జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి
నారాయణపేట, వెలుగు: సీఎం కేసీఆర్ ఆదాయం పెంచుకోవడం కోసం రాష్ట్రంలో లిక్కర్ షాప్‌లను పెంచి ప్రజలను తాగుబోతుల్ని చేస్తున్నారని మాజీ ఎంపీ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి మండిపడ్డారు. సర్కారు ప్రతి షాప్‌పై కేసీఆర్ బొమ్మను పెట్టాలని సూచించారు. ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా నారాయణపేట నియోజకవర్గంలోని ఎక్లాస్పూర్ గ్రామంలో చేపట్టిన బైక్ ర్యాలీని రాష్ట్ర నాయకులు శాంతికుమార్, నాగురావునామాజీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తిచేస్తామన్న సర్కారు ఇప్పటి వరకు ఒక్క రిజర్వాయర్ కూడా కంప్లీట్ కాలేదన్నారు. సీఎం కేసీఆర్ పేట ప్రజలను మోసం చేస్తున్నారని, పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 69 జీవోను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సాగునీరు లేక ఇక్కడి రైతులు పొట్టకూటి కోసం బొంబాయి, హైదరాబాద్ లాంటి నగరాలకు వలస వెళ్తున్నారని వాపోయారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు, ఉద్యోగులకు ప్రమోషన్లు లేవని మండిపడ్డారు. 317 జీవోతో భార్యభర్తలను విడదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పేట జిల్లాకు సైనిక్ స్కూల్మంజూరు చేస్తే బీజేపీకి ఎక్కడ పేరొస్తుందోనని దాన్ని పట్టించుకోలేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్చేసి కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రతంగ్ పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నేతలు సత్యయాదవ్, ప్రభాకర్‌వర్దన్, లక్ష్మి, సాయిబన్న, రఘురామయ్య గౌడ్, వెంకట్‌రాములు, సాయిబాబు పాల్గొన్నారు.
మందులు బయటికి రాయొద్దు
గద్వాల, వెలుగు: జిల్లా హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లకు ఇచ్చే మెడిసిన్ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాయవద్దని కలెక్టర్ వల్లూరు క్రాంతి డాక్టర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సర్కారు దవాఖానాను కలెక్టర్ విజిట్ చేశారు. ఓపీ, చిల్ట్రన్ వార్డు, ఐసీయూ, లేబర్ వార్డులను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. హాస్పిటల్‌లో సరిపడా మందులు ఉన్నాయా..? అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బ్లడ్, యూరిన్ టెస్టులు చేయాలని, సిబ్బంది, డాక్టర్లు 24/7 అందుబాటులో ఉండాలన్నారు. కాన్పుల సంఖ్య పెంచాలని, గర్భిణులు కూర్చునేందుకు చైర్స్ వేయాలని సూచించారు. డాక్టర్లు మెడిసిన్ బయటకి రాస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇండెంట్ పెట్టి అన్ని రకాల మందులు తెప్పించుకోవాలన్నారు. ఓసీ రిజిస్టర్‌లో పేషెంట్ల పేర్లతో పాటు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చందూ నాయక్, డాక్టర్లు శోభారాణి, వృషాలి పాల్గొన్నారు.
వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేయండి
నారాయణపేట, వెలుగు: 16 నుంచి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 16న జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో 10 వేల మందితో భారీ ర్యాలీ, 17న పరేడ్ మైదానంలో జాతీయ పతాకావిష్కరణ ఉంటుందన్నారు. అదే రోజు గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు, మహిళా సంఘాల ప్రతినిధులను బస్సుల ద్వారా హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ గార్డెన్‌లో సీఎం కేసీఆర్ పాల్గొనే కార్యక్రమానికి పంపించనున్నామన్నారు. 18న స్థానిక అంజనా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు కె. చంద్రా రెడ్డి, పద్మజా రాణి, ఆర్డీవో రాంచందర్ నాయక్, డీఎస్పీ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
పనులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
ఆర్‌అండ్‌బీ ఏఈ వేతనం నిలిపివేత
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మన ఊరు–మన బడి పనులను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ ఉదయ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో జిల్లా అధికారుల సమీక్ష నిర్వహించారు. కొల్లాపూర్ మండలంలో పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆర్‌అండ్‌బీ ఏఈ సంపత్ కుమార్ వేతనం నిలిపివేయాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎంపికైన స్కూళ్లను తనిఖీ చేసి 30 మంది విద్యార్థులకు ఒక గది ఉండేలా రిపోర్టు రెడీ చేసి బుధవారం లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 272 స్కూల్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని, ఇందులో రూ. 30 లక్షల లోపు అంచనా వ్యయం గల స్కూళ్లు 66 ఉన్నాయన్నారు. వీటన్నింటికీ టెండర్లు పూర్తిచేసి గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు రూ.4.11కోట్లు మంజూరు చేసి.. 15 శాతం నిధులను నిర్వహణ కమిటీల అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మనూ చౌదరి, ఇన్‌చార్జి పీఆర్ ఈఈ దామోదర్ రావు, రామచంద్రరావు పాల్గొన్నారు.
వారంలోఅవార్డులు పూర్తి కావాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పాలమూరు,రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పునరావాస కేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న అవార్డులను వచ్చే మంగళవారం నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు ఆదేశించారు. మంగళవారం ప్రాజెక్టుల భూసేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఆర్‌ఎల్‌ఐ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సబంధించిన పరిహారం, అవార్డులు జారీ చేయడంలో జాప్యం చేయవద్దన్నారు. పేరూర్ రైల్వేస్టేషన్ భూసేకరణ త్వరగా పూర్తిచేయాలన్నారు. కోస్గి, చించోలి రహదారికి సంబంధించిన ఎలైన్ మెంట్ సర్వే పూర్తయినట్లు ఆఫీసర్లు కలెక్టర్ దృష్టికి తేగా.. రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. వీసీలో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్ కుమార్, తహసీల్దార్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
గ్రామాభివృద్దికి సహకరించాలి
పర్యావరణానికి నష్టం జరగనివ్వొద్దు
బాలానగర్, వెలుగు: పర్యావరణానికి నష్టం జరగకుండా పనులు చేసుకోవడంతో పాటు గ్రామాభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు క్రషర్ పరిశ్రమ యజమాన్యానికి సూచించారు. మంగళవారం మండలంలోని బోడజానంపేటలో క్రషర్ పరిశ్రమ విస్తరణ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ పాల్గొన్నారు. మాజీ ఎంపీటీసీ బాలూనాయక్ మాట్లాడుతూ క్రషర్ పరిశ్రమను విస్తరించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలో గ్రామానికి చెందిన 16 మంది పని చేస్తున్నారని పలుగుడ్డ తండా సర్పంచ్ భర్త రాంబాబు చెప్పారు. ఓవర్ లోడ్ వాహనాలతో రోడ్డుపై గుంతలు పడుతున్నాయని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బ్లాస్టింగ్ టైంలో ప్రజలకు, రైతులకు సైరన్ మోగించి సమాచారం ఇవ్వాలని సూచించారు.
బాల్యవివాహాలు జరగనివ్వొద్దు
వనపర్తి, వెలుగు: బాల్య వివాహాలు జరగకుండా అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కులు-, చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు అడిషనల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్‌తో కలిసి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలతో ఆరోగ్య సమస్యలు వస్తాయని, 18 ఏండ్లు నిండిన తర్వాతే పెళ్లిళ్లు చేయాలన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై పేరెంట్స్ శ్రద్ధ పెట్టాలని సూచించారు. కిశోర బాలికలు, గర్భిణులు, చిన్నారులకు ఇస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. డీడబ్ల్యూవో పుష్పలత ఆపదలో ఉన్న స్త్రీలకు సఖి కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. బాల్యవివాహాలు అరికట్టేందుకు సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రవిశంకర్, డీఆర్డీవో నరసింహులు, డీపీవో సురేశ్ పాల్గొన్నారు.