ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రభుత్వ పాత్ర లేకుండా ప్రజలు జీవించడమే నిజమైన అభివృద్ధి అంటారు. దీని సారాంశమే స్వయం సమృద్ధ భారత్(ఆత్మనిర్భర్ భారత్). ప్రజలు చేసుకోలేని పనులు(ఇన్ ఫ్రాస్ట్రక్చర్, వెల్ఫేర్) మాత్రం ప్రభుత్వమే చేయాలని ప్రధాని అభిప్రాయం. వ్యాపారం, వ్యవసాయం ప్రభుత్వ బలంపై కాకుండా మార్కెట్ బలంపై నడవాలి. అప్పుడే మన వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచ వాణిజ్యంలో భాగం అవుతాయి. భారత ప్రధాని మోడీ ఆహార భద్రత కోసం, పోషకాలతో కూడిన ఆహార ఉత్పత్తులు తయారు చేసుకోవాలని తెలిపారు. ఉత్పత్తికి తగ్గ లాభాలు రైతుకు సరిపోయేంతగా ఉండాలంటే ధరల పోటీ పెంచాలి. పంటల నాణ్యతను పెంచి ప్రపంచ వాణిజ్యంలో భాగస్వామ్యం పెంచుకోవాలి. అప్పుడే రైతుకు గిట్టుబాటు రేటు వస్తుంది. వ్యవసాయ రంగంపై కేంద్ర సహకారాన్ని గాలికివదిలేసి తెలంగాణ సర్కార్ రైతుల బతుకులపై ఓట్ల మార్కెటింగ్ చేస్తున్నది.మోడీ ప్రభుత్వం మార్కెట్ రెగ్యులేషన్ నియంత్రణ చేసేందుకు ఈ-మార్కెట్ సిస్టమ్ తెచ్చారు. రాష్ట్రాల మధ్య చెక్ పోస్టులు ఎత్తివేశారు. వన్ ఇండియా వన్ మార్కెట్ సిస్టం అమలు చేయాలని తెలిపారు.
మార్కెట్, పంటల బీమా గాయబ్
2018 ఎన్నికల ముందు కేసీఆర్ రాబోయే 5 ఏండ్లలో రూ.10.30 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. దానికి అదనంగా రూ.1.30 లక్షల కోట్ల నిధులు సేకరిస్తామని, అప్పులకు రూ.2.30 లక్షల కోట్లు పోను, కేంద్రం నుంచి వచ్చే ఆదాయంతో రూ.10 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గోడౌన్, ఒక కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెస్ యూనిట్ పెట్టి 80 శాతం సబ్సిడీతో మహిళా సంఘాలకు పని కల్పిస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకున్నాడు. 4 ఏండ్లు పూర్తయ్యాయి. కానీ ఒక్క పనీ లేదు. రాష్ట్రంలో పండే ప్రధాన పంటలు వరి, పత్తి, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎఫ్సీఐ, సీసీఐ సంస్థలు కొంటున్నాయి. మిగతా పంటలన్నీ వ్యాపార వర్గాలు కొంటున్నాయి. రైతులు పండించిన పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఒక వంతు కూడా లేదు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర రాకపోతే, ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వ ఇవ్వడం లేదు. వ్యవసాయ మార్కెట్ లో ఎలాంటి సంస్కరణలు కానీ, అభివృద్ధి కానీ తీసుకురాలేదు. పైగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఎత్తేశారు. మార్కెట్ ఫీజు మాత్రం దండుకుంటున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు నిలువునా దోచుకుంటున్నారు. కానీ రైతులకు మాత్రం ఏమాత్రం సౌకర్యాలు సమకూర్చలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో రైతు నష్టపోతే కనీసం పరిహారం లెక్క గట్టక రైతును నిండా ముంచుతున్నది కేసీఆర్ ప్రభుత్వం.
వరి వస్తే ఊరే అని..
తెలంగాణను విత్తన భాండాగారంగా చేసి దేశం మొత్తానికి విత్తనాలు సరఫరా చేసి రైతును ధనవంతుడిని చేస్తానని తుపాకీ రాముడి మాటలు మాట్లాడాడు. ఎన్ని కొత్త విత్తనాలు వచ్చాయి, ఎన్ని పరిశోధన కేంద్రాలు పెరిగాయంటే ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. 1కేజీ నకిలీ విత్తనం వచ్చినా సీజ్ చేసి, వ్యాపారులను జైలుకు పంపుతామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, కోర్టులు చెప్పినా వినం అన్నారు. కానీ కొత్త విత్తనాలు రాలేదు, నకిలీ విత్తన రాజ్యం ఆగలేదు. ఏ వ్యాపారస్తుడు జైలుకు పోలేదు. ప్రత్యామ్నాయ పంటలపై ఉలుకు పలుకు లేదు. నేను ప్రాజెక్టులు కడుతున్నాను, మీరు సోనామసూరి వరి పెట్టండి, దేశంలో ప్రపంచంలో ఎక్స్ పోర్ట్ చేసి రైతులను ధనవంతులను చేస్తానన్నాడు. ఆ తర్వాత వరి ఉరి అని, వరి పెట్టకండి పెడితే వరి కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తానని చెప్పాడు. పంటల సాగుపై నేటికీ ప్రభుత్వం వద్ద సరైన అంచనాలు లేక వ్యవసాయ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో కూడా మన ప్రధానమంత్రి రైతుల పట్ల శ్రద్ద పెట్టి ఎరువుల కొరత రాకుండా చూశారు. మన కార్మికులను దుబాయికి పంపించి అక్కడ ఎరువులు తయారు చేసి, దిగుమతి చేసుకొని రైతులను ఆదుకున్నారు. దాని వలన 80 కోట్ల మంది పేదలకు 3 ఏండ్లు ఉచితంగా తిండి గింజలు ఇచ్చారు. దీనిపై ప్రపంచ బ్యాంకు మన ప్రధానిని ప్రపంచం ఆదర్శంగా తీసుకోవాలని తెలిపింది, కానీ మన కేసీఆర్ కు మాత్రం సోయి లేదు.
ఓట్లు తప్ప రైతు బతుకు పట్టదు
వ్యవసాయ పెట్టుబడుల మార్కెట్ ను దశాబ్దాల నుంచి కార్పొరేట్ సంస్థలు శాసిస్తున్నాయి. దీనిని నియంత్రించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పంటల వారీగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సవరించి రైతులకు సరిపోను పెట్టుబడులు, సబ్సిడీ ఎరువులు అందిస్తున్నారు. పంటలు వచ్చాక మార్కెట్ ను రెగ్యులేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కానీ తెలంగాణ ప్రభుత్వం దానిని అందిపుచ్చుకోలేదు. అటు రైతు పరపతి దెబ్బతిని, గిట్టుబాటు ధర రాక పండించిన పంటలకు న్యాయమైన రేటు రాక నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. వ్యవసాయం పారిశ్రామికంగా ఎదగనంత కాలం రైతుకు గిట్టుబాటు రేటు రాదని కేంద్రం రాష్ట్రాలకు సూచిస్తున్నది. కానీ కేసీఆర్ ప్రభుత్వం 9 ఏండ్లలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కేవలం రైతుబంధుతో రైతులకు బంధం వేసి ఓట్లు దండుకోవడమే తప్ప రైతుల జీవితాలను మెరుగు పర్చలేదు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మారితే తప్ప అది సాధ్యం కాదని రైతులు గ్రహించాలి.
సహకార వ్యవస్థను కుప్ప కూల్చారు
వ్యవసాయ సహకార సంఘాలను నిర్వీర్యం చేశారు. ఇప్పటికీ పాత 9 డీసీసీ బ్యాంకులు మాత్రమే నడుస్తున్నాయి. రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించినా 33 డీసీసీలు వ్యవస్థీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి వ్యవసాయ సహకార సంఘాన్ని పెట్టి రైతుల సంఘటిత శక్తి నిర్మించాలని తెలుపుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంఘటిత శక్తిని నిర్వీర్యం చేసి కేవలం రైతులు ప్రభుత్వ బిచ్చం మీదే ఆధారపడి వ్యవసాయం చేయాలని కుట్ర చేస్తున్నది. మొత్తం వ్యవసాయ సహకార వ్యవస్థనే బలహీనపర్చింది. రైతుకు పరపతి లేకుండా చేసింది. కృత్రిమ రైతు సంఘాలను సృష్టించాడు కేసీఆర్. ఆ రైతు సంఘాలను మొదట సొసైటీలు అని, ఆ తర్వాత కంపెనీ అని, కొద్ది రోజులకు ఫెడరేషన్ అని రైతు సమన్వయ సమితిల పేరు మీద రాజకీయ పబ్బం గడుపుతున్నాడు. ఊరి ఊరికి కేంద్ర ప్రభుత్వం కట్టించిన రైతు సమావేశ షెడ్లు పశువుల కొట్టాలుగా మారాయి.
హామీల ఎగవేత, కరెంటు చార్జీల మోత
2014 లో ఇచ్చిన రుణమాఫీ హామీ 2018 ఎన్నికల వేళ అమలుకు నోచుకుంది. రూ.4000 చొప్పున రైతుబంధు ఇచ్చి ఎన్నికలకు వెళ్లింది. దాంతో అన్ని వ్యవసాయ సబ్సిడీలు ఎత్తివేసింది. ఇక రెండవ టర్మ్ లో 2019లో సగం రైతుబంధు ఎగవేసింది. 45 లక్షల రైతుల రుణమాఫీ నీరుగార్చింది, వడ్డీ డబ్బులు మిగుల్చుకుంది. కేవలం ఓట్ల కొరకు రైతుబంధు కొనసాగిస్తున్నది. రైతుకు రుణ పరపతి దెబ్బతిని అప్పులపాలై లక్షకు వడ్డీ మరో లక్ష తోడై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 24 గంటల విద్యుత్ పేరుకే ఉన్నది. రోజుకు 7- లేదా 8 గంటల విద్యుత్ ఇస్తూ సాలీనా రూ.10వేల కోట్లు సబ్సిడీ కడుతున్నామని బుకాయిస్తున్నది. విద్యుత్ పంపిణీ సంస్థలకు వేల కోట్లు బాకీ పెట్టి, ఆ బాకీ తీర్చేందుకు రూ.22వేల కోట్ల విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేసింది. అందులో రైతులు కూడా ఉన్నారు.
- నరహరి వేణుగోపాల్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర నాయకుడు