
రాజకీయ పార్టీలు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం సహజమే. అయితే గులాబీ పార్టీ నాయకులు తమ పార్టీ చరిత్రనే తెలంగాణ చరిత్రగా, తమ పార్టీ ప్రస్థానాన్నే తెలంగాణ ప్రజల జీవన యానంగా, తమ పార్టీ అధినేతనే తెలంగాణ జాతిపితగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఉద్యమ త్యాగాలు ఎవరివి.. అధికార భోగాలు ఎవరివన్న అంశం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది.
బీఆర్ఎస్ లేదా నాటి టీఆర్ఎస్ చరిత్ర చూస్తే.. త్యాగాల బాటలో సాగిన ఉద్యమాలు ఒకవైపు.. అధికారం రుచిమరిగిన రాజకీయాలు మరోవైపుగా కనిపిస్తాయి. ఉద్యమకారులు పంట వేస్తే.. స్వార్థ రాజకీయ నాయకులు కోసుకున్న తీరురాష్ట్ర ప్రజలకు తెలుసు.
నాడు చంద్రబాబు కేసీఆర్‌ను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిమితం చేశారు. దీంతో కేసీఆర్ టీడీపీకి రాజీనామా చేసి 2001లో జలదృశ్యంలో పార్టీ పెట్టారు. కానీ, ఈ అసలు విషయాన్ని తొక్కిపెట్టిన గులాబీ లీడర్లు.. కేసీఆర్ తెలంగాణ కోసమే పుట్టారు.. పార్టీ పెట్టారు అంటూ ఊదరగొడతారు. 2001లో టీఆర్ఎస్ ఏర్పాటుతో కేసీఆర్‌పై విశ్వాసం ఉంచి స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు మేధావులతో పాటు అనేకమంది బీజేపీ, సీపీఐ నాయకులు టీఆర్ఎస్లో చేరి పునాదిరాళ్లు వేశారు.
కేసీఆర్ మాత్రం ప్రజాస్వామ్య తెలంగాణ సాధనను తన వ్యక్తిగత ఎజెండాగా మార్చుకొని ఒంటెత్తు పోకడతో వ్యవహరించారు. 2001లో హరీశ్‌రావు ఎమ్మెల్యే కాకపోయినా రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించారు. కేసీఆర్ బంధు ప్రీతికి అప్పుడే అంకురార్పణ జరిగింది. ఆలే నరేంద్ర బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ సాధన సమితి ఏర్పాటు చేశారు.
విజయశాంతి కూడా బీజేపీకి రాజీనామా చేసి తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమానికి ప్రజల ముందు ఒకే రాజకీయ పార్టీ మాత్రమే ఉండాలని మేధావులు, ఉద్యమకారులు ఈ రెండు పార్టీల నాయకులపై ఒత్తిడి చేయడం వల్ల ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ ఈ రెండు పార్టీల విలీనానికి ప్రధాన పాత్ర పోషించారు. ఇతర పార్టీల విలీనం తర్వాత టీఆర్ఎస్ బలోపేతం అయిన కొద్దీ ముఖ్య నాయకులను ఏదో ఒక సాకుతో పార్టీ నుంచి పొమ్మన లేక పొగ పెట్టారు.
అవమానించిన కేసీఆర్
నిజాయతీ, అంకితభావం, ఆత్మగౌరవం గల నాయకులను, మేధావులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. ఆలే నరేంద్ర, విజయశాంతి, రవీంద్ర నాయక్, విజయ రామారావు, చంద్రశేఖర్, కొట్టే భూపతి, దేశిని చిన్న మల్లయ్య, బండి పుల్లయ్య , అచ్చ విద్యాసాగర్, చింతస్వామి, సంగులాల్ లాంటి అనేక మంది నాయకులు పార్టీ, ఉద్యమం కోసం ఆస్తులు పోగొట్టుకొని జీవితాన్ని పణంగా పెట్టి చివరికి అవమానం ఎదుర్కొన్నారు.
2004 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రొఫెసర్ జయశంకర్ ను హనుమకొండ ఎంపీగా ప్రకటించిన తర్వాత ఆయనను కాదని వినోద్ రావుకు సీటు ఇవ్వడంతో సార్ ఎంతో మనస్తాపానికి గురయ్యారు. మాట తప్పి ఆయనను అవమానానికి గురి చేశారు. 2001లో పార్టీ ప్రారంభానికి జలదృశ్యం వేదికనిచ్చి 94 ఏండ్ల వయసులో తెలంగాణ అనేక జిల్లాల్లో తిరిగి రాష్ట్ర సాధనకు కృషిచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించడమే గాక ఆయన కాలం చేస్తే కనీసం సంతాపం తెలియజేయడానికి కూడా పోకపోవడాన్ని తెలంగాణవాదులు
గుర్తుంచుకున్నారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట ఇచ్చి.. మోసం చేసిన ఘనత కేసీఆర్‌దే.
వైద్యసేవలతో కేసీఆర్ దీక్ష
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఉపవాసం దొంగ ఉపవాస దీక్షనే. ఇది ముమ్మాటికీ నిజం. ఖమ్మం ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి నిమ్స్ వరకు కేసీఆర్ ఎప్పుడు ఏం తీసుకున్నారనే వివరాలు నాడు కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డికి తెలుసు. ఆయన అప్పటి కలెక్టర్‌తో ప్రతి నిమిషం కేసీఆర్ దీక్ష విషయాన్ని సమీక్షించారు. ఇదే విషయాన్ని 2017 ఫిబ్రవరి 28న జైపాల్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘ప్రతిరోజు కేసీఆర్ ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేశారో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.
దీక్ష సమయంలో మనిషికి కావల్సిన న్యూట్రిషియన్ 750 క్యాలరీస్‌కు సంబంధించిన ఇంజెక్షన్లు కేసీఆర్ తీసుకున్నారని, వీటన్నింటికీ ఆయన ఆమోదంతోనే డాక్టర్లు సైతం వైద్యసేవలు అందించారు. నేను నిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడాను. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తే డాక్టర్లు సమాధానం విచిత్రం అనిపించింది. ఇంజెక్షన్లను కేసీఆర్ తీసుకుంటున్నారు అని చెబితే నేను షాక్ అయ్యాను. వాటి ఆధారాలు కావాలని నిమ్స్ డైరెక్టర్‌ను నేను కోరితే ఆధారాలు పంపించారు.
ఆయనకు ఇంజెక్షన్లు ఇచ్చే వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ విషయాలను నేను బయటకు చెబితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకే విఘాతం కలుగుతుందని నోరు విప్పలేదు’ అని జైపాల్ రెడ్డి చెప్పారు. ఉపవాస దీక్షను కూడా మధ్యలోనే విరమిస్తానంటే.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పోరాటం చూసి.. మళ్లీ బెడ్‌పై పడుకున్న చరిత్ర నేటికీ సురక్షితంగా ఉన్నది. ఇంకా ఈ దొంగ దీక్షను దీక్షా దివస్ పేరుతో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. కేసీఆర్ డ్రామాలాడితే.. దాన్ని చూసి1200 మంది ప్రాణాలు తీసుకున్నారు.
వీళ్ల స్వార్థపూరిత చర్యలకు అమాయకులు బలయ్యారు. స్వరాష్ట్రాన్ని పదేండ్లలో అప్పుల పాలు చేసి, ప్రాజెక్టుల పేరుతో కమీషన్ల దందాకు తెరతీసిన గులాబీ పెద్దలను ప్రజలు మొన్న ఓడగొడితే.. ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించడం లేదు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గొంతెత్తరు. కానీ, పార్టీ రజతోత్సవ సమావేశానికి మాత్రం కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. 25 ఏండ్ల పార్టీ ప్రస్థానంలో పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిసార్లు ఇతరులకు ఇచ్చారనే ప్రశ్నకు గులాబీ బాస్ వద్ద సమాధానమే లేదు.
- గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర నియోజకవర్గం