హైదరాబాద్: కేసీఆర్ లో ఓటమి భయం కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడులో ఓడిపోతామని పరోక్షంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. చండూరు బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులు.. టీఆర్ఎస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ కు లేదని, ఫిరాయింపులకు కేరాఫ్ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ఎఫ్ఐఆర్ లో డబ్బుల విషయం ఎందుకు పెట్టలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
మరోసారి అవే హామీలు ఇచ్చారు
చండూరు వేదికగా కేసీఆర్ అబద్దాలు చెప్పారని.. గతంలో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా మరోసారి అవే హామీలు ఇచ్చారని విమర్శించారు. నీ వెంట వచ్చిన నలుగురు నేతలలో నీ పార్టీ నుంచి గెలిచిన వారెంతమంది ఉన్నారని ప్రశ్నించారు. ప్రజలు తీర్చమని అడిగేది చిన్న చిన్న సమస్యలేనని అన్నారు. చేనేత పై జీఎస్టీ 40లక్షల టర్నోవర్ ఉన్న కంపెనీలకేనని.. మీకు జీఎస్టీ వేయొద్దని అనుకుంటే జీఎస్టీ కౌన్సిల్ లో ఎందుకు అభ్యంతరం తెలపలేదని కిషన్ రెడ్డి నిలదీశారు.
కేసీఆర్ కు దమ్ముంటే ఇది అబద్దమని చెప్పాలి
ఫ్లోరైడ్ నిర్మూలన కోసం కేసీఆర్ చేసిన ఖర్చు కంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసిందన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే ఇది అబద్దమని చెప్పాలన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రి గా ఉన్నప్పుడు ఫ్లోరైడ్ గురించి ఎందుకు మాట్లాడలేదు..? మేం 800 కోట్ల రూపాయలు ఇచ్చామని కేంద్ర మంత్రి గా చెబుతున్నానని అన్నారు. డిండి ప్రాజెక్టుని నేనే పూర్తి చేస్తా అని చెప్పి ఇప్పుడు కేంద్రం పై నెపం పెడుతున్నారని విమర్శించారు. కేఆర్ఎంబీ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు డుమ్మాకొట్టారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక 8 ఏళ్లలో మునుగోడులో ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా ? అని ప్రశ్నించారు. ఎన్నికలలో ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చకుండా వదిలేసిన వ్యక్తి కేసీఆర్ అని, హామీ లు నెరవేర్చే చిత్తశుద్ధి కేసీఆర్ కు లేదన్నారు.
ఢిల్లీ బ్రోకర్లు అంటున్నావు.. నీవు కూడా బ్రోకరిజం చేసే నేర్చుకున్నావా ?
‘‘ఢిల్లీ బ్రోకర్ లు అంటున్నావు... నీవు కూడా బ్రోకరిజం చేసే చేర్చుకున్నావా ? ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన మాకు లేదు.. నీవే ముందు రద్దు చేసుకుని సానుభూతి పొందాలని భావిస్తున్నావు.. నీపై సానుభూతి, నమ్మకం పోయింది.. మీ ఎమ్మెల్యే లు మాకెందుకు... వందకోట్లు పెట్టేంత నీతిమంతులా వారు..?’’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసలు ఎవరు కొనేందుకు వచ్చారు..? ఎంతడబ్బు తెచ్చారో తేల్చేందుకు న్యాయస్థానానికి రావు, సీబీఐ రాష్ట్రానికి రాకుండా నిన్నటికి నిన్న జీవోలు తీసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. సీబీఐ రాష్ట్రానికి ఎందుకు రాకూడదో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సీబీఐ.. ఈడీలకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు ?
‘‘సీబీఐ.. ఈడీలకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు ? దేశం లో అత్యధిక పన్నులు వేసి పెట్రోల్ అమ్ముతున్న రాష్ట్రం తెలంగాణ కాదా ? కేసీఆర్ సమాధానం చెప్పాలి.. పేదల నుంచి వేల కోట్ల రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు.. తెలంగాణ లో పెట్రోల్ పై పన్నుతగ్గించి పేదలకు, యువకులకు న్యాయం చేస్తావా ? ’’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మోటార్ల కు మీటర్లు ఉండవని కేంద్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పినా కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఎవరికీ లేని ఇబ్బంది కేసీఆర్ కు ఎందుకు వస్తుందన్నారు. మీటర్లు పెడితే.. మీ అవినీతిని లెక్కించేందుకు పెడతామని కిషన్ రెడ్డి అన్నారు.
దేశమంతా బెల్టుషాపులు పెడతావా?
కేసీఆర్ రాజ్యంలో బెల్టుషాపుల రాజ్యం నడుస్తోందని, నీవు ప్రధాని అయ్యి దేశమంతా బెల్టుషాపులు పెడతావా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడులో ఆర్టీసీ, విద్యా సంస్థల బస్సులను టీఆర్ఎస్ సర్కార్ మొబైల్ బార్లుగా మార్చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మీకు బానిసలుగా ఉండాలనుకుంటే తప్పు ? ధనిక రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే భిక్షగత్తెను చేసిండు కేసీఆర్.. మునుగోడులో బస్సు లు పంపమంటే అంతర్జాతీయ అంశాలు మాట్లాడుతున్నారు.. బ్రిటన్ , యూకేని మించి భారత కరెన్సీ దూసుకు పోతోంది.. బంగ్లాదేశ్ తో పోల్చితే డాలర్ 102 , నేపాల్ 102, పాకిస్థాన్ లో 221రూపాయలు ఉంది... భారతదేశం కరెన్సీ 82రూపాయలు.. ఏది ఎక్కువో కేసీఆర్ సమాధానం చెప్పాలి ? ’’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
అదే పార్టీ, అదే గుర్తు, అవే అబద్ధాలు
భారతదేశాన్ని తక్కువ చేయడం కేసీఆర్ కు అలవాటు గా మారింది.. భారతదేశాన్ని విషగురు అని అవమానిస్తావా...? ఇది దేశంలో ఉన్న 100కోట్లకు పైగా జనాభా ను అవమానించడమే.. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం శాశ్వతం కాదు.. అనేకరకాల జిమ్మిక్కులు చేయడం, అవినీతి చేయడం ... అబద్దాలతో కాలం వెళ్లదీయడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. మునుగోడు ప్రచారంలో కేసీఆర్ తన ఉపన్యాసంలో ఓటమిని అంగీకరించారని, 2014లో ఆగస్టు 18న మాట్లాడిన మాటలనే మళ్లీ ఈరోజు మాట్లాడారని, అదే పార్టీ, అదే గుర్తు, అదే అబద్ధాలు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
9 ఏళ్లలో మునుగోడుకు ఇచ్చిన హామీలు అమలు చేయని నీవు 15రోజుల్లో హామీలను అమలు చేస్తా అని అడుగుతున్నారని, కేసీఆర్ హామీలను మునుగోడు ప్రజలు నమ్మరని, కల్వకుంట్ల కుటుంబం మోసాలు ప్రజలందరూ అర్థం చేసుకున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం... వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ ఫాంహౌస్ కు పరిమితం కావడం ఖాయం అని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.