సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు: సూర్యాపేట, నల్గొండ కలెక్టరేట్లు పేదల ఆందోళనలతో అట్టుడికాయి. సోమవారం లెఫ్ట్ పార్టీలు, ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టరేట్ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు. సూర్యాపేటలో ధర్నా సమయంలో కలెక్టర్ వెంకట్‌రావు కారులో బయటికి రాగా.. ప్రజాసంఘాల నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వీరిని పక్కకు తోసే ప్రయత్నం చేయగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కలెక్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లైనా పేదలకు ఇండ్లు కట్టించిన పాపన పోలేదని మండిపడ్డారు.
పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా అధికార పార్టీకి చెందిన వారికే ఇచ్చి పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇండ్ల స్థలాలు చూపకుండా గృహలక్ష్మి పథకం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె .వెంకటేశ్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ మల్లు నాగార్జున రెడ్డి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు ,రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి తదితరులు పాల్గొన్నారు.
ఇండ్లు ఇచ్చే వరకు పోరాటం: రంగారెడ్డి
అర్హులందరికీ ఇండ్లు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని మిర్యాల గూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. ఇండ్లులేని పేదలకు ఇంటి స్థలంతో పాటు గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు, కేంద్రం రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టి ఇస్తామని చెప్పిన కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. కొన్నిచోట్ల ఇండ్లు పూర్తయినా పంపిణీ చేయయడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని, 11 లక్షల ఎకరాలకు పైగా పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే 4.5 లక్షల ఎకరాల ఇస్తామని చెప్పడం మోసం చేయడమేనన్నారు. వానాకాలం సీజన్ స్టార్ట్ అయినందున రైతులకు ఏకకాలంలో రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నాయక్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, నేతలు బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, కందాల ప్రమీల, సయ్యద్ హశం, సీహెచ్ లక్ష్మీనారాయణ, బొజ్జ చిన్న వెంకులు, వీ వెంకటేశ్వర్లు, దండంపల్లి సరోజ, వరలక్ష్మి, మహ్మద్ సలీం, గంజి మురళీధర్, మహేశ్, కొండ వెంకన్న, అవిశెట్టి శంకరయ్య, మురారి మోహన్, చెరుకు పెద్దలు, దండంపల్లి సత్తయ్య, మల్లు గౌతంరెడ్డి, తుమ్మల పద్మ తదితరులు పాల్గొన్నారు.