగ్ర వ్యవసాయ విధాన రూపకల్పన జరగలేదు. దున్నే శక్తి గల వాడికి భూమి లేకపోగా.. ఎవుసమంటే ఏమిటో తెలియని వ్యక్తుల చేతుల్లో వేలాది ఎకరాల భూమి బందీగా ఉంటోంది.  తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పేరిట లక్షల రూపాయలతో ఇలాంటి వారి జేబులు నింపుతోంది. భూదానోద్యమాలు, భూసంస్కరణలు సైతం ఈ దేశ జనాభా మధ్య భూ పంపిణీలోని అసమానతలను తొలగించలేకపోయాయి. 

కారణాలు అనేకం..

ఎవుసానికి పెట్టుబడి విపరీతంగా పెరుగుతూ ఉండటం, కౌలు సమస్యలు, నీళ్ల సౌలత్ సరిగా లేకపోవడం, పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం తదితర కారణాల వల్ల వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇవిగాక అతివృష్టి, అనావృష్టి, తెగుళ్లు, పంటల ఉత్పత్తి పడిపోవడం, మార్కెటింగ్​కష్టాలు, గిట్టుబాటు ధర రాకపోవడం రైతులను కుదేలు చేస్తున్నాయి. సమగ్ర పంటల విధానాల రూపకల్పన లేకపోవడం వల్ల ఏ పంటలు వేయాలో తెలియని రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వరి పంట రాష్ట్ర రైతుల పాలిట ఉరిగా మారిన వైనం, కల్లాల్లో రైతుల జీవనం కడతేరుతుంటే వారి అకాల మరణాలకు కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీరంటే మీరేనని నిందించుకుంటూ ఓ వినూత్న రాజకీయ క్రీడలో మునిగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రైతు బంధు లాంటి పథకాలు కూడా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను ఆపలేక పోతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు గొంతెత్తి  ప్రశ్నిస్తే నిరంకుశ అధికారంతో పాలకులు వారిని అణచివేస్తున్నారు. 

ఆపాల్సిన అవసరం ఉంది

రైతుల ఆత్మహత్యలకు గల కారణాలపై లోతైన విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాటిని ఆపేందుకు ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. రైతులకు బతుకుపై భరోసా కలిగించే విధంగా కౌన్సెలింగ్​ చేయగలిగితే మెజారిటీ ఆత్మహత్యలను ఆపవచ్చనే నిపుణుల అభిప్రాయాల్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. పంట పెట్టుబడిని తగ్గించడం, గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్​పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా రైతులకు కొంత మేలు జరుగుతుంది. పంట పండించే రైతుల ఆదాయం రైతు కూలీల కంటే కూడా తక్కువ ఉందని అనేక సర్వేలు చెప్తున్నాయి. ఆ పరిస్థితిలో మార్పు వచ్చిన రోజు రైతుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది. సమాజంలో జరిగే ప్రతి ఆత్మహత్యకు ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్న కార్ల్ మార్క్స్ అభిప్రాయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓ వైపు ప్రభుత్వాలు, మరోవైపు సమాజం ప్రజల కష్ట సుఖాల్లో 
పాలుపంచుకోవాలి. 

:: నీలం సంపత్, సోషల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌