
- ఏపీ నాయకులతో కుమ్మక్కై 299 టీఎంసీలకే సంతకం పెట్టారు: బండి సంజయ్
- జగన్తో దోస్తానీ చేసి ఇక్కడి ప్రజలకు తీరని ద్రోహం
- నీళ్ల వాటాలో తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్యాయం..
- దక్షిణ తెలంగాణ ఎడారిగా మారేందుకు ఈ పార్టీలే కారణమని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఏపీ నాయకులతో కలిసి చేపల పులుసు, బిర్యానీలు తిని తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని, కృష్ణా జలాల విషయంలో మొదటి ద్రోహి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. మళ్లీ ఏమీ తెలియనట్టు నంగనాచిలా కృష్ణ జలాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే కారణమని చెప్పారు.
కృష్ణా జలాల ఇష్యూపై రెండు పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ లో ఆ పార్టీ నేతలతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో మన వాటా 575 టీఎంసీలు రావాల్సి ఉండేదనీ, కానీ కేసీఆర్ ఏపీ నాయకులతో కుమ్మక్కై 299 టీఎంసీలకే సంతకం పెట్టారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒప్పందాలను ఆధారాలతో సహా బయట పెట్టినా.. ఇప్పటికీ కేసీఆర్ స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా 299 టీఎంసీలకే ఒప్పుకొంటూ కేసీఆర్ ఎలా సంతకం పెట్టారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని కోరారు.
జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ కుమ్మక్కయ్యారని, ఆయనకు బిర్యానీ తినిపించి, చేపల కూర తిని.. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారని, అన్న, తమ్ముడు అని చెప్పుకుంటూ తెలంగాణ కొంప ముంచారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారని, ఇక ఆ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ చీకటి మిత్రులని, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేందుకు అభ్యర్థులను నిలబెట్టకుండా కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా– ఈ రేస్ కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ కేసుల విషయంలో ఈ రెండు పార్టీలు కాంప్రమైజ్ అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి పోయి కాంప్రమైజ్ అయిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. తమపై కేసులు పెట్టొద్దని, ఇద్దరం కలిసి బీజేపీని అడ్డుకుందామని కేసీఆర్ ప్రతిపాదించారని ఆరోపించారు.
తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించినం
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు భారీగానే నిధులు వచ్చాయనీ, పన్నులు, పథకాల రూపంలో రూ.1.08 లక్షల కోట్లు కేటాయించినట్టు బండి సంజయ్చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్ధమని అన్నారు. కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులని విమర్శించారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తున్నదని అన్నారు.
తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలవారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్రం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధమా? అంటూ కాంగ్రెస్ నేతలకు సంజయ్ సవాల్ విసిరారు. ట్యాక్స్ డివల్యూషన్ రూపంలో రూ.29,899 కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ.21,075 కోట్లు, రైల్వేల అభివృద్ధికి 5, 336 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అభివృద్ధి కోసం ఈ ఏడాది బడ్జెట్ లో తెలంగాణకు రూ.2 500 కోట్ల మేరకు రుణాలివ్వబోతున్నామని చెప్పారు. భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్యపై విచారణ జరిపి, నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి., అందులో 10 శాతం ముస్లింలకు కేటాయిస్తే ఏం న్యాయం చేసినట్టు అని ప్రశ్నించారు.