కాంగ్రెస్​ అంటే కేసీఆర్​కు భయమెందుకు?

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉస్మానియా లేకుంటే దాదాపు ఉద్యమమే లేదు. నాడు రాహుల్ గాంధీ లేకపోతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేది కాదు. తెలంగాణ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీకే ఓయూలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అంటే ఇంతకంటే అన్యాయం మరొకటి ఉంటుందా? అందులోనూ ఒక మేధావి, సామాజిక చైతన్యం గల బీసీ వైస్ చాన్సులర్ ని బెదిరించి రాహుల్ గాంధీని రానీయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న చిల్లర రాజకీయం అత్యంత నీచమైన సిగ్గుమాలిన చర్య. 

కుట్రలు ఎండగడుతాం..
రాహుల్‌‌‌‌ గాంధీ యూనివర్సిటీకి వస్తానంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు ? రాహుల్ గాంధీ ఏమైనా నిషేధిత సంస్థల నాయకుడా ? కాంగ్రెస్ పార్టీ పేరు వింటే కేసీఆర్ వెన్నులో వణుకుపుడుతుందా ? సమస్యలను చర్చించడానికి వస్తున్న రాహుల్ గాంధీని రానీయకుండా అడ్డుకోవచ్చు. కానీ నేడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దుర్మార్గమైన విధివిధానాల వల్ల విద్యార్థి, నిరుద్యోగులు లక్షల మంది రాహుల్ గాంధీ రూపంలో టీఆర్ఎస్ చేస్తున్న మోసపూరిత వైఖరిని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 

ఉద్యోగాలేవి..
కేసీఆర్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో విద్యను పూర్తిగా విస్మరించారు. విద్యకు సరిపోను  నిధులు బడ్జెట్​లో కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారు. వేలాది ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. వీసీల రిక్రూట్​మెంట్ చేయకుండా, సరైన బడ్జెట్ కేటాయించకుండా ఫ్యాకల్టీని నియమించకుండా ఆఖరుకు ఉన్నత విద్య అందించే యూనివర్సిటీలను సైతం సర్వనాశనం చేశారు. మరోపక్క ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని గద్దెనెక్కిన కేసీఆర్, దాదాపు40 లక్షలమంది నిరుద్యోగుల పాలిట శాపంగా మారారు. సాక్షాత్తూ ప్రభుత్వం వేసిన బిశ్వాల్ కమిటీ దాదాపు లక్షా తొంభై ఒక వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అధికారికంగా చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి మూర్ఖత్వంతో కేవలం 90 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రకటించి నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారు. మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వాగ్దానం చేసి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి ఆ అంశాన్ని పూర్తిగా మర్చిపోయినట్టు నటిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్స్​లో లక్షల కొద్దీ లోన్ అప్లికేషన్స్ పెండింగ్​లో ఉన్నాయి. ఇటు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. అటు లోన్స్ కూడా క్లియర్ చేయడం లేదు. దీంతో సొంత కాళ్లపై నిలబడాలనుకున్న యువత ఆత్మవిశ్వాసం కోల్పోయి నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం కనీసం స్కిల్ బిల్డింగ్ సెంటర్లు కూడా పెట్టలేదు. సర్కారు అనుసరిస్తున్న చిల్లర విధానం వల్ల ఎంఎస్ఎంఈ సెక్టార్ నాశనమైయింది.


ఉన్న జాబ్స్ తీసేసి..
కేసీఆర్​  ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను పీకేస్తోంది. దాదాపు 52,515  మంది ఉద్యోగులను తొలగించింది. సర్వ శిక్షా అభియాన్ లో 21,200 మంది, కరోనా కాలంలో పని చేసిన నర్సులు1640 మంది, మిషన్ భగీరథలో 709, హార్టీకల్చర్ డిపార్ట్​మెంట్​లో 315 మంది, విద్యా వలంటీర్లు 16,400 మంది, జూనియర్ పంచాయతీ కార్యదర్శలు 2,000 మంది, సోషల్ వెల్ఫేర్, విద్యా శాఖ, ఆర్టీసీకి చెందిన 2,640 మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. వీరందరికీ ఎవరు న్యాయం చేయాలి? ఇలా విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు చర్చకు వస్తాయనే ప్రభుత్వం రాహుల్ గాంధీని అడ్డుకుంది. అయితే ఒక్క రాహుల్ గాంధీని అడ్డుకున్నామని కేసీఆర్ ఆనందపడవచ్చు. ఎంత మంది రాహుల్ గాంధీలను కేసీఆర్ ఆపగలుగుతారు? 40 లక్షల మంది రాహుల్ గాంధీలు ఉవ్వెత్తున కెరటంలా ఎగసిపడితే కేసీఆర్ ఆపగలరా ? జాన్ ఎఫ్ కెనడీ అన్నట్టు ‘శాంతియుత ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తే హింసాయుత ఉద్యమాలు వస్తాయి. ప్రశ్నను అణిచివేయాలని కేసీఆర్ చూస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో, రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం కల్పించిన సమాజంలో కేసీఆర్ రాచరికపు పాలనకు చోటు లేదు. ఈ రాచరికపు పాలనకు తప్పకుండా చరమగీతం పాడి తీరుతాం.

విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీ పట్టాలు ఇచ్చే సంస్థలు కావు. విశ్వానికి దశ, దిశ నిర్దేశం చేసే సైద్ధాంతిక వేదికలు. ప్రపంచానికి జ్ఞాన కేంద్రాలైన విశ్వవిద్యాలయాల్లో సమాజానికి సంబంధించిన అనేక విషయాల పట్ల చర్చలు, సంవాదాలు జరుగుతూనే ఉంటాయి. హార్వర్డ్, ఆక్స్​ఫర్డ్, నలంద, తక్షశిల, జేఎన్టీయూ, ఓయూ ఇలా ఎక్కడైనా ప్రజాస్వామిక చర్చలకు వేదికలు విశ్వవిద్యాలయాలు. ఇలాంటి చర్చ జరగాలనే ఉద్దేశంతోనే స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి గొప్ప చర్చలకు, ఉద్యమాలకు కేంద్రం లాంటి ఉస్మానియా యూనివర్సిటీలోకి  రాహుల్ గాంధీ వస్తానంటే రానియ్యకుండా అడ్డుకోవడం కేసీఆర్ రాచరికపు పాలనకు నిదర్శనం.

- దాసోజు శ్రవణ్, 
ఏఐసీసీ అధికార ప్రతినిధి