వనపర్తి, వెలుగు: సీఎం కేసీఆర్ పెద్ద అబద్ధాల కోరు అని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగనాయక స్వామి ఆలయంలో పూజలు చేసి ‘ప్రజల గోస- బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం కంబళ్లాపూర్ లో మీడియాతో మాట్లాడుతూ రూ. లక్ష రుణ మాఫీ, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, నిరుద్యోగ భృతి హామీలను ఏమయ్యాయని ప్రశ్నించారు. కొత్తగా ఆదివాసీ, లంబాడాలకు భవనాలు, గిరిజన బంధు ఇస్తామని ఆశ పెడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనేక పథకాలకు కేంద్రం నిధులు ఇస్తున్నా.. అంతా తామే చేస్తున్నట్లు అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు రైతులకు మద్దతు ధర ఇస్తున్నది కేంద్రమేనని కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెంచి ఖజానా నింపుకుంటున్నారని, వైన్సులపై కేసీఆర్ ఫొటో పెట్టాలని సూచించారు. వనపర్తి నియోజకవర్గంలో కొత్తగా ఎకరాకు కూడా నీళ్లివ్వని మంత్రి నిరంజన్ రెడ్డి.. పాత పథకాలతో నీటిని మళ్లించి నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. బైక్ యాత్ర ఇన్ చార్జి వాసుదేవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, నాయకులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, నారాయణ, బి.కృష్ణ, అనుజ్ఞ రెడ్డి, సబిరెడ్డి వెంకట్ రెడ్డి, జింకల కృష్ణయ్య, అశ్వద్ధామ రెడ్డి, శ్రీశైలం, వెంకటేశ్వర రెడ్డి, పెద్ది రాజు పాల్గొన్నారు.
కేసీఆర్ కుటుంబం.. తెలంగాణకు పట్టిన శని
మరికల్, వెలుగు : సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టిన శనిలా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు కె.రతంగ్‌పాండురెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని తీలేరు, వెంకటాపూర్, పెద్దచింతకుంట, రాకొండ, పూసల్‌పహాడ్, పల్లెగడ్డ, ఇబ్రహీంపట్నం, మరికల్, అప్పంపల్లి గ్రామాల్లో ‘ప్రజాగోస- బీజేపీ భరోసా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాటల గారడితో తన కుటుంబాన్ని బంగారంగా మార్పుకున్నారే తప్ప.. రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రధాని మోడీ ప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ కే పరిమితం అయ్యారని మండిపడ్డారు. సచివాలయాన్ని కూలగొట్టి ప్రజాధనాన్ని లూటి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు శ్రీనివాస్, నర్సన్‌గౌడ్, తిరుపతిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, కొండయ్య, వేణు, శ్రీరాం, నరేశ్‌గౌడ్, బసిరెడ్డి, జైపాల్, దేవేందర్‌గౌడ్, మల్రెడ్డి పాల్గొన్నారు.
గద్వాల టౌన్‌లో చోరీ
గద్వాల టౌన్, వెలుగు: గద్వాల జిల్లా కేంద్రంలోని బీడీ కాలనీకి చెందిన రిహాన్ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. రిహాన్ భార్య కొన్నిరోజుల క్రితం తన తల్లిగారి ఊరైన రాయచూర్ కు వెళ్లింది. ఆదివారం ఇంటికి తాళం భార్యను చూసేందుకు వెళ్లిన రిహాన్ రాత్రి అక్కడే ఉన్నాడు. సోమవారం ఉదయం వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలో ఉన్న 6 తులాల గోల్డ్,30 తులాల వెండి, రూ 2.10 లక్షలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి తెలిపారు.
కలెక్టరేట్లకు అంబేద్కర్ పేరు పెట్టాలి
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: కొత్త పార్లమెంట్ తో పాటు కొత్త కలెక్టరేట్లకు అంబేద్కర్ పేరు పెట్టి, విగ్రహాలు ప్రతిష్ఠించాలని టీఎంఎం రాష్ర్ట అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఎంఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం వెంకటస్వామి మాట్లాడుతూ సేకరించిన సంతకాల పత్రులను సీఎం కేసీఆర్ , పీఎం నరేంద్రమోడీలకు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ వీరబ్రహ్మచారి, డీసీసీ ప్రెసిడెంట్ ఉబేదుల్లా కోత్వాల్, జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రి, టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ యాదవ్, సాయిబాబ, రాఘవేంద్ర రాజు, అబ్దుల్ హక్, బీజేవైఎం నేత రాచాల శ్రీధర్, టీఎన్జోవో ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్, వైఎస్ఆర్పీ నేత జెట్టి రాజశేఖర్, పండగ సాయన్న సేవా సమితి నాయకులు కృష్ణ, మైత్రి యాదయ్య, ఆఫ్ నేత అంబరీశ్ , టీజెఎస్ నేత జాకీర్, టీఎంఎం నేతలు పాల్గొన్నారు.
ఇండ్లివ్వకుంటే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తం
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జడ్చర్ల నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకపోతే జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని టీపీసీసీ సెక్రటరీ అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రతి గ్రామంలో నిరుపేదల ఇండ్లు కూలిపోతున్నాయని, వారికి వెంటనే ఇండ్లు ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్ 2014లో మెనిఫెస్టోలో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం, స్థలం ఉన్నవారికి రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పారు. రెండోసారి గెలిచాక మాట మార్చి రూ. 3 లక్షలు ఇస్తామంటున్నారని, అదైనా ఒక్కరికీ కూడా ఇవ్వలేదన్నారు. తాను ఏగ్రామానికి వెళ్లినా పేదలు, మహిళలు, వృద్ధులు సమస్యలను ఏకరువు పెడుతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో మిడ్జిల్ ఎంపీపీ కాంతమ్మ, ఎంపీటీసీ శంకర్ నాయక్
తదితరులు పాల్గొన్నారు.
స్టూడెంట్లను ధర్నాకు తీసుకెళ్లిన లీడర్ల అరెస్టు
గద్వాల, వెలుగు: ఎస్సీ గర్ల్స్ హాస్టల్స్ స్టూడెంట్స్ తీసుకెళ్లి కలెక్టరేట్ ముందు ధర్నా చేయించారనే కారణంతో స్టూడెంట్ యూనియన్ లీడర్లను అరెస్టు చేశారు. గద్వాల టౌన్ ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి వివరాల ప్రకారం.. ఎన్ఎస్ యూవై జిల్లా అధ్యక్షుడు బోయ వెంకటేశ్ , నేతలు వామనపల్లి రంగస్వామి, నాగరాజు మాదే పోగు ప్రకాశం ఈనెల 15న గద్వాల టౌన్ లోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్లను కలెక్టరేట్ వద్దకు తీసుకెళ్లారు. తన పర్మిషన్ లేకుండా సిబ్బందిని తోసివేసి స్టూడెంట్లను తీసుకెళ్లారని వార్డెన్ సుజాత పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం బోయ వెంకటేశ్ , నాగరాజు, ప్రకాశంలను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. వామనపల్లి రంగస్వామి పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు.
అనుమతి లేని ఏడు ఆస్పత్రులు సీజ్
కోస్గి టౌన్, వెలుగు : కోస్గి పట్టణంలో అనుమతి లేని ఏడు ఆస్పత్రులను డీఎంహెచ్‌వో డాక్టర్ రామ్ మనోహర్ రావు సీజ్ చేశారు. సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలను నిర్వహించారు. ఆరు ఆర్‌ఎండీ ప్రజా వైద్యశాలలతో పాటు ఒక చిల్ట్రన్స్ ఆస్పత్రిని సీజ్ చేశారు. అనంతరం డీఎంహెచ్ వో మాట్లాడుతూ డీహెచ్‌ఎంఎస్ చదివి అల్లోపతి మందులు రాయడం, ఎలాంటి అర్హత లేకున్నా డీహెచ్ఎంఎస్ వైద్యం చేయడం కోస్గిలో కొందరికి అలవాటుగా మారిందన్నారు. ఇకనుంచి ప్రతివారం తనిఖీలు ఉంటాయని, రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నాని హెచ్చరించారు. తహసీల్దార్ మమత, ఆర్ ఎం గుర్నాథ్ రెడ్డి, ఆర్‌ఐ అమరంత్ రెడ్డి, డాక్టర్ శైలజ, ఎస్సై నరేశ్ పాల్గొన్నారు.
సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే వారసులు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే వారసులని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసర కాయల జంగారెడ్డి చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు సంఘం జిల్లా కమిటీలో ఆయన మాట్లాడుతూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని మండిపడ్డారు. 1946 నుంచి 1951 వరకు నైజాం నవాబు, దేశముఖ్ లు, జాగీర్దార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో లిఖించతగ్గదన్నారు. ఈ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని రైతాంగ ఉద్యమాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అటవీ భూములు సాగు చేస్తున్న పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, ఎన్నికల హామీ మేరకు రూ. లక్ష రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో నిర్మించాలని, దళారీ వ్యవస్థను నిర్మూలించి పంటలకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. మంత్రివర్గ ఉప సంఘం సూచించిన విధంగా ధరణి లోపాలను పరిష్కరించి.. అర్హులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు బి బాల, నేతలు కృష్ణారెడ్డి, శివ శంకర్, నాగేంద్రం, శివ కుమార్, వెంకటయ్య పాల్గొన్నారు.
సొంతింటి కల నెరవేరుస్తున్నం
మదనాపురం, వెలుగు: సీఎం కేసీఆర్ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. సోమవారం మదనాపురం మండలం తిరుమలపల్లిలో రూ. 2.16 కోట్లతో నిర్మించిన 40 డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషాతో కలిసి ప్రారంభించారు. అనంతరం రూ. 3.35 కోట్లతో మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన కేజీబీవీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పై ప్రశ్నలు వేసి సమాధానం అడిగారు. సర్కారు బడుల్లో కార్పొరేట్ దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. కేజీవీబీలో నీటి నిల్వ చేసుకోవడానికి ట్యాంక్, ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి, డీఈవో రవీందర్, జడ్పీటీసీ కృష్ణయ్య యాదవ్, మార్కెట్ ఛైర్మన్, శ్రవణ్ కుమార్ రెడ్డి, సింగల్ విండో అధ్యక్షులు వంశి చందర్ రెడ్డి, హనుమాన్ రావు, జిల్లా ఫిషరీస్ ఏడి రహమాన్, సర్పంచులు రామ్ నారాయణ, టీకే.శారద, యాదగిరి, వడ్డే రాములు, రవీందర్ రెడ్డి, నాగన్న యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులపై కలెక్టర్ చిన్నచూపు
ధన్వాడ, వెలుగు: కలెక్టర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను చిన్నచూపు చూస్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ధన్వాడలో ఎంపీపీ పద్మినిబాయి అధ్యక్షతన నిర్వహించిన జనరల్‌బాడీ మీటింగ్ కు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు ఉమేశ్‌కుమార్, గోవర్దన్‌గౌడ్, సుదీర్‌కుమార్ మాట్లాడుతూ ధరణిలో ఎదురవుతున్న సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలు చెప్పేందుకు వెళ్లిన మాగనూర్ ప్రజాప్రతినిధులను కలెక్టర్ అరెస్టు చేయించారని మండిపడ్డారు. ‘ఆమె మీ వారు.. మాకు సహకరించరు’ అని బీజేపీ సభ్యులనుద్దేశించి కామెంట్ చేశారు. రైతు వేదికలపై జరిగిన చర్చలోనూ ఎమ్మెల్యే మాట్లాడుతూ ధన్వాడలో వేదికలు నిర్మించే పనులను హైదరాబాద్ కాంట్రాక్టర్ కు అప్పగించడంలో కలెక్టర్ పాత్ర ఉందని ఆరోపించారు. కిష్టాపూర్ నుంచి ముడుగులమలయ తండాకు వెళ్లే రోడ్డును పనులను నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టర్ పీపీ రమేశ్ అగ్రిమెంట్ రద్దు చేశామని ఏఈ ప్రవీణ్‌కుమార్ వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కాంట్రాక్టర్ సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఎక్కడా పనులు సరిగ్గా చేయడం లేదని, ఇతన్ని జైలుకు పంపించాలని అధికారులకు సూచించారు . ఈ సమావేశంలో జడ్పీటీసీ విమలదేవి, ఎంపీడీవో సద్గుణ, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
సర్పంచ్ పై ఎమ్మెల్యే అనుచరుల దాడి
ఉప్పునుంతల, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఈరత్వానిపల్లి గ్రామంలో సోమవారం అధికార పార్టీ సర్పంచ్ పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కేశముని లింగమయ్య అనే రైతు గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా ఊరికి దగ్గరగా అక్రమంగా కోళ్ల ఫారం నిర్మాణం చేపట్టాడు. దీన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. అయితే పంచాయతీ కార్యదర్శితో తీర్మానం పొంది పనులు మొదలుపెట్టగా గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్, గ్రామస్తుల సమక్షంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. దీంతో ఇదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు జక్కుల కృష్ణయ్య, జక్కుల ముత్యాలు, కేశముని వెంకటేశ్, కేశముని దశరథం వచ్చి అక్కడున్నవారిని తిట్టారు. సర్పంచ్ లింగమయ్య వారించినా వినకుండా ఆయనపైనే దాడి చేశారు. గ్రామ సమీపంలో నిర్మిస్తున్న కోళ్లఫారం వల్ల గుడి బడి ఇళ్లకు దగ్గరగా ఉందని నచ్చజెప్పినా కూడా వినిపించుకోకుండా ఎమ్మెల్యే అండదండలతో కయ్యానికి కాలు దువ్వుతూ దాడి చేస్తున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.