రాష్ట్ర ప్రజలు దు:ఖంలో ఉన్నరు.. సర్కార్​కు ఇక టైమ్ ​ఇయ్యం: కేసీఆర్

  • ఫామ్​హౌస్​లో బీఆర్​ఎస్​ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ
  • అసెంబ్లీలో అనుసరించాల్సినవ్యూహాలపై చర్చ
  • ప్రశ్నించినోళ్లను ప్రభుత్వం పగబడ్తున్నది
  • విగ్రహావిష్కరణకు ఆహ్వానించడం వెనుక ఏ కోణం ఉన్నా.. వాళ్లకు భోజనం పెట్టి గౌరవించిన
  • తెలంగాణ భవన్​.. జనతా గ్యారేజ్​గా మారిందని వ్యాఖ్య

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ఇకపై ఊరుకునేది లేదని బీఆర్​ఎస్​ చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్​ అన్నారు. ఇకపైన టైమ్​ ఇచ్చినా ప్రజలు ఊరుకోరని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలకు ఇప్పటికే విసుగు పుట్టిందని, ప్రజలు దు:ఖంలో ఉన్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్​ సమావేశమయ్యారు. పోరాడాల్సిన అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. 

దళితులు, గిరిజనులు, బీసీలు ఏ ఒక్కరినీ వదలకుండా ప్రభుత్వం వేధిస్తున్నదని కేసీఆర్​ ఆరోపించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. సాగునీటి రంగాన్ని రాష్ట్ర సర్కారు అస్తవ్యస్తం చేసిందన్నారు. చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్​ఎస్​ను బద్నాం చేస్తున్నారని, కాళేశ్వరం నీళ్లను ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. 

‘‘కేసీఆర్​ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్​ విర్రవీగుతున్నడు.  వాటిని చెరిపేయాలనుకోవడం వాళ్ల మూర్ఖత్వం. ఈ సర్కారు ప్రారంభించిన యాదాద్రి పవర్​ప్లాంట్​.. కేసీఆర్​ ఆనవాలు కాదా?ప్రజల కరెంటు కష్టాలను తీర్చేందుకు గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి యాదాద్రి పవర్​ప్లాంట్​కు శ్రీకారం చుట్టింది” అని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం మూర్ఖత్వం

తెలంగాణ అస్థిత్వంపై సీఎం రేవంత్​ రెడ్డికి ఏ మాత్రం సోయి లేదని కేసీఆర్​ విమర్శించారు. ‘‘కేవలం రాజకీయ స్వార్థంతోనే ఇటువంటి పనులకు పూనుకుంటున్నడు. తెలంగాణ తల్లి అనే భావన కేసీఆర్​ది కాదు.. యావత్​ తెలంగాణ సమాజానిది. 70 ఏండ్ల కిందటే దాశరథి, వెంకట్రామారావు వంటి తెలంగాణ కవులు.. తెలంగాణ తల్లి గురించి కీర్తించారు. ఈ విషయం సీఎంకు ఏమాత్రం తెలియదు. కేసీఆర్​ పెట్టిండన్న ఒకే ఒక్క అక్కసుతో కేసీఆర్​ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే మూర్ఖంగా వ్యవహరిస్తున్నడు” అని దుయ్యబట్టారు. 

తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని తనపై కోపంతో మార్చాలనుకుంటున్నారని, సీఎం వ్యవహరిస్తున్న తిర్రిమొర్రి తీరుకు ఇది నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ అస్థిత్వానికి మచ్చతెచ్చే ప్రమాదాన్ని తీసుకొస్తున్నారని మండిపడ్డారు. తనను తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించడం వెనుక ఏ కోణమున్నా.. ఇంటికి వచ్చిన అతిథులను మర్యాదచేసి గౌరవించడం తెలంగాణ సంప్రదాయమని, తన ఇంటికి వచ్చిన మంత్రికి, ఆయన వెంట  వచ్చిన వారికి భోజనం పెట్టి గౌరవించి పంపించామని కేసీఆర్​ తెలిపారు.

తీర్చిదిద్ది చేతుల్లో పెడితే నడుపుడు చేతనైతలే..

గత బీఆర్​ఎస్​ హయాంలో తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యంత ఎక్కువ జీతాలున్న ఉద్యోగులుగా రికార్డులు సృష్టించారని కేసీఆర్​  అన్నారు. ‘‘మేం పదేండ్ల కాలంలో 73 శాతం జీతాలు పెంచాం. కానీ, అధికారంలోకి వస్తే అందలమెక్కిస్తామని ఉద్యోగుల ఓట్లను పొందిన కాంగ్రెస్​ పార్టీ..  ఇప్పుడు మొండి చెయ్యి చూపించింది. వారికి అందాల్సిన 5 డీఏలకు ఒక్కటే డీఏ ఇచ్చింది” అని మండిపడ్డారు. గురుకులాలను తాము దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని.. వాటిని ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తున్నదని దుయ్యబట్టారు. తాము తీర్చిదిద్ది చేతుల్లో పెడితే కూడా సక్కగా నడపడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు.