సిట్టింగులకు టికెట్ల వెనుక .. సీఎం కేసీఆర్ వ్యూహం ఇదేనా?

సిట్టింగులకు టికెట్ల వెనుక .. సీఎం కేసీఆర్ వ్యూహం ఇదేనా?

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు అందరూ ఉహించినదానికి భిన్నంగా అధికార పార్టీ అధినేత సీఎం కేసీఆర్119 సీట్లలో 115 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులను ప్రకటించారు. ‘దమ్ముంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వు’ అని ఛాలెంజ్ చేసిన నాయకులకు ఆయన సవాలు విసిరినట్టు అయింది. కానీ కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయనను బాగా అర్థం చేసుకున్నవారికి పెద్దగా ఆశ్చర్యంగా ఏమీ అనిపించలేదు.

ఎందుకంటే వారు తీసుకునే నిర్ణయాలు చూసేందుకు అహంకారంగా కనిపించినా, అందులో అంతర్మథనం ఉంటది. ఉద్యమ సమయంలో కూడా ఎన్నో సార్లు ఉద్యమాన్ని చల్లబరిచి, మళ్లీ తాను అనుకున్నప్పుడు రాజేసేవారు. అయితే మిలియన్ మార్చ్ కార్యక్రమంలో అది ఫలించలేదు. ఇక కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ప్రకటించడం వెనుక ఏమిటీ వ్యూహం అనే దానిపై సర్వత్రా చర్చనడుస్తున్నది. 

యదాతథ స్థితి

సహజంగా కేసీఆర్ డీఎన్ఏది ఫ్యూడల్ తత్వం. వ్యక్తి లోనైనా లేదా వ్యవస్థలో నైనా ఆయన ఎప్పుడూ యదాతథ స్థితి కోరుకుంటారు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. ‘నోన్ డెవిల్ ఈజ్​ బెటర్ ద్యాన్.. అన్నోన్ ఏంజెల్’ అంటే.. తెలియని అప్సరస కంటే తెలిసిన దయ్యం నయం అన్నట్లు. తాను వేసుకునే బట్టలతో సహా అనివార్యమైతే తప్ప మార్పు కోరుకోరు. టికెట్ల ప్రకటన వెనుక మరో సంకేతం కనిపిస్తుంది. ఈ అభ్యర్థుల ప్రకటనతో కేసీఆర్​ నిర్ణయమే ఫైనల్ అని, చివరకు తనపై వచ్చే విమర్శలకు ప్రతి విమర్శలు చేసే సొంత కొడుకు కేటీఆర్ అభిప్రాయమే కాదు, అభ్యర్థనను కూడా బేఖాతరు చేస్తారనే సంకేతం ఇవ్వడం ఆయన ఉద్దేశంగా తేలింది. లేదంటే కనీసం కేటీఆర్ అభిప్రాయాన్ని గౌరవించేవారు. కుటుంబ ఫలాలు అనుభవించవచ్చు కానీ, పరిపాలన మాత్రం ఓన్లీ కేసీఆర్ అనే సిగ్నల్ ఇచ్చారాయన. 

రాజకీయ వెట్టిచాకిరి

దాదాపు రెండు టెర్మ్​లు ప్రస్తుత ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ వ్యవహార శైలికి అలవాటు పడిపోయారు. రాజకీయ వెట్టిచాకిరికి ఆనందపడుతూ..‘మేసో చిస్మ్’ అనే వ్యాధికి దాసోహం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఒక వేళ హంగ్ వస్తే ‘గొంతు దాకా మెక్కి ఉన్న వీరు’ తనను వదలరనే నమ్మకం ఆయనది. ప్రసుత ఎమ్మెల్యేలు అనేక మంది మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా టికెట్లు ప్రకటించారంటే..‘కేసీఆర్’ ఇమేజ్ తోనే గెలవాలని తనకు తాను రీ బ్రాండ్ చేసుకోవడం ఆయన వ్యూహం. 

ఆర్థిక పరిపుష్టి అతి కీలకం..

కేసీఆర్ మోడల్ పరిపాలన అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రులు కాబట్టి ‘సర్వం స్వాహా” వల్ల ఒక్కో శాసన సభ్యుడు ఒక చిన్న రాష్ట్ర ఎన్నికల ఖర్చు భరించే స్థాయికి ఎదిగారు. అలాంటి వారికి టికెట్ నిరాకరిస్తే, వారు కొత్త అభ్యర్థి ఓటమికి తమ సర్వశక్తులొడ్డుతారనే భయంతో దాదాపు అందరికీ టిక్కెట్లు ఇచ్చారు. సిట్టింగ్​లకు టికెట్ నిరాకరిస్తే, నియోజకవర్గంలో ప్రజలకు తెలిసి ఉండి, ఆర్థికంగా బలంగాఉన్న నాయకులు ఇతర పార్టీ, ప్రత్యేకంగా బీజేపీకి వెళితే తనకు రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని ఆయన భయపడ్డారు.

రాష్ట్రంలో కేసీఆర్, జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కేవలం రాజ్యాంగ అనివార్య విగ్రహాలు. చిన్న కార్యకర్త నుంచి గ్రామ, మండల, నియోజకవర్గ స్థానిక నాయకత్వం మొత్తం ఎమ్మెల్యేలు నియమించిన వారే. సిట్టింగులకు టికెట్ నిరాకరిస్తే, స్థానిక నాయకత్వం సహకరించరనే అభిప్రాయం కేసీఆర్​లో ఉంది. గతంలో అప్పటి కాంగ్రెస్ మంత్రి సత్యనారాయణ రావు సవాలు తీసుకొని కరీంనగర్ ఎంపీగా రాజీనామా చేసి మళ్లీ గెలవడం లాంటి ఎత్తుగడ ఇది. 

కాంగ్రెస్ పార్టీ..

కాంగ్రెస్ పార్టీ నివురుగప్పిన నిప్పులా ఉంది. అందులో రేవంత్ వర్గం, కేసీఆర్ వర్గం, రాహుల్ వర్గం ఇలా మూడు ముక్కలాటలా ఉంది. కొంత క్యాడర్, లీడర్లు ఉన్న ఓటర్లకు నమ్మకం లేదు. కనీసం 20 నుంచి -25 గెలిచే అవకాశం ఉండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఇప్పటికే కేసీఆర్ ఆర్థిక మద్దతు, వారికీ భరోసా ఇచ్చినట్లు తెలుస్తున్నది. వారు ఇచ్చే ఎన్నికల వాగ్దానాలు వృథా అని కర్నాటక సాక్ష్యంగా కనిపిస్తున్నది. అంతిమంగా కాంగ్రెస్ గెలిచే సీట్లు అత్యధికం కేసీఆర్ జోలెలో పోసినట్లే. 

రెండు సీట్లలో పోటీ..

రెండు సీట్లలో పోటీ చేయడం బలహీనత, బలంగా భావించవచ్చు. రెండు ప్రాంత ఓటర్లను ఎవరు ఎక్కువ మెజారిటీ ఇస్తే అక్కడే ఉంటాననడం ఒక తెలివైన ట్రిక్. ఇక కేసీఆర్​ను వ్యతిరేకించే ప్రజల ముందు కాంగ్రెస్, బీజేపీ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో నాలుగు రకాల ఓటర్లు ఉన్నారు. ఒకరు బీఆర్ఎస్ ​పార్టీ కచ్చితమైన ఓటర్లు. రెండు కేసీఆర్ వ్యతిరేక ఓటర్లు, మూడు మోదీ అనుకూల ఓటర్లు. కానీ, రాష్ట్రంలో సందిగ్ధంలో ఉన్న ఓటర్లు, నాలుగు ఎటు తేల్చుకోని ఓటర్లు. 

బీజేపీ బాధ్యత గుర్తు చేస్తున్న ప్రజలు

బీజేపీ ఒక సంస్థాగత, వామన రూపంలో కనిపించే మహా విష్ణు లాంటి  పార్టీ. విశ్వరూపం చూపించినప్పుడే అసలు బలం, బలగం తెలుస్తుంది. మొదటగా కేసీఆర్ కంటే తెలంగాణలో మంచి పాలన అందించగలమనే నమ్మకం కల్గించాలి. ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా అధికంగా అందించగలమనే నమ్మకం కలిగించాలి. నియోజవర్గంలో ఉన్న ఫామ్​హౌజ్​ఎమ్మెల్యేల అహంకారం, ఆస్తి పాస్తుల వివరాలతో  ఒక చార్జ్ షీట్ అవసరం. కేసీఆర్​ఎన్నికల గిమ్మిక్కులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి. కల్వకుంట్ల నలుగురు కుటుంబ సభ్యులు, 4 కోట్ల తెలంగాణ ప్రజల మధ్య జరిగే పోరాటంగా తెలపాలి.

డబుల్ ఇంజిన్ గవర్నమెంట్​గురించి వివరంగా తెలియజేయాలి. సోషల్ ఇంజినీరింగ్ అతి ముఖ్యం. ఆయా సామాజిక వర్గాల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టాలి. అంతిమంగా కేసీఆర్ అతిపెద్ద ఆయుధం “ముక్క, చుక్క, రుక్క”  ను అరికట్టగలిగితే బీఆర్ఎస్ ​ఓడిపోయే అవకాశం ఉంటుంది. బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత బీజేపీదేనని ప్రజలు భావిస్తున్నారు. 

-  డా. బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ,  బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్​