
మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్రంలో కారు నాలుగు టైర్లు పంచరయ్యాయని, దీంతో స్టీరింగ్ కంట్రోల్ తప్పిందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ఆ నాలుగు టైర్లు కేటీఆర్, హరీశ్, కవిత, సంతోషేనని అన్నారు. ప్రస్తుతం వారికి కాంగ్రెస్ అంటేనే వెన్నులో వణుకు వస్తోందని కామెంట్ చేశారు. ఆదివారం మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావుకు మద్దతుగా గిరిజన గర్జన మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జైరాంతో పాటు రోహిత్‌రావు, చత్తీస్‌గఢ్ పీసీసీ ప్రెసిడెంట్ దీపక్ బయీజ్,పీసీసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాములు నాయక్, జాతీయ కాంగ్రెస్ నాయకులు బెల్లయ్య నాయక్ హాజరై మాట్లాడారు.
పదేండ్లలో సీఎం కేసీఆర్ రాష్ట్రానికి, గిరిజనులకు ఒరగబెట్టిందేమీలేదని జైరాం రమేశ్ మండిపడ్డారు. ఎన్నికలు రాగానే లేని ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. జనం మాత్రం కారును షెడ్డుకు పంపడం ఖాయమన్నారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఇందిరా గాంధీ విజయం సాధించి ప్రధానమంత్రి అయ్యారని జైరాం గుర్తుచేశారు. దీపక్ బయీజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులంతా ఏకతాటిపై ఉండి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. లంబాడీ భాషలో వారికి అర్థమయ్యేలా 6 గ్యారెంటీల గురించి వివరించారు. కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూసి గులాబీ పార్టీకి భయం పట్టుకుందని రోహిత్ రావుఅన్నారు.