రాష్ట్రంలో ఎక్కడైనా, ఎప్పుడైనా రోజులో 24గంటలు మద్యం అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? మన రాష్ట్రం తీసుకుంటోంది. నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణరాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది ? నీళ్లు ఇచ్చి వరివద్దు అంటారు..నిధులకోసం మద్యం ముద్దు అంటారు. నియామకాలు లేక, నిరుద్యోగులు బతుకులు ఈడ్వలేక సూసైడ్ నోట్ రాసి పిట్టల్లా రాలిపోతుంటే కనీస కనికరం కలగటం లేదా? మేధావులు, రచయితలు, సామాజిక కార్యకర్తలను భయాందోళనలకు గురిచేసి తమపబ్బం గడుపుకోవడం ఎంతవరకు కరెక్ట్? విద్యను ఎండమావిచేయడంలో విజయవంతమయ్యారు! నియామకాలు అందరికీ సాధ్యపడదు హమాలి కూలీలుగా మారాలి అంటారు, అసలు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారో అర్థమవుతోందా? రాజ్యాంగం మార్చడంకాదు, రాజ్యాంగంలో రాజకీయ నాయకులకు విద్యపరంగా ఒక అర్హత కేటాయించండి! సబ్బండవర్గాలు మద్దతు ఇస్తాయి. మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో యువతను మద్యం గ్లాసులకు బానిసలుగా మార్చారు. గతేడాది నవంబర్‌లో వైన్స్ షాపుల టెండర్లు ముగియడంతో ప్రభుత్వం తిరిగి కొత్త లైసెన్స్ కోసం టెండర్లకు ఆహ్వానం పలకగా రికార్డు స్థాయిలో ఆదరణ వచ్చి రాష్ట్రవ్యాప్తంగా 67,849 మంది వైన్ షాపుల కోసం పోటీపడ్డారు. రంగారెడ్డి జిల్లా 8,224 మంది, ఖమ్మం జిల్లాలో 6,212 మంది అత్యధికంగా నమోదు కావడాన్ని ఎలా అర్థంచేసుకోవాలో తెలియని పరిస్థితిలోకి ప్రజలు వెళ్లిపోవడం దురదృష్టకరం.
ఎక్సైజ్ శాఖతో ముడిపడి..
ఈమధ్యనే నూతనంగా 404 వైన్స్ షాపులకు,159 బార్లకు అనుమతి ఇవ్వడంతో రాష్ట్రంలో గల 2,216 మద్యం దుకాణాలు కాస్త 2,620కు చేరగా,1000కి పైగా బార్లువెలిశాయి. కేవలం టెండర్ల వల్ల 1,350కోట్ల ఆదాయం రావడం నిజంకాదా? అంతెందుకు రాష్ట్రపాలన ఎక్సైజ్ శాఖ ఆదాయంతో ముడిపడిఉందన్న వాదన వినిపిస్తోంది. ఇందులో నిజం లేదంటారా? కేవలం గతసంవత్సరం డిసెంబర్ 1 నుండి 31 వరకు ఒక్కనెలలో 3,350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినమాట వాస్తవం. కేవలం ఒక డిసెంబర్ 31న ఒక్కరోజు 300 కోట్ల అమ్మకాలు జరగాయి.ఇక్కడ ఇంకో విషయంలో ప్రభుత్వాన్ని హర్షించాలి. రిజర్వేషన్ ఎక్కడ ఉపయోగించాలో, దానిని మార్చి వైన్ షాపుల విషయంలో గౌడ్ లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు131, ఓపెన్ కేటగిరి 864 కేటాయించడం అనేది మనరాష్ట్రానికి, మన ప్రభుత్వానికే ఇలాంటి గౌరవం దక్కిందని చెప్పొచ్చు అనడం అతిశయోక్తి కాదు.
రాబడిని పెంచుకోవడానికి రాకెట్ వేగంతో..
మద్యం అమ్మకాలలో, రాబడిని పెంచుకోవడంలో మనరాష్ట్రం రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఒక్కసారి లెక్కలు చూస్తే నమ్మక తప్పనిపరిస్థితి. 2017 ఆర్థిక సంవత్సరంలో షాప్ లైసెన్స్ రూ.లక్ష ఉన్నప్పుడు ప్రభుత్వానికి 498 కోట్లు ఆదాయం వచ్చింది. 2019 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి లైసెన్సు రుసుమును రెట్టింపు చేశారు. అంటే రెండు లక్షలకు పెంచడంతో ప్రభుత్వానికి 969 కోట్లు ఆదాయం వస్తే, ప్రస్తుత ఆర్థికసంవత్సరం 2021కి వచ్చేసరికి పది నెలల్లోనే 25 వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. మార్చి వరకు ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 30 వేల కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం లేకపోలేదు. అంటే రోజుకు 83.3 కోట్లు, నెలకు 2,500 కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది అనడానికి ఈ గణాంకాలు సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇదేకాకుండా మద్యం అమ్మకాలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపుల యజమానులకు 10శాతం కమిషన్ పెంచాలని నిర్ణయం తీసుకోవడం అనేది వీటిపట్ల గల మక్కువను చెప్పకనే చెబుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అమ్మకాలకు భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు..
రాష్ట్రాలలోని ప్రభుత్వాలు మద్యం అమ్మకాలకు, విక్రయాలకు విచ్చలవిడిగా పూర్తిగా స్వేచ్ఛనిస్తే రాష్ట్ర ఖజానాకు డబ్బులొస్తాయేమో గానీ, మూడునాలుగు సంవత్సరాలు దాటితే మద్య ప్రియులు అనారోగ్యపాలుగావడం, కుటుంబం మానసిక, ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడే పరిస్థితులు దాపురించి, ఉత్పాదిత రంగమంతా నాశనమై రాష్ట్ర, దేశ ఆర్థిక పతనానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మూడు నాలుగు దశాబ్దాలక్రితం మద్యపానం వలన కలిగే సమస్యలను అరికట్టాలని నెపంతో మద్యపాన నిషేధంపై ఉద్యమాలు జరిగాయి. వాటిఫలితంగా కొంతకాలం ఊరట చెందారు. కానీ ప్రస్తుత పోకడలకు అడ్డుకట్ట ఉందా? అనే ప్రశ్న రాక తప్పదు.
నిషేధ పోరాటాలు..
ఈమధ్యనే 2019 సంవత్సరంలో మిజోరం రాష్ట్ర అసెంబ్లీలో మద్యపాన నిషేధ బిల్లు - 2019 ను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. 2009 సంవత్సరం నుండి గుజరాత్ లో మద్యాన్ని ఇళ్ళల్లో తయారు చేస్తే మరణశిక్షలు విధించేటటువంటి కఠిన చట్టాన్ని తీసుకొచ్చాయి. 2015లో బీహార్ రాష్ట్రం మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తోంది. 2019 జూన్ మాసం నుండి ఆంధ్రప్రదేశ్లో కొలువైన నూతన ప్రభుత్వం మద్యపాన నిషేధంలో భాగంగా బెల్టుషాపులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఒకేసారి కాకుండా విడుతల వారీగా చర్యలు చేపట్టి మద్యపాన నిషేధం గావించాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తోంది. వాటిని ఆదర్శంగా తీసుకొని మిగతారాష్ట్రాలు సైతం వారి అడుగుజాడలలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మద్యపానం వలన కలిగే పర్యవసనాలు తెలియనివికావు. కుటుంబాలలో తరచూ గొడవలు జరగడం, ఆత్మహత్యలు, హత్యలు, పగలు, ప్రతీకారాలు, దొంగతనాలు, మహిళలపై లైంగిక దాడులు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నోరకాల అసాంఘిక కార్యకలాపాలకు ఆజ్యంపోస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు దీనికి అడ్డుకట్ట వేసేది పోయి ప్రోత్సహించడం అనేది దేనికి నిదర్శనమో ఆలోచించాల్సిన విషయం అని చెప్పకతప్పదు. ఇంకా హాస్యాస్పదకమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం ఓ వైపు “మధ్యపానం హానికరం”, “మద్యం సేవించరాదు” అంటూ అధికార ప్రకటన చేస్తుంది.. కానీ ఆపే ప్రయత్నం చేయదు. అలాగే మద్యం సేవించి అనారోగ్యాల బారినపడితే, ప్రభుత్వ దవాఖానలో కనీస సౌకర్యాలులేని పరిస్థితి. మరోపక్క పోలీసు యంత్రాంగంతో “డ్రంక్ అండ్ డ్రైవ్” నిర్వహిస్తూ, ఎంతో మందిని కోర్టులో హాజరు పరచి కౌన్సెలింగ్ ఇస్తుంటారు కానీ వారి నిర్లక్ష్యానికి సరైన శిక్ష వేయరు. కావున రాష్ట్ర శ్రేయస్సు కోరే యావత్ ప్రజానీకం తమకుటుంబాల బాగుకోసం మద్యపాన నిషేధానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలాంటి మహోద్యమానికి పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
పోరాటాల గడ్డ.. నేడు తాగుబోతుల అడ్డా..
ఒకప్పటి పోరాటాల గడ్డ నేడు తాగుబోతులకు అడ్డాగా మారబోతుందా అనే అనుమానం రోజు రోజుకీ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని విభిన్న రాజకీయ పార్టీలు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కార్యకర్తలను సమీకరించుకొని మద్యం, బిర్యానీ పొట్లాలు ఎరగా వాడుతూ తన బల ప్రదర్శనకు పూనుకున్నారనడంలో నిజం లేకపోలేదు. రాష్ట్రంలో ప్రత్యేకంగా గల్లీ నుంచి ఢిల్లీకి ఎన్నికయ్యే ఏ ఎన్నికలైనా సరే అందులో మద్యం పాత్ర ఎలాఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. కానీ ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించే నాధుడే లేడా ? అనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రాంతాలకతీతంగా ఎక్కడైనా, ఎవరి ఇంట్లోనైనా ఎలాంటి వేడుకలు నిర్వర్తించాలన్నా అయ్యే ఖర్చులలో అగ్రభాగం మద్యం కొనుగోళ్లుకు కేటాయించడం సర్వసాధారణమైంది. ఒకప్పుడు ఒకవ్యక్తి పొద్దంతా పనిచేసి అలసిపోయి ఏదో ఒకగ్లాసు గుడుంబా త్రాగి, బుక్కెడు బువ్వతిని నిద్రబోయేవారు. కానీ నేటి యువతకు అదో ఫ్యాషన్ అయిపోయింది. అంతేకాదు ఇంతకు ముందులా కాకుండా, చుట్టుపక్కల వాళ్లు చూస్తారేమో అన్న భయం కూడా లేకుండా, బరితెగింపు చర్యలతో మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు.