- సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన వరి పంట పొలాలను మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం పరిశీలిచారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, సూర్యాపేట మండలం యార్కరం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత ఐదారు సంవత్సరాలుగా పంటలు ఎండిపోలేదని, ఈసారి గోదావరి జలాలు రాక చెరువులు, కుంటల్లో నీరు లేకుండాపోయాయని వాపోయారు. బోర్లు, బావుల్లో నీళ్లు లేక వరి పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ రైతులెవరూ అధైర్య పడొద్దని, మళ్లీ గోదావరి నీళ్లు కాలువల్లో ప్రవహించేలా ఉద్యమిద్దామని తెలిపారు. రైతులకు బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని భరోసానిచ్చారు.
కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో పంట పొలాలను పరిశీలించేందుకు తిరుమలగిరి మండలం ఈదుల పర్రె తండా మీదుగా జిల్లాలోకి ప్రవేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు.
బస్సులోంచి కేసీఆర్ అభివాదం
యాదాద్రి, వెలుగు : కరవు పర్యటనకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్‌కు ఆదివారం యాదాద్రి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని కరువు పరిస్థితులను పరిశీలించడానికి కేసీఆర్ఎర్రవెల్లిలోని పాంహౌస్ నుంచి బయల్దేరి తుర్కపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతను కేసీఆర్బస్సులో ఎక్కించుకొని అక్కడి నుంచి కదిలారు. భువనగిరిలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బస్సు ఎక్కారు. కేసీఆర్‌ను చూడడానికి వచ్చిన కార్యకర్తలకు ఆయన బస్సులోంచి అభివాదం చేశారు. స్వాగతం పలికినవారిలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి, నాయకులు ఉన్నారు.
కేసీఆర్ నిడమనూరు పర్యటన రద్దు
హాలియా : నిడమనూరు మండలంలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన రద్దయింది. ముందుగా ప్రకటించినషెడ్యుల్ ప్రకారం నిడమనూరు మండలం వేంపాడు లో ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు కేసీఆర్ఎండుతున్న వరి పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడాల్సి ఉంది. కానీ, సమయభావం కారణంతోపాటు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉన్నందున ఉన్నతాధికారుల సూచన మేరకు కేసీఆర్ నిడమనూరు పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేశారు.
ఇంకా 20 ఏండ్లయినా ఎస్ఎల్ బీసీ పూర్తి కాదు..
ఇంకా 20 ఏండ్లయినా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి కాదని, దాంట్లో ఓ పెద్ద తొండి పెట్టారని మాజీ సీఎం కేసీఆర్అన్నారు. ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టు మీ ప్రభుత్వం కట్టకపోవడంతోనే కరువుకు కారణమని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ స్పందిస్తూ.. అసలు ఆ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రధాన కారణమన్నారు.10 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయిందని కేసీఆర్ ప్రశ్నించారు.
అంతేకాకుండా సాగర్ డెడ్ స్టోరేజ్ లో ఉన్న నీటిని తోడుకొని హైదరాబాద్ అవసరాలకు తరలిచేందుకు ఇదే జిల్లాలో సుంకిశాల వద్ద రూ.1450 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ సైతం ఈ ప్రభుత్వం గాలికి వదిలిపెట్టిందన్నారు. 80 శాతం పనులు పూర్తి చేశామని, ప్రభుత్వం అనుమతిస్తే రెండు నెలల్లో సుంకిశాల పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ నాతో చెప్పిందని కేసీఆర్ తెలిపారు.