నడుస్తున్న చరిత్రంతా..ఫిరాయింపుల పితామహుడి పుణ్యమే

నడుస్తున్న చరిత్రంతా..ఫిరాయింపుల పితామహుడి పుణ్యమే

తెలంగాణ తెచ్చాననే నాయకుడే ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో రాజకీయాలు మరింత బాగుపడుతాయనుకున్నాం. రాజకీయాల్లోనే ఒక నూతన శకం మొదలవుతుందనుకున్నాం. ఒక నూతన రాజకీయ తరం ఎదిగివస్తుందను కున్నాం. ఉద్యమపార్టీని ఫక్తు పార్టీగా మార్చి తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తారనుకోలేదు. తెలంగాణకు ఫిరాయింపుల అంటురోగం అంటిస్తాడనుకోలేదు. పదేండ్లలో 61 మంది ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను తన పార్టీలోకి లాగేసుకొని  చరిత్ర సృష్టించాడు. తెలంగాణను పచ్చిగా వ్యతిరేకించిన, దూషించిన వారినే ప్రభుత్వంలో చేర్చుకొని భ్రష్టు రాజకీయాలకు తెరలేపారు. ఇవాళ ఆయనే తన పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై అంగలారుస్తుంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా తాను తెచ్చిన ఫిరాయింపుల అంటురోగం ఊరికే పోతుందా? అవే ఫిరాయింపుల సంప్రదాయాన్ని   ఇవాళ రెండో ముఖ్యమంత్రి వాడుకుంటున్నాడు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే ఆర్యోక్తికి ఇవాళ కేసీఆర్​ దగ్గర జవాబు లేకుండా పోయింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో (59 ఏండ్లు) పార్టీ ఫిరాయింపులు, పెట్టుబడి రాజకీయాలు ఆంధ్రా ప్రాంతంలో తప్ప, తెలంగాణలో పెద్దగా ఉండేవి కావు. అప్పట్లో తెలంగాణ రాజకీయాల్లో పెట్టుబడి తక్కువే, ఫిరాయింపులూ తక్కువే. 2014 కు ముందు, తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ జనరల్​  స్థానంలో పోటీ చేసే అభ్యర్థులకు సైతం లక్షల్లో తప్ప కోట్లల్లో ఖర్చు అయ్యేది కాదు. 2014లో కేసీఆర్​ అధికారం చేపట్టాక చూస్తే, అసెంబ్లీ అభ్యర్థులు డబుల్​ డజిట్ లో ​ కోట్లు ఖర్చు చేస్తేగానీ ప్రత్యర్థికి పోటీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 2014 నుంచి తెలంగాణలో ధన రాజకీయాలు బాగా ముదిరిపోయాయి. తెలంగాణలో ధన రాజకీయాలకు, ఫిరాయింపులకు కేసీఆర్​ పితామహుడుగా మారిపోయాడు. వచ్చిన తెలంగాణలో ఖరీదైన ఎన్నికలకు, ఫిరాయింపులకు విత్తనాలు చల్లిందే ఆయన! ఉప ఎన్నికలంటేనే వంద కోట్ల పందెంగా మార్చేశారాయన! ఇలాంటి పెట్టుబడి రాజకీయాలను స్థిరపరిచిన ఘనత ఆయనకే దక్కుతుంది.

ఇపుడు అంగలారిస్తే ప్రయోజనం ఏమిటి?

ఇవాళ గెలిచిన  బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలలో సత్యహరిశ్చంద్రులు ఎందరో కేసీఆర్​కే తెలియదు. పదేండ్లలో అలాంటి వారిని చేర్చుకుని లేదా బీఫాంలు ఇచ్చి ఇపుడు వారు పార్టీ వదిలిపోతుంటే అంగలార్చి ప్రయోజనం ఏమిటి? కొందరు రియల్టర్లు, కాంట్రాక్టర్లలను సైతం ప్రజాప్రతినిధులను చేశారంటే.. తనకు ఓటమే ఉండదనే కేసీఆర్​ ధీమానే కారణం! అందుకే, ఆయనను ప్రజలు ఓడించి నేలమీదికి తెచ్చారు. ఓడిపోయిన వారు కూడా పార్టీని వదిలి పోతున్నారంటే, బీఆర్ఎస్​ అస్థిత్వానికి పొంచి ఉన్న ప్రమాదానికిసంకేతం. 

కనిపించని పశ్చాత్తాపం 

పార్టీని వదిలిపోయే వారిని నిందించి కేసీఆర్​ తన స్వయంకృతాపరాధాన్ని కప్పిపుచ్చుకోవడం సాధ్యం కాని పని.  తెలంగాణ తెచ్చిన పార్టీ అని గొప్పలు చెప్పి.. కాంట్రాక్టర్లు, రియల్టర్​లతో ప్రభుత్వం  నడిపిన కేసీఆర్.. వాస్తవానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.​ తెలంగాణ రాజకీయ వ్యవస్థనే భ్రష్టు పట్టించినందుకు ఆయన పశ్చాత్తాప పడుతున్నట్లు కూడా మనకు కనిపించడం లేదు.  ధనాన్ని నమ్ముకున్నారేమో,  ప్రజలను మాత్రం నమ్ముకోలేదు. దాని పర్యవసానమే ఇవాళ ఫిరాయింపులు.

టీడీపీ సభ్యుడిని మంత్రిని చేశారు

పదేండ్లలో కేసీఆర్​ ప్రోత్సహించిన ఫిరాయింపులు అసహజమైనవే తప్ప సహజమైనవి కావు. 2014లో టీఆర్​ఎస్​ బొటాబొటిగా 63 స్థానాలే గెలవడం వల్ల ఫిరాయింపులను ప్రోత్సహించి ఉంటారనే వాదన ఉంది. దానికి ముద్దుగా రాజకీయ పునరేకీకరణ అని పేరు కూడా పెట్టారు.  టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ ను ఏకంగా మంత్రిని చేశారు. మరొకపార్టీ నుంచి గెలిచిన సభ్యుడిని ఏకంగా క్యాబినెట్​లోకి తీసుకోవడం చట్ట ఉల్లంఘనే. కేసీఆర్​ నిర్ణయానికి గవర్నర్​ అభ్యంతరం చెప్పినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. చివరకు అదే గవర్నర్​ చేత తలసానిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కేసీఆర్​కే సాధ్యమైంది. 

బీఆర్​ఎస్​ నేర్పిన దుస్సంప్రదాయం!

2014లో బొటాబొటిగా 63 సీట్లతో ప్రభుత్వం ఏర్పరిచిన టీఆర్​ఎస్, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో తప్పులేదనుకుంటే...ఇపుడు బొటాబొటిగా 64​ సీట్లతో ప్రభుత్వం ఏర్పరిచిన కాంగ్రెస్​, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తప్పు లేదని కేసీఆర్​ ఎందుకు అనుకోలేకపోతున్నారు, అనే నైతిక ప్రశ్నకు కేసీఆర్​, కేటీఆర్ వద్ద​ ఎంత వెదికినా జవాబు దొరకదు. ఇది బీఆర్​ఎస్​ నేర్పిన దుస్సంప్రదాయం!

రాజకీయాలను భ్రష్టు పట్టించిన పాపమే ఇది

కేసీఆర్​ తెలంగాణకు మొదటి పాలకుడు. ఆయన ఆచరించిన బాటనే ఇవాళ రేవంత్​ రెండో పాలకుడుగా అనుసరిస్తున్నాడు. ముంగటి నాగలి సాలునే రెండో నాగలి అనుసరిస్తది. ఆ దోషం ఎవరిదో  ఇవాళ అంగలారుస్తున్న కేసీఆరే ఆత్మావలోకనం చేసుకోవాలి. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించిన పాపం కేసీఆర్​ కు ఊరికేపోవడంలేదు. తన రాజకీయ అస్థిత్వ పతనమే ఆయనకు ప్రాయశ్చిత్తంగా మారుతున్నట్లుంది.

సీఆర్​ శాపనార్థాలే ఆసరాగా..

  కాంగ్రెస్​ ప్రభుత్వం వంద రోజులకు మించి, లేదా 6 నెలలకు మించి ఉండదని కేసీఆర్​ పెట్టిన శాపనార్థాలనే రేవంత్​ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఆసరా చేసుకుంటున్నాడు. కేసీఆర్ ​తన ప్రభుత్వానికే ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నందున.. తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి బీఆర్​ఎస్​ ఫిరాయింపుదారులను చేర్చుకోక తప్పడం లేదని సీఎం రేవంత్​ చెపుతారు. కేసీఆర్​ తప్పు చేశాడని, ఇపుడు తన ప్రభుత్వ సుస్థిరత కోసం తానూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాననే రేవంత్​ సమాధానం నైతికంగా నిలబడకపోవచ్చు. 

తెలంగాణ భవిష్యత్తుకు..ఆరోగ్యకరమైన రాజకీయాలు రావాలె

ఇవాళ ప్రజలు సైతం ఫిరాయింపులను పెద్దగా పట్టించుకుంటున్న దాఖలా  కనిపించడం లేదు. భవిష్యత్తు అంతా ఫిరాయింపులే తెలంగాణను రాజ్యమేలితే తెలంగాణ ఏమవుతుందో అందరూ ఆలోచించాలి. అంతమాత్రాన ఫిరాయింపుల పితామహుడైన కేసీఆర్​ స్థాపించిన ధన రాజకీయాన్ని, ఫిరాయింపుల రాజకీయాన్ని క్షమించాలని కాదు. ఒకోసారి భ్రష్టు రాజకీయాన్ని,  భ్రష్టు రాజకీయంతోనే అంతమొందించాల్సి వస్తుందని అందుకు  రేవంత్​ జవాబు చెప్పినా ఆశ్చర్యంలేదు. అందులో కొంత నిజం లేదని కాదు. ముల్లును ముల్లుతోనే తీయాలి కావచ్చు. కానీ కేసీఆర్​ భ్రష్టుపట్టించిన తెలంగాణ రాజకీయాలను ఆరోగ్యకరమైన రాజకీయాలుగా ఎలా మార్చగలరనేదే సీఎం రేవంత్​ నుంచి తెలంగాణ భవిష్యత్​ రాజకీయాలకు కావల్సిన జవాబు.

తాము చేస్తే సంసారం!

‘మా హయాంలో ఫిరాయింపులు ప్రోత్సహించలేదు. చట్టబద్ధంగా శాసన సభా పక్షాలను విలీనం చేసుకున్నాం’ అని మొన్న ఢిల్లీ ప్రెస్​మీట్​లో కేటీఆర్​  కామెంట్​  చేశారు. దొంగతనం చేశాం.. కానీ చట్టబద్దంగా చేశాం అని చెప్పడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదని చెప్పాలి. ఒక్కొక్కరికి కండువా కప్పి పార్టీలో చేర్చుకుంటున్నారని కేటీఆర్​ సీఎం రేవంత్​ రెడ్డిని తప్పుపట్టారు. వాస్తవానికి టీఆర్​ఎస్​ హయంలో కూడా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి టీఆర్​ఎస్​ కండువా కప్పి12 మంది అయ్యాక కాంగ్రెస్​ శాసన సభాపక్షాన్ని విలీనం చేసుకున్నారు. ఇవాళ రేవంత్​ రెడ్డి కూడా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరిగా కండువా కప్పుతున్నారు. 26 మంది అయ్యాక బీఆర్​ఎస్​ శాసన సభా పక్షాన్ని కాంగ్రెస్​లో విలీనం చేసుకుంటారేమో! అప్పటి ఫిరాయింపులను బీఆర్​ఎస్​ ఎలా చట్టబద్ధం చేసుకున్నదో.. ఇపుడు కాంగ్రెస్​ కూడా అవే ఫిరాయింపులను అలాగే చట్టబద్ధం చేసుకుంటుందేమో! తాము మాత్రం పవిత్రులం, ఎదుటివాళ్లే అపవిత్రం అని చెపితే కేటీఆర్​ మాటలను నమ్మేవారు  తెలంగాణలో ఎవరైనా ఉన్నారా?

ప్రతిపక్ష రహిత ప్రయత్నం

2018లో ప్రజలు టీఆర్​ఎస్​ను 88 స్థానాల్లో గెలిపించాక కూడా కాంగ్రెస్​ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారెందుకు? ఈ ప్రశ్నకు కేసీఆర్​ దగ్గర జవాబు లేనంత కాలం, ఇవాళ బీఆర్​ఎస్​ నుంచి జరుగుతున్న ఫిరాయింపులపై కేసీఆర్​ ఎంత అంగలార్చినా అర్థం ఉండదు. ప్రతిపక్షాన్ని ఖాళీ చేసి, మిత్రపక్షమని చెప్పుకున్న మజ్లిస్​కు ప్రతిపక్ష హోదా కట్టబెట్టి ప్రతిపక్షం లేకుండా చేసుకున్న ఘనత ఆయనది. అపుడు ప్రతిపక్ష రహిత పాలన చేసిన కేసీఆర్​.. ఇవాళ అలాంటి పరిస్థితే తనకు ఎదురవుతుందని ఎప్పడూ ఊహించి ఉండకపోవచ్చు! చేసుకున్నవారికి చేసుకున్నంత అనే నానుడి రాజకీయాల్లో ఇవాళ కేసీఆర్​ కే వర్తించే పరిస్థితి రావడం యాదృశ్చికం కాదు, స్వయంకృతం.

- కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి, సీనియర్​ జర్నలిస్ట్​