భారత రాజ్యాంగానికి తూట్లు పడ్డయ్

  •  వరంగల్ అర్బన్​ జడ్పీ చైర్మన్​ వ్యాఖ్యలు
  • ఆందోళనకు దిగిన దళిత సంఘాల నాయకులు
  • మాటలను ఉపసంహరించుకున్న సుధీర్​కుమార్​

హనుమకొండ, వెలుగు: ‘భారత రాజ్యాంగానికి తూట్లు పడ్డయ్.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగాసవరణలు చేసి రీరైట్​ చేయాలి’ అంటూ బాబూ జగ్జీవన్​రామ్​జయంతి సభలో వరంగల్ అర్బన్​జడ్పీ చైర్మన్​మారపల్లి సుధీర్​కుమార్​ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దళిత సంఘాల ఆగ్రహానికి ఆజ్యం పోశాయి. హనుమకొండలోని అంబేద్కర్​భవన్​లో మంగళవారం బాబూ జగ్జీవన్​ రామ్​ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్​విప్​ దాస్యం వినయ్​భాస్కర్, వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి, హనుమకొండ కలెక్టర్ ​రాజీవ్​గాంధీ హన్మంతు, గ్రేటర్ ​కమిషనర్​ప్రావీణ్య, దళిత సంఘాల లీడర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్​ సుధీర్​ కుమార్ ​మాట్లాడుతూ రాజ్యాంగానికి తూట్లు పడ్డాయని, సవరించాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే దళిత సంఘాల నాయకులు సీరియస్​ అయ్యారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతుండగానే స్టేజీ మీద కూర్చున్న దళిత సంఘాల నాయకులు ఎర్రగట్టు స్వామి, పుట్ట రవి, చుంచు రాజేందర్​, ఇతర నేతలు జడ్పీ చైర్మన్​ దగ్గరకు వెళ్లి  వాగ్వాదానికి దిగారు. అయినా పట్టించుకోకుండా సుధీర్​కుమార్​ తన ప్రసంగం కొనసాగించారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని, అలాంటి రాజ్యాంగానికి విఘాతం కలుగుతోందన్నారు. అందుకే సవరణలు చేసి రీ రైట్ ​చేయాలని అంటున్నానన్నారు. దీంతో దళిత సంఘాల నాయకులు భారత రాజ్యాంగం వర్ధిల్లాలి...జై భీమ్..సుధీర్​ కుమార్​ డౌన్​ డౌన్​ అంటూ అంటూ నినాదాలు చేశారు. కింద ఉన్న దళిత సంఘాల లీడర్లు కూడా స్టేజీ మీదకు వచ్చి సుధీర్​కుమార్​తో వాదించడం స్టార్ట్ చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తూ ఆందోళన కొనసాగించారు. మరికొంతమంది స్టేజీ వద్ద బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సుబేదారి పోలీసులు కొంతమంది నిరసనకారుల్ని లాక్కెళ్లారు. మళ్లీ సుధీర్​కుమార్ ​మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు పోయాయని, రిజర్వేషన్లు కూడా పోతాయన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచినప్పుడు సవరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తన మాటల వల్ల ఎవరి మనసుకైనా బాధ కలిగితే ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత కూడా మాట్లాడటం కంటిన్యూ చేస్తుండగా.. అక్కడున్న సిబ్బంది ఆయన మైక్​ కట్​ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రసంగం స్టార్ట్​ చేయడంతో అప్పటివరకు ఉన్న వివాదం సద్దుమణిగినట్టయింది.

సీఎం కుట్రలో భాగంగానే.. 

రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్​ కుట్రలో భాగంగానే   జగ్జీవన్​ రామ్​ జయంతి కార్యక్రమంలో జడ్పీ చైర్మన్​ సుధీర్​ కుమార్ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని దళిత బహుజన ఫ్రంట్​ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్​ ఆరోపించారు. ఈ మేరకు హనుమకొండ అంబేద్కర్​భవన్​ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. రాజేందర్​ మాట్లాడుతూ భారత రాజ్యాంగం జోలికి ఎవరూ వచ్చినా తరిమి కొడతామని హెచ్చరించారు. వెంట దళిత బహుజన ఫ్రంట్​జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేశ్​, బంజారా విద్యార్థి సేనా జిల్లా అధ్యక్షుడు బానోత్​ సురేశ్​, లీడర్లు రాజు, తరుణ్​ , కల్యాణ్​ ఉన్నారు.