కేసీఆర్ ఓ శక్తి.. ఆయన్ను ఫినిష్ చెయ్యడం ఎవ్వరితరం కాదు: కేటీఆర్

కేసీఆర్ ఓ శక్తి.. ఆయన్ను ఫినిష్ చెయ్యడం ఎవ్వరితరం కాదు: కేటీఆర్
  • అలా అన్నోళ్లందరూ ఏమయ్యారో రేవంత్ తెలుసుకోవాలి
  • హామీలపై సోనియాతోపాటు ప్రజలనూ మోసం చేసిండు
  • తనను జైల్లో పెడితే వందలాది కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పుడ్తరని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​ ఓ శక్తి అని, ఆయనను ఫినిష్​ చెయ్యడం ఎవరితరమూ కాదని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. కేసీఆర్‌‌‌‌ని ఫినిష్ చేస్తానంటూ రేవంత్ రెడ్డి  పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, గతంలోనూ ఎంతో మంది కేసీఆర్‌‌‌‌ను ఫినిష్ చేస్తామన్నారని పేర్కొన్నారు. అలా అన్నవాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రేవంత్ రెడ్డి ఓసారి చరిత్రలోకి తొంగి చూస్తే తెలుస్తుందని, అలాంటి వాళ్లతోనే కానప్పుడు రేవంత్​రెడ్డి ఎంత అని అన్నారు.  

శనివారం తెలంగాణ భవన్‌‌‌‌లో  కేటీఆర్​మీడియాతో మాట్లాడారు. కష్టాలు ప్రతి మనిషికీ వస్తాయని, తమకూ అలాగే వచ్చాయని తెలిపారు. వచ్చిన కష్టాలను గట్టిగా ఎదుర్కోవాలని అన్నారు.  కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారని,  నేడు రాష్ట్రమంతటా బీఆర్ఎస్ బలంగా మారిందని తెలిపారు. ‘‘కేసీఆర్  తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే రేవంత్ రెడ్డికి  ఆ సీటు ఉంటుండెనా? పదవులు ఉండడం కాదు. ప్రజల గుండెల్లో కేసీఆర్‌‌‌‌కు ప్రత్యేక స్థానం ఉంది. రేవంత్ రెడ్డి టెక్నికల్ ప్రాబ్లమ్స్‌‌‌‌తో ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నడు. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దోళ్లు అయిపోరు” అని వ్యాఖ్యానించారు.  

దేవుళ్లనూ రేవంత్​ మోసం చేసిండు

రైతులకు వానాకాలం రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం ఎగ్గొట్టిందని కేటీఆర్ అన్నారు. సోనియాగాంధీ బర్త్ డే నాడే రుణమాఫీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి..  ఏడాది గడిచిపోయినా.. మళ్లీ సోనియాగాంధీ బర్త్‌‌‌‌డే వస్తున్నా రైతు రుణమాఫీ చేయలేదని, రైతు భరోసాకు దిక్కు లేకుండా పోయిందని తెలిపారు. సోనియా గాంధీనే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ రేవంత్​రెడ్డి మోసం చేశారని విమర్శించారు. ఆయన దేవుళ్లను కూడా వదల్లేదని, ఏ దేవుడి దగ్గరకు పోతే అక్కడ ఒట్లు పెట్టాడని అన్నారు. దేవుళ్లనూ మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ అని పేర్కొన్నారు.  

రేవంత్​పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు

‘మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో’ (మూసీలో దోచుకుని.. ఢిల్లీకి చెల్లించడం) అనేలా రేవంత్ తీరు ఉన్నదని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదని, ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే ఆ పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదని పేర్కొన్నారు. ‘‘రాహుల్ గాంధీకి డబ్బులు కావాలి. ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. వాళ్లకు డబ్బులు పంచాల్సిందే.  అందుకే మూటలు పంపే పనిలో రేవంత్​ ఉన్నారు” అని ఆరోపించారు. మూసీ లో జరుగుతున్న అక్రమాలపై ప్రజలకు కచ్చితంగా వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘మూసీ పునరుజ్జీవం అని రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నాడు. గత 60 ఏండ్ల నుంచే మూసీలోకి మురికి నీళ్లు వస్తున్నాయి. 

మూసీ మురికికూపం కావడానికి నిజానికి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణం. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఆ పార్టీల్లోనే ఉన్నాడు. మేం మాత్రమే మూసీని బాగు చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాం. మూసీని తిరిగి బతికించాలంటే ముందు మురికి నీటిని శుద్ధి చేయండని కేసీఆర్ మాకు చెప్పారు. కేసీఆర్ దాదాపు రూ. 4 వేల కోట్లతో 1200 ఎమ్​ఎల్​డీల ఎస్టీపీలను నిర్మించారు. చిత్తశుద్ధితో పనిచేయడంతో 100 శాతం మురికి నీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఎస్టీపీల నిర్మాణంతో 80 శాతం మూసీ శుద్ధీకరణ పూర్తయినట్టే. ఇక మేడిగడ్డ నుంచి నీళ్లను తీసుకొచ్చి కొండ పోచమ్మ సాగర్ ద్వారా గండిపేటకు తేవాలని నిర్ణయించాం. 

ఒకవైపు వ్యవసాయానికి నీళ్లు, మరొకవైపు పట్టణాలు, హైదరాబాద్ కు నీళ్లు తెచ్చేలా కాళేశ్వరం క్టటాం. గోదావరి నుంచి గండిపేటకు నీళ్లు తెచ్చేందుకు గతేడాది మే లోనే తీర్మానం  పాస్ చేశాం. రూ. 1,100 కోట్ల తో గండిపేట గేట్లు ఎత్తిత్తే కిందకు ఫ్రెష్ వాటర్ ఇచ్చేలా ప్లాన్ చేశాం. మూసీ మీద దాదాపు 15 బ్రిడ్జిలను కూడా మంజూరు చేశాం. ఆ బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్ లు కట్టాం. మూసీలో ఎప్పుడు నీళ్లు ఉండేలా దాన్ని జీవనదిగా చేసేందుకు అన్నీ సిద్ధం చేశాం. కేవలం రూ. 1,100 కోట్లు ఖర్చు చేస్తే చాలు మూసీ పునరుజ్జీవం జరిగినట్టే. కానీ, సీఎం రేవంత్​  లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తాడంట" అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.   

వందలాది మంది కేటీఆర్‌‌‌‌లు పుడ్తరు 

ఏవో కేసులు పెట్టి తనను జైలుకు పంపితే ప్రశ్నించడం మానేస్తానని కాంగ్రెస్ వాళ్లు అనుకుంటున్నారని, కానీ, తాను జైలుకు పోతే వందలాది కేసీఆర్‌‌‌‌లు, కేటీఆర్‌‌‌‌లు పుట్టుకొస్తారని కేటీఆర్ అన్నారు. ప్రతి దాంట్లోనూ స్కామ్ ఉందంటూ రేవంత్ అంటున్నారని మండిపడ్డారు. ‘‘ఓఆర్ఆర్ లీజును ఒక సంస్థకు రూ. 7 వేల కోట్లకు ఇస్తే లక్ష కోట్లు వచ్చేదాన్ని రూ. 7 వేల కోట్లే ఇచ్చారని రేవంత్​ అన్నారు. మరి, ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ నువ్వే కదా? ఆ టెండర్ రద్దు చేసి రూ. లక్ష కోట్లు తీసుకురా. నేను కోకాపేట భూముల్లో అవినీతి చేశానని అన్నావ్. విచారణ జరుపు. తప్పు చేస్తే శిక్ష వెయ్” అని రేవంత్​రెడ్డికి కేటీఆర్​ సవాల్​ చేశారు.