గవర్నర్ స్పీచ్ రోజు అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నారు: కేటీఆర్

గవర్నర్ స్పీచ్ రోజు అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నారు:  కేటీఆర్

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని కేటీఆర్ అన్నారు. గవర్నర్ స్పీచ్ రోజు అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారని తెలిపారు.  ఇవాళ (మార్చి 10) అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కేసీఆర్ కు అవమానం జరగొద్దనేదే తన ఉద్దేశమని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చెప్పే అబద్ధాలపై మాట్లాడాలా..? అని ప్రశ్నించారు. వీళ్ల స్థాయికి తాము సరిపోతామని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ చేయాల్సిన విచారణ చేసే కుంభకోణాలకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని, ఆయనను కేంద్రం కాపాడుతోందని అన్నారు. ఆర్ ఆర్ టాక్స్ అని మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారని, ఇప్పుడెందుకు అరెస్టు చేయడం లేదని అని  ప్రశ్నించారు. అమృత్ స్కాంపై తాను ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తే ఇంతవరకూ స్పందించలేదని అన్నారు.   

 రాహుల్ గాంధీ గుజరాత్ లో మాట్లాడుతూ తమ పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ మొదటి నుంచి  స్ట్రాంగ్ సెంటర్, వీక్ స్టేట్ ఉండాలని కోరుకుంటోందని, అందుకే రేఖాగుప్తాను ఢిల్లీ సీఎంను చేసిందని చెప్పారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫోన్ల ట్యాపింగ్  నడుస్తోందని, ప్రైవేటు వ్యక్తులు కూడా ట్యాపింగ్ లో పాల్గొంటున్నారని ఆరోపించారు. తమతో ఐఏఎస్ లు టచ్ లో ఉన్నారనే విషయం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నారని చెప్పారు.  

రేవంత్ రెడ్డి వెనుక ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విచ్చల విడిగి టీడీఆర్ భూములను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇన్ సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారని ఆరోపించారు.  రేవంత్ రెడ్డికి రాష్ట్రం కోసం డబ్బులు సంపాదించడం తెలియదని, వ్యక్తిగత సంపాదనలో ఆయనే టాప్ సీఎం అని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని, గవర్నర్ స్పీచ్ రోజు హాజరవుతారని అన్నారు. 

బీసీలపై ప్రేముంటే దీక్ష చేయాలె

సీఎం రేవంత్  రెడ్డికి బీసీలపై ప్రేమ ఉంటే జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలని, తాము దడికట్టి కూసుంటామని కేటీఆర్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ,కాంగ్రెస్ కలిస్తే రాజ్యాంగ సవరణ చేయవచ్చన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కుప్పం మున్సిపల్ ను టీడీపీ కోల్పోయిందని, తర్వాత జరిగిన ఎన్నికల్లో 140 సీట్లతో  అధికారంలోకి వచ్చిందని అన్నారు.  

 ఫార్ములా  ఈ  కేసులో నోటీసులు రావచ్చు

బడ్జెట్ సమావేశాల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్లీ ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశాన్ని తెరమీదకు తెస్తారని కేటీఆర్ అన్నారు. తాను ఫార్ములా ఈ రేసు కోసం 46 కోట్లు పెడితే ఏడుస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు  రూ. 200 కోట్లు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ  నెల 16 నుంచి 27వ తేదీ మధ్యలో తనకు నోటీసులు వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. దుబాయ్ లో ఎవరో చనిపోతే తనకేం సంబంధమన్నారు. రేవంత్ కు పిచ్చి అభిప్రాయాలు ఉన్నాయన్నారు.  తెలంగాణ తర్వాత బాగుండాలని నేను కోరుకునేది ఏపీ అని చెప్పారు. రెండు రాష్ట్రాలు టాప్ లో ఉండాలని కోరుకుంటానని అన్నారు.  
స్టాలిన్ నిర్వహించే జేఏసీ మీటింగ్ కు వెళ్లాలా..? లేదా అనేది కేసీఆర్ డిసైడ్ చేస్తారన్నారు. 

30% కమీషన్ తీస్కుంటుండ్రు

రాష్ట్ర మంత్రి 30% కమీషన్ తీసుకొని సెటిల్మెంట్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని అన్నారు. కేసీఆర్  పదేండ్ల పాలనలో ఇలాంటి ఆరోపణ ఎప్పుడైనా వచ్చిందా అని అన్నారు. సిల్వర్ జూబ్లీ కోసమే వరంగల్ లో సభ పెడుతున్నామని చెప్పారు.కాళేశ్వరం విలువ కరువు వచ్చినప్పుడే తెలుస్తుందని అన్నారు. మేడిగడ్డను ఖాళీ చేసినందునే పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.  రేవంత్ రెడ్డి ఆడించే కీలు బొమ్మలను వదలబోమని, అన్నీ నోట్ చేసుకుంటున్నామని చెప్పారు.