రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ప్రజా గోస బీజేపీ భరోసా ముగింపు సమావేశంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం సహకారంతో గొల్లపల్లిలో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆదర్శవంతమైన పాలన కొనసాగుతోందన్నారు.
దేశంలో మోడీ మూడున్నర కోట్ల ఇళ్లు కట్టిస్తే.. రాష్ట్రంలో పేదలకు కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదని వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి కేంద్రం లక్ష కోట్ల నిధులు ఇచ్చిందని చెప్పారు. గత తొమ్మిదేళ్లుగా మోడీ అవినీతిరహిత పాలన సాగిస్తున్నారని.. కానీ కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో అవినీతి పాలన చేస్తున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీ కార్యకర్తలు పోలీసు కేసులకు భయపడొద్దని.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని వ్యాఖ్యానించారు.