కేసీఆర్​ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం.. వన్డే, ట్వంటీ ట్వంటీ, టెస్టు ఏదైనా ఆయన ఆడగలరు: హరీశ్

కేసీఆర్​ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం.. వన్డే, ట్వంటీ ట్వంటీ, టెస్టు ఏదైనా ఆయన ఆడగలరు: హరీశ్

కేసీఆర్​ అంటే వ్యక్తి కాదు, నాయకుడు కాదని, నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగమని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​ రావు అన్నారు.  ‘‘కేసీఆర్​ కారణజన్ముడు. 16 ఏండ్ల వయసులోనే జై తెలంగాణ అంటూ ఉద్యమంలో పాల్గొన్నారు. నాడు  తెలుగు దేశం పార్టీలో పనిచేసినా తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తూనే ఉండేవారు. వందలు, వేల గంటల మేధోమథనం తర్వాత తెలంగాణ ఉద్యమానికి  శ్రీకారం చుట్టారు. 

తెలంగాణ కోసం కేసీఆర్​ ఎంతో శ్రమించారు. మొండి ధైర్యంతో పోరాటం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు.. దటీజ్​ కేసీఆర్” అని పేర్కొన్నారు. ‘‘సీఎం రేవంత్​ రెడ్డి ట్వంటీ ట్వంటీ మ్యాచులు ఆడుతున్నానంటున్నారు. కానీ, ఆయన ఆడుతున్నది తొండి మ్యాచులు. నీ(రేవంత్​)  మాటల్లో తొండి, హామీల అమల్లో తొండి. కానీ కలెక్షన్లలో మాత్రం ట్వంటీ ట్వంటీ. 

కేసీఆర్​ ఏదైనా ఆడగలడు.. టెస్టు, వన్ డే, ట్వంటీ ట్వంటీ ఏదైనా అద్భుతంగా ఆడుతడు. ఎప్పుడు ఏది ఆడాల్నో కేసీఆర్​కు బాగా తెలుసు. అవసరం అయితే డిఫెన్స్ అడుతడు, అవసరం అయితే సిక్స్ లూ కొడుతడు’’ అని హరీశ్​రావు తెలిపారు. తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్​ మొండి పట్టుదల, పోరాటం వల్లేనని అన్నారు.  ఫిబ్రవరి 17 ఎంత ముఖ్యమో.. నవంబర్​ 29 కూడా అంతే ముఖ్యమని హరీశ్​ తెలిపారు.