దేశంలోనే కేసీఆర్ పెద్ద ఆస్తిపరుడుగా మారాడు: బండి సంజయ్

  • ఇంద్రభవనం లాంటి కవిత ఇళ్లు చూసి సీబీఐ అధికారులు ఆశ్చర్యపోయారు
  • కేంద్రం రాష్ట్రానికి 2 లక్షల 40వేల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ కడ్తలేడు: బండి సంజయ్

జగిత్యాల జిల్లా: దేశంలో అత్యంత సంపన్నులైన నేతల కుటుంబాల్లో కేసీఆర్ ఫ్యామిలీ మొదటిస్థానంలో నిలుస్తుందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలిసిందల్లా దందాలు చేసుడు.. దండుకునుడేనని ఆయన ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 13వ రోజు కోరుట్ల నియోజకవర్గంలోని మోహన్ రావు పేటలో గ్రామస్తులతో బండి సంజయ్ రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్ కుటుంబ అవినీతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

లిక్కర్, క్యాసినో దందాలు చేసి కవిత ఇంద్రభవనాన్ని తలపించే ఇల్లు కట్టుకుందని బండి ఆరోపించారు. లిక్కర్ స్కాంపై విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులు ఆమె ఇంటిని చూసి విస్తుపోతున్నారని చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి లేక తెలంగాణ యువకులు గల్ఫ్ కు పోయి ఇబ్బందులు పడ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షన్లు రావడం లేదని, ఇండ్లు లేవని, భూములు లాక్కొంటున్నారని జనం ఫిర్యాదులు చేస్తున్నారన్న ఆయన.. కేంద్రం రాష్ట్రానికి 2 లక్షల 40 వేల ఇండ్లు మంజూరు చేస్తే, కేసీఆర్ వాటిని కట్టడం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, పేదలకు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. 

నన్ను చంపినా సరే... ఇచ్చిన హామీలన్నీ అమలు చెయ్ కేసీఆర్

‘‘పేదల గురించి ప్రశ్నిస్తే తల 6 ముక్కలు నరుకుతానని కేసీఆర్ బెదిరిస్తున్నారని, తనను చంపినా సరే... ఇచ్చిన హామీలు అమలు చెయ్ కేసీఆర్’ అని బండి సంజయ్ అన్నారు. నోటిఫికేషన్లు తప్ప ఒక్క ఉద్యోగం భర్తీ చేయడం లేదని ఆరోపించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా ఒట్టిమాటలేనన్న ఆయన.. ‘‘మోదీ సాకుతో మోటార్లకు మీటర్లు పెడితే బజారుకు ఈడుస్తమని హెచ్చరించారు. 

సమస్యలు ఏకరువు పెట్టిన గ్రామస్తులు

రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తులు తమ ఇబ్బందులు, సమస్యలను ఏకరవు పెట్టారు. ‘‘మాకు పెన్షన్లు రావడం లేదు, ఇండ్లు లేవు. గుడిసెల్లో పండుకుంటే... పాములు, తేళ్లు కుడుతున్నాయి. మమ్మల్ని మీరే ఆదుకోండి’’అని ఓ ముసలవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మా భూమిని బలవంతంగా లాక్కున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా... మాకు న్యాయం జరగలేదు. మమ్మల్ని మీరే ఆదుకోవాలి’’ అని ఓ బాధితురాలు వాపోయారు. ‘‘గల్ఫ్ లో మా నాన్న చనిపోయారు. ఇప్పటివరకు మా నాన్న మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురాలేదు. మేము చాలా పేదోళ్లం, మాకు మీరే న్యాయం చేయండి’’ అని తండ్రిని పోగొట్టుకున్న కూతురు ఆవేదన వ్యక్తం చేశారు.  

గ్రామస్తుల సమస్యలు, ఇబ్బందులను  సావధానంగా విన్న అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. ‘‘సంవత్సరం నుంచి మీకోసమే పాదయాత్ర చేస్తున్నా.. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓట్ల కోసమో రాలేదు.. కేసీఆర్ కనీసం బీడీ కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించలేదు.. పేదలు పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్తున్నారు. . కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి మరీ గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు.. కేసీఆర్ పాలనలో... గల్ఫ్ బాధితుల సమస్యలు తీరలేదు..  గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వాళ్ల శవాన్ని 6 నెలలైనా కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు.. తెలంగాణ ఉద్యమంలో దుబాయ్ వెళ్లిన వాళ్లు కూడా కేసీఆర్ కు పైసలు ఇచ్చారు..  అలాంటి వాళ్లను కూడా ముండా కొడుకులు అని తిట్టిన మూర్ఖుడు కేసీఆర్.. ఏజెంట్ల చేతిలో మోసపోయి కొందరు దుబాయ్లో సంవత్సరాల తరబడి జైళ్ల లోనే మగ్గుతున్నారు.. కేసీఆర్ పాలనలో... గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ఎలాంటి పాలసీ కూడా తీసుకురాలేదు.. దుబాయ్ నుంచి నేనే 500 మంది శవాలను కేంద్రప్రభుత్వం ద్వారా తీసుకొచ్చే ఏర్పాట్లు చేశాను.. తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే... గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తాం. కార్మికులను ఆదుకుంటాను.. గల్ఫ్ దేశాల్లో జైళ్లలో మగ్గుతున్న బాధితులను కూడా తీసుకొస్తాం..’’ అని బండి సంజయ్ చెప్పారు. 

కేంద్రం 2 లక్షల 40వేల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ కట్టించడం లేదు

తెలంగాణకు ప్రధాని మోడీ 2 లక్షల40 వేల ఇండ్లను మంజూరు చేస్తే... ఇక్కడ కేసీఆర్ ఆ ఇండ్లను కట్టించడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు, హాస్పిటల్ లలో "ఆరోగ్య శ్రీ" పనిచేయడం లేదన్నారు. పెన్షన్స్ ఇవ్వడం లేదు,  జీతాలు ఇవ్వడం లేదు, పేదలకు ఉచిత బియ్యం ఇస్తున్నది మోదీ ప్రభుత్వమే, కిలో కు 29 రూపాయలు భరిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే, కేసీఆర్ భరిస్తున్నది కేవలం ఒక్క రూపాయి మాత్రమే, రూపాయి భరిస్తున్న కేసీఆర్ గొప్పోడా...? 29 రూపాయలు భరిస్తున్న మోడీ గొప్పోడా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని, పేదోళ్ల ప్రభుత్వం వస్తేనే... పేదోళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పారు. మోడీ మంజూరు చేసిన ఇండ్లన్నీ కట్టిస్తే... అదనంగా ఇంకో రెండు లక్షల ఇండ్లను మంజూరు చేయిస్తానని కేసీఆర్ తో అంటే.. ఈరోజు వరకు సమాధానం లేదన్నారు. సొంత జాగా ఉన్న వాళ్లకు ముందు 5 లక్షల ఆర్థిక సాయం అన్న కేసీఆర్ మళ్ళీ మాట మార మార్చి ఇప్పుడు 3 లక్షల ఆర్థిక సాయం అని అంటున్నాడని, నిన్న కేబినెట్ సమావేశం పెట్టి, కనీసం ఈ అంశం పై చర్చించనేలేదన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా సక్సెస్ కాలేదు, కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, దళితులకు మూడెకరాలు, దళిత బంధు, ఉద్యోగాలు ఇచ్చాడా?.. నేను పేదోళ్ల గురించి ప్రశ్నిస్తే.... నన్ను చంపుతానని అంటున్నడు కేసీఆర్ అని బండి సంజయ్ ఆరోపించారు. 

దందాలు చేసి దండుకున్న కవితపై విచారణ జరపాలా..? వద్దా...?

దందాలు చేసి దండుకున్న కవితపై విచారణ జరపాలా ? వద్దా ?   దందా చేస్తే... పులి బిడ్డలా? కేసీఆర్... పులి, కవిత పులి బిడ్డా...? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కు 300 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది, 40, 50 గ్రామాలకు వాడాల్సిన కరెంట్ ను కేసీఆర్ తన ఫార్మ్ హౌస్ కి వాడుకుంటున్నాడు, నరేంద్ర మోడీ, బీజేపీ పేరు చెప్పి... రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ చూస్తుండు అని బండి సంజయ్ విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెడితే... ఊరుకుంటామా? ప్రజల కోసం బీజేపీ పోరాడుతూనే ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.