యాదాద్రి, వెలుగు : ‘అంజయ్యా.. ఏం జరుగుతోంది.. ఓసారి ఫాంహౌస్‌కు రా, మాట్లాడుకుందాం’ అని వాసాలమర్రి మాజీ సర్పంచ్ పోగుల ఆంజనేయులును మాజీ సీఎం కేసీఆర్ పలకరించారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ తిరుగు ప్రయాణంలో తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో కొద్దిసేపు ఆగారు. అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు.
మాజీ సర్పంచ్పోగుల ఆంజనేయులును దగ్గరగా పిలిచి ‘అంజయ్యా.. బాగున్నవా..? గ్రామంలో ఏం జరుగుతోంది, కరెంట్, వాటర్ సరఫరా ఎలా ఉంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయా’ అని అడిగారు. దీంతో కరెంట్ గతంలో మాదిరిగా ఉండడం లేదని, సంక్షేమ పథకాలు అమలుకావడం లేదని ఆంజనేయులు కేసీఆర్‌కు చెప్పారు. దీంతో ‘మనకేం కాదు, అంతా మంచే జరుగుతుంది, ఫోన్ చేస్తా ఓ సారి ఫాంహౌస్‌కు రా’ అని ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ అక్కడి నుంచి ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు.