వినాయక చవితి పర్వదినం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్న కేసీఆర్ అనే వార్త వినబడుతున్న సందర్భం ఇది. కేసీఆర్ గత 24 ఏండ్లలో మూడు అవతారాలెత్తారు. మూడో అవతారంలో పదేండ్లు ప్రజలను పాలించారు. ఓటమితో మూడో అవతారం చాలించక తప్పలేదు. పదేండ్ల పాలనలో నైతికతలన్నీ కోల్పోయారు. అదే అవతారాన్ని పునరుజ్జీవింపజేసుకోవడం సాధ్యమేనా అంటే.. ఆ మూడు అవతారాల కథను మనం మరోసారి గుర్తుచేసుకొని వాస్తవాలు తెలుసుకోక తప్పదు మరి!
2001కి ముందు కేసీఆర్‌లో ‘తెలుగుదేశం పార్టీ మనిషి’ ఉండేవాడు. చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా ఉండేవాడు. 2001లో టీడీపీతో తెగతెంపులు చేసుకొని, చంద్రబాబుతో అనుబంధాన్ని తుంచివేసుకొని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసిన కేసీఆర్‌లో హఠాత్తుగా 'ఒక ఉద్యమకారుడు' నిద్ర లేచాడు. 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించి ‘ముఖ్యమంత్రి’ అయిన తర్వాత కేసీఆర్‌లో 'సంపూర్ణ చంద్ర'ముఖిని పదేండ్లు చూశాం. ఇప్పుడు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.
ఒకే మనిషి 'మూడు విధాలు'గా మారుతూ రావడం గురించే.. 'ముగ్గురు కేసీఆర్‌లు' అనవలసి వస్తోంది.
టీడీపీలో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు ఆయన 'తెలంగాణవాది' కాదు. తెలంగాణ ఉద్యమం అంటేనే విసుక్కున్న సందర్భాలు కూడా చాలా ఉన్నవి.1999లో ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి రానందుకే 'తెలంగాణ' జెండా ఎత్తుకున్నారన్న నింద ఇప్పటికీ ఉన్నది. ఆ నింద ఎలా ఉన్నా టీడీపీకి, అధికార పదవులకు రాజీనామా చేయడం వలన ప్రజల్లో విశ్వసనీయతను పొందగలిగారు. ప్రజలు ఆయనను 'తెలంగాణ ఉద్యమ నాయకుని'గా ఆమోదించారు.
పాలకుడిగా పాస్ కాలేదు
ఒకసారి కాంగ్రెస్‌తో, మరోసారి టీడీపీతో పొత్తులు, ఎన్నికలు, ఎమ్మెల్యేల రాజీనామాలతో తరచూ ఎన్నికలు, నిరాహార దీక్ష .. ఇతర ఎత్తుగడలన్నీ తెలంగాణ సమాజం అనుభవంలో ఉన్నవి. 'సమైక్యవాది'గా తొలి అవతారం, 'ఉద్యమకారుని'గా రెండవ అవతారం కన్నా 'ముఖ్యమంత్రి'గా మూడవ అవతారంపైనే వివాదాలు, చర్చలు, విశ్లేషణలు, విమర్శలు విస్తృతంగా జరుగుతున్నవి. ఇందుకు కారణం ఆయన సీఎంగా పనిచేసిన తీరు, వ్యవహార శైలి, కుటుంబ పాలనగా మార్చేసిన వైనం, కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు ఫోన్ ట్యాపింగ్వంటి వ్యవహారాలకు పాల్పడడం. ఇక సొంత కూతురు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చిక్కుకొని జైలులో ఆరు నెలలు మగ్గవలసి వచ్చింది. చివరకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆమె విడుదల కావడం, 'ఎవరినీ వదలను' అంటూ శపథం చేయడం... వంటి ఘటనలు చూస్తున్నాం.
లోక్‌సభ ఎన్నికల్లో జీరో
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవకపోవడం కేసీఆర్ నాయకత్వాన్ని, ఆయన సమర్థతను ప్రశ్నార్థకంలో పడవేశాయి. 2029 దాకా బీఆర్ఎస్ ఉంటుందా? దాని మనుగడ ఏమిటి? అనే అంశాలపై పలు కథనాలు జాతీయ మీడియాలో కూడా వస్తున్నవి. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరిపోవడం, మరికొందరు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తుండడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా రక్షించుకోవాలో నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ పాండిత్యం ఉన్న కేసీఆర్‌కు అంతు చిక్కడం లేదు.
ప్రజలను చులకన చేయమరిగారు కేసీఆర్‌కు అపారమైన తెలివితేటలుండవచ్చు, మేధో శక్తి ఉండవచ్చు. 'మాటే మంత్రం'గా, దశాబ్దాల తరబడి జనాన్ని 'కనికట్టు' చేయగల సామర్థ్యం ఉండొచ్చు. కానీ, ప్రజలను చులకన చేయడం, హేళన చేయడం ఆయన ప్రతిష్టను మసకబారుస్తోంది. 'కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారానికి బోల్తా పడి బీఆర్ఎస్ను ఓడించారు' ...అని పార్టీ కార్యకర్తల సమావేశాలలో కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజల్ని, విద్యా వంతులను, తెలంగాణవాదులను ఆశ్చర్యానికి గురిచేసినవి. ప్రజల తీర్పును కేసీఆర్ లాగా అపహాస్యం చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అధికారం తమకు శాశ్వతమనే ఆలోచనాధోరణి, ఫ్యూడల్, రాచరికపు భావజాలం నుంచి మాత్రమే ఈ రకమైన మాటలు వెలువడతాయి.
మోదీతో దోస్తీ.. కుస్తీ
కేసీఆర్ రెండు 'అవతారాల్లో'నూ ప్రజామోద నాయకునిగా కనిపించారు. కానీ, ముఖ్యమంత్రిగా మూడో రూపమే అసలు కేసీఆర్‌ను వెలుగులోకి
తీసుకువచ్చింది. ఆయనలోని ఫ్యూడల్ మనస్తత్వాన్ని, రాచరికపు పోకడలను, తానొక దైవాంశ సంభూతుడిననే అహంకారాన్ని, తనను ఎవరూ ఓడించలేరనే అతి విశ్వాసాన్ని 'సీఎం అవతారం' బయటపెట్టింది. ఆయనకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా కష్టమని చిన జీయర్ స్వామితో చెలిమి, అనంతరం తెగతెంపుల ఉదంతం తెలియజేస్తోంది. చిన జీయర్ స్వామిని ఎంతగా ఆరాధించారో, అంతే నిష్కర్షగా స్వామిని వార్తల్లోనే లేకుండా చేసిపారేశారు. ప్రధాని మోదీతో దోస్తీ, తర్వాత కుస్తీ కూడా అదే కోవకు చెందినవి.
‘మీ ప్రతిభ మిమ్మల్ని చివరిదాకా అడ్డూ, అదుపూ లేకుండా తీసుకు వెళ్లగలుగుతుందని అనుకుంటారు. కానీ, ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితులు మారుతాయన్న వాస్తవాన్ని గ్రహించరు. అదృష్ట చక్రం మీద వేగంగా పైకి వెళ్లినంత సులభంగానే మీరు కిందకు చేరుకునే సమయమూ వస్తుంది. అయితే అలా కింద పడిపోయేందుకు సిద్ధంగా ఉంటే, అలా జరిగినప్పుడు మీరు నాశనం కాకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది. జిత్తులమారితనం ఎక్కువైనా ఏదో ఒక రోజు ప్రజలు గ్రహించి తిరస్కరిస్తారు' అని తత్వవేత్త నికోలో మాకియవెల్లి అన్నాడు.
కేసీఆర్ ఒరిజినల్ గ్రౌండ్ తెలంగాణ
నిజానికి కేసీఆర్ ఒరిజినల్ మైదానం తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాకారంతో సంతృప్తి చెందక, రెండుసార్లు ప్రజలు అధికారం కట్టబెట్టినందుకు వారి పట్ల కృతజ్ఞతతో ఉండకపోగా, జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. 'తెలంగాణ ప్రాంతం నాకు చిన్న గ్రౌండ్. నేను ఢిల్లీకి వెళ్లి నా ఆట చూపాలి' అని 2014లోనే కొద్దిమంది సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించారంటే అప్పటికే ఆయన జాతీయ రాజకీయాల పట్ల మక్కువ ఎక్కువగా ఉందని, దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పు తీసుకుకురావడం తనకే సాధ్యమని కూడా అనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 23 ఏండ్ల పార్టీ. ముందుగా ఉద్యమ పార్టీ. తర్వాత రాజకీయ పార్టీ. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ. అలాంటి పార్టీ భవిష్యత్తు డోలాయమానంలో పడడం కేసీఆర్ స్వయంకృతాపరాధమే. కాబట్టి, నాలుగో అవతారం సక్సెస్ అసాధ్యమే అని పరిస్థితులే చెపుతున్నాయి.
బెడిసి కొట్టిన వ్యూహాలు
రాష్ట్రంలో టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టినట్టే, కాంగ్రెస్‌ను కూడా తుడిచిపెట్టడానికి టీఆర్ఎస్ అధినేత ప్రయత్నించారు. కానీ, వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. మాటకు కట్టుబడి ఉండకపోవడం కేసీఆర్ నైజం అని చాలా విషయాలు నిరూపించాయి. ఆయన మాట తప్పినవాటిలో ప్రధానంగా.. తెలంగాణ రాష్ట్రం వస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తా, దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తా, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నవి. సాధారణంగా ఉద్యమ నాయకుడే పాలకుడైన చోట పాత విలువలకు పాతరేసి, కొత్త విలువలతో కూడిన సమాజ నిర్మాణం జరుగుతుందని ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారు.
కేసీఆర్ నియంతృత్వానికి రేవంత్ చెక్
మిషన్ కాకతీయ, భగీరథ వంటి కార్యక్రమాలు ఏవి చేపట్టినా, చివరకు జిల్లాలు విభజించినా వాటి కోసంనిపుణులతో చర్చించడం వంటివేవీ చేయలేదు. ఉద్యమానికి కేంద్రబిందువు అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వందేళ్ళ పండుగ వస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రగతి భవన్‌కే పరిమితమై 'గడీల పాలన' సాగించారు. ఉద్యమంలో తనతో కలిసి నడిసిన కోదండరామ్ ఇంటి మీదకు అర్ధరాత్రి పోలీసులను పంపించడం, ధర్నా చౌక్‌ను ఎత్తేయడం వంటి చర్యల ద్వారా ఆయనలోని అసలు అప్రజాస్వామిక వాది బయట ప్రపంచానికి తెలిసింది.
ఆయన తన పాలనలో, ప్రవర్తనలో తెలంగాణ సమాజం నిర్ద్వంద్వంగా నిరాకరించిన ఫ్యూడల్ సంస్కృతిని పెంచి పోషించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తుపానులా విరుచుకుపడి బీఆర్ఎస్ను అధికారం నుంచి కూల్చి పారేశారు. కేసీఆర్, ఆయన కుటుంబం కలలో కూడా ఊహించని రాజకీయ పరిణామం ఇది.
ఎస్.కే జాకీర్
సీనియర్ జర్నలిస్ట్